Breaking News

SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం

Published on Sat, 11/05/2022 - 04:04

ఓ భారతీయ యువతీ! తెల్లగా ఉండడమే అందానికి కొలమానం అని ఎవరు నిర్దేశించారు? అందంగా ఉన్న వాళ్లే విజేతలవుతారని నీకు ఎవరు చెప్పారు? ఆత్మవిశ్వాసానికి తెల్లగా ఉండడమే గీటురాయి అనే సూత్రం ఎలా వచ్చింది? మీ రెజ్యూమెలో మార్కులతో రాని ఆత్మవిశ్వాసం అందంతో వస్తుందా? నీకు ఉద్యోగం తెచ్చేది నువ్వు సాధించుకున్న మార్కులే... తెల్లదనం కాదు. తెల్లదనమే అందమనే అపోహ కాస్మెటిక్‌ మార్కెట్‌ సృష్టించిన మాయాజాలం. ఈ మాయాజాలం ఇప్పుడు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అరగంట ఎండను తాళలేకపోతే సమానత్వ పోరాటంలో మహిళ స్థానమెక్కడ?

భారతీయ మహిళలు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు కంటే అందంగా కనిపించడం కోసం చేసే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలకు ఇది తొలి సంకేతం. వైటెనింగ్‌ క్రీమ్‌లు వాడుతున్న వాళ్లను ముంబయిలో ఓ సంస్థ ప్రశ్నించినప్పుడు ‘తెల్లగా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాననే ఉద్దేశం తో ఫెయిర్‌నెస్‌క్రీమ్‌ని వాడుతున్నాను’ అని కొందరు బదులిచ్చారు.

ఇంకా... ‘మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వాడమని చెప్పారు, వాడినప్పుడు బావున్నానని చెప్పారు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను... అని, సినిమా వాళ్లు, యాడ్‌లో ఈ క్రీమ్‌లు వాడినందువల్లనే అందంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి నేను కూడా అలా కనిపించడం కోసం వాడుతున్నాను’... ఇలాంటి సమాధానాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే... కోల్‌కతాకు చెందిన సోమా బానిక్‌ చేదు అనుభవం ఇలా ఉంది.
∙∙
అది 2003, సోమా బానిక్‌కి పద్నాలుగేళ్లు. అప్పుడు సోమా బానిక్‌ తల్లితో ఓ పక్కింటావిడ అన్న మాటలు ఆ అమ్మాయి జీవితం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించాయి. ‘చర్మాన్ని తెల్లబరచడానికి మార్కెట్‌లో అన్ని క్రీమ్‌లున్నాయి కదా! మీ అమ్మాయికి ప్రయత్నించండి. కొత్తగా ఫలానా క్రీమ్‌ వచ్చింది. మంచి ఫలితం ఉంటోందట’ అని వైటెనింగ్‌ క్రీమ్‌ పేరు కూడా చెప్పిందా పక్కింటావిడ.

 తెల్లగా ఉంటేనే విజేతలవుతారా!
ఒక అమ్మాయి విజేతగా నిలవడానికి దగ్గర దారి తెల్లగా ఉండడమే అన్నంతగా కాస్మెటిక్‌ కంపెనీలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రోజులవి. క్రీమ్‌ని వాడడం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్కూల్లో ఫ్రెండ్స్‌ సోమా చర్మంలో వచ్చిన మార్పును గుర్తించడం, ప్రశంసించడం మొదలైంది. రెండు నెలలు గడిచేటప్పటికి అసలు సమస్య మొదలైంది. ఎండలోకి వెళ్తే చర్మం చిరచిరలాడడం, మంట, దద్దుర్లు రావడం మొదలైంది. వైటెనింగ్‌ క్రీమ్‌ వాడేవాళ్లు ఇలాంటి మార్పును స్వచ్ఛందంగా స్వాగతిస్తారు.

చర్మం తెల్లగా అయ్యే క్రమంలో ఇలాగే ఉంటుందని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. సోమా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. ఓ రోజు... క్రీమ్‌ రాసుకోవడం మరిచిపోయింది. స్కూలుకు వెళ్లిన కొద్ది గంటలకే ఆమె గడ్డం మీద చిన్న మచ్చలా మొదలై మొటిమలా తేలింది. ఇక క్రమం తప్పకుండా క్రీమ్‌ రాస్తూ ఏడాది పాటు కొనసాగించింది. చెంపల మీద మొదలైన సన్నని వెంట్రుకలు ముఖమంతా రావడాన్ని గమనించిందామె.

ఇప్పుడామె వయసు 33. కోల్‌కతాలో స్టేట్‌గవర్నమెంట్‌ ఉద్యోగిని. ఇప్పుడామె భర్త ఎపిలేటర్‌ సహాయంతో ముఖం మీది వెంట్రుకలను తొలగించడంలో సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ సోమా బానిక్‌ తన బ్లాగ్‌లో రాసుకున్న వివరాలు. ఈ లక్షణాలను విశ్లేషించిన డెర్మటాలజిస్టులందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే... ‘చర్మం తెల్లగా మారడానికి ఆమె వాడిన వైటెనింగ్‌ క్రీమ్‌లో ఉన్న స్టిరాయిడ్స్‌ కారణం’ అని. అది కూడా దీర్ఘకాలం వాడడం వల్ల వెంట్రుకల వంటి సమస్యకు దారి తీసిందనీ.
 
రంగు మార్చే క్రీమ్‌లు లేవు!
చర్మం రంగును క్రీమ్‌లతో మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నారు బెంగళూరుకు చెందిన డెర్మటాలజిస్ట్‌ ప్రియాంక రెడ్డి. ‘‘డెర్మటాలజీలో ఎంతటి అధునాతనమైన యంత్రాలు, ఔషధాలు వచ్చాయంటే... కోటి రూపాయల మెషినరీ కూడా ఉంది. కానీ చర్మాన్ని తెల్లబరిచే యంత్రం కానీ ఔషధం తయారు కాలేదు, కాదు కూడా. ఎందుకంటే చర్మం రంగు జన్యుపరంగా నిర్ణయమవుతుంది. అలా నిర్ణయమైన చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చడానికి వీలుంటుంది.

గ్లూమింగ్‌తోపాటు చర్మం మెరుపుతో కాంతులీనేటట్లు చేసే ట్రీట్‌మెంట్‌లున్నాయి. కానీ తెల్లబరిచే ట్రీట్‌మెంట్‌లు లేవు. అది ఆరోగ్యకరం కాదు కూడా. కొంతమంది హీరోయిన్లను ఉదాహరణ గా చూపిస్తూ ఉంటారు. కానీ అది మేకప్, కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్‌ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్లు ఆరోగ్యకరమైన ట్రీట్‌మెంట్‌లు చేయించుకుంటారు తప్ప స్టిరాయిడ్స్, హైడ్రోక్వైనోన్‌లు ఉండే వైటెనింగ్‌ క్రీమ్‌ల జోలికి వెళ్లరు. చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన పద్ధతులనే అవలంబిస్తారు’’ అని చెప్పారామె.

స్కిన్‌ వైటెనింగ్, లైటెనింగ్‌ వంటి హానికారకమైన డ్రగ్స్‌ మీద ఆంక్షలు విధించాలని 2017లో ఐఏడివీఎల్‌ (ఇండియన్‌ అసోసిÄేæషన్‌ ఆఫ్‌ డెర్మటాలజిస్ట్స్‌ వెనెరియాలజిస్ట్‌) ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. నిషేధిత ఔషధాలు మార్కెట్‌లో యధేచ్ఛగా లభించడం మనదేశంలో జరుగుతున్న అరాచకమే. ‘అప్పియరెన్స్‌లో ఏముంది’ అని చెప్పడం సులువే, కానీ సమాజం అప్పియరెన్స్‌నే ప్రధానంగా చూస్తూ తోటివారిని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. సమాజం ఆలోచన మారి తీరాల్సిందేనన్నారు ప్రియాంక. అసలు ఈ తెల్లదనపు మాయకు ఆజ్యం పోసింది మన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ అంటే ఆశ్చర్యం కలగక మానదు.

రవివర్మ చిత్రలేఖనాన్ని డచ్‌ చిత్రకారుడి దగ్గర నేర్చుకోవడం... మన భారతీయ మహిళల మీద ఈ స్థాయిలో తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించింది. ఆయన చిత్రించిన బొమ్మల్లో చాలా వరకు తెల్లగా యూరోపియన్‌ స్కిన్‌టోన్‌తో ఉంటాయి. ఆ బొమ్మల క్యాలెండర్లు దాదాపుగా అన్ని ఇళ్లకూ చేరాయి. అందంగా ఉండడం అంటే చర్మం తెల్లగా ఉండాలనే అపోహ కూడా ఇంటి గోడల నుంచి మెదడుకు దారి తీసింది. సమాజం ఈ అపోహ నుంచి బయటపడాలంటే మేధోవికసితమైన ఉద్యమం ఒకటి మౌనంగానే అయినా మొదలు కావాలి. అప్పుడు వైటెనింగ్, లైటెనింగ్‌ క్రీమ్‌ల మార్కెట్‌ మనదేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది.

ఆరోగ్యమే అందం
వైటెనింగ్‌ క్రీమ్‌లను రెండు నుంచి మూడు నెలలు వాడినప్పటి నుంచి చర్మం పలుచబడడం, ఎర్రబారడం మొదలవుతుంది. ఎంతగా అంటే.. రక్తనాళాలు కనిపించేటంతగా పలుచబడుతుంది. ఆపేయగానే మొటిమలు, పిగ్మెంటేషన్‌ (మంగు) మొదలవుతాయి. దీర్ఘకాలం వాడితే చర్మం మీద వెంట్రుకలు మొదలవుతాయి. చర్మ సంరక్షణకు సాధారణంగా అవసరమయ్యేవి మాయిశ్చరైజర్, సన్‌ స్క్రీన్, ఫేస్‌ వాష్‌లు మాత్రమే. అంతకు మించి ఏ అవసరం ఏర్పడినా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. చర్మతత్వాన్ని స్వయంగా పరిశీలించి, సమస్యను, వయసును దృష్టిలో పెట్టుకుని క్రీమ్‌ లేదా లోషన్‌లను వాడాల్సి ఉంటుంది.  తెల్లదనం కోసం ఖర్చు పెట్టడం వృథా ప్రయాస మాత్రమే. పొల్యూషన్‌ చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా కాంతులీనుతుంది. మంచి ఆహారం, తగినంత నిద్ర, నీరు తీసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలాగే ఎక్సర్‌సైజ్‌ చేసి చెమట ద్వారా మలినాలు బయటకు పంపించడం కూడా చర్మానికి మెరుపునిస్తుంది.
– డాక్టర్‌ ప్రియాంక రెడ్డి,   మెడికల్‌ డైరెక్టర్, డీఎన్‌ఏ స్కిన్‌ క్లినిక్, బెంగళూరు

– వాకా మంజులారెడ్డి
 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)