జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్
ప్రతి రుచీ ఆస్వాదిస్తూ...
Published on Thu, 03/19/2026 - 01:14
ఈ కాలపు జనరేషన్‌కి ఉగాది గురించి ఏం తెలుసు? అనేవారున్నారు. ఈ డిజిటల్ యుగంలో బిజీగా ఉండే నవతరానికి తెలుగింటి సంప్రదాయం ఎంత పరిచయం? తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్టూడెంట్లు కొందరిని పలకరించింది సాక్షి ఫ్యామిలీ. వారి స్పందన ఇక్కడ ఉంది. చదివాక మీరంటారు మన పిల్లలు తెలుగుదనాన్ని కొనసాగిస్తున్నారనీ... తెలుగుదనానికి అద్దం పడుతున్నారనీ....
యుగం + ఆది, ఒక కొత్త యుగానికి ఆరంభం,
బ్రహ్మదేవుని సృష్టికి ఆయువు పోసిన క్షణం,
కాలం మొదటి అడుగు వేసిన సమయం.
మామిడి తోరణాల అలికిడి,
ప్రకృతితో మన అనుబంధానికి గుర్తు.
పంచాంగ శ్రవణ జ్ఞాననాడి,
భవిష్యత్తు అనే కాలాన్ని గౌరవించే గుర్తు.
చిగురించిన కొమ్మలు, వికసించిన పువ్వుల సందడి,
మళ్ళీ మొదలుపెట్టమని ఒక ఆశల పల్లకికి గుర్తు.
కొత్త వస్తువుల హడావిడి,
కొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి గుర్తు.
బ్రహ్మదేవుని సృష్టిని మొదలుపెట్టిన శుభముహూర్తం,
మన తెలుగు సంస్కృతికి ఒక మొదటి అధ్యాయం,
ప్రతి గుండెలో వెలుగు నింపే ఆనందం, ఉగాది ఉదయం,
ఇంటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు,
మన మనసులోని బాధల్ని శుభ్రం చేయడం.
ఉగాది పచ్చడిలో ఉన్న రుచులు,
తీపి, కారం, పులుపు, చేదు, ఉప్పు, వగరు,
మన జీవితంలోని భావాలు,
ప్రతి రుచిని అంగీకరించండి మీరు.
ఉగాది అంటే మారుతున్న కాలం కాదు,
మారుతున్న మనసు, జీవితం,
కొత్త ఆశ, కొత్త ప్రయాణం,
అది అనుసరించడం ముఖ్యం.
అందరికీ శ్రీ పరాభవ నామ
సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
– చిక్కాల షర్మిల
నవ సంజీవని
ఉగాది అంటే ప్రపంచానికి తొలి ఉషస్సు.
మానవజాతి మనుగడకు
్రపాణం పోసిన నవసంజీవని
ఉత్సాహాల ఉషస్సులతో మదిలోని
ఇంద్రనస్సులా ఊయలలూగే ఊసులతో
ఆకాశ వీధిలో అందాల జాబిలిలా
సంవత్సరంలో వచ్చే తొలి చంద్రరేఖ నా ఉగాది
ఉగాది మన ధర్మం, అదే మనకు ధర్మపథం.
వసంత నవరాత్రుల రాక
ప్రకృతిని పూజించే సుషుమ్న కాంతి రేఖ నా ఉగాది.
షడ్రుచుల సమ్మేళనం నా ఉగాది, భవ్య పదం నా ఉగాది
పరాభవాలను పారద్రోలి విజయానుభవాలను కలుగజేసే నా ఉగాది.
– దేవి సరస్వతి
కాలం చెప్పే సూచిక...
ఉగాది అనేది కేవలం కొత్త సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితంలోని అనేక భావోద్వేగాలు, అనుభవాల మిశ్రమమని గుర్తు చేసే ఒక అందమైన సందేశం. ఉగాదికి ప్రత్యేకత ‘ఉగాది పచ్చడి‘. ఆరు రకాల రుచులతో తయారు చేసే ఔషధం. ప్రతి రుచి జీవితంలోని ఒక్కో భావాన్ని సూచిస్తుంది. తీపి ఆనందానికి, చేదు బాధకు, పులుపు ఆశ్చర్యాలకు, కారం కోపానికి, ఉప్పు భయానికి, వగరు సవాళ్లకు సూచికగా ఉంటుంది. ఉగాది మనకు జీవితం ఎప్పుడూ తీపిగా ఉండదని, కానీ ప్రతి అనుభవం మనలను మరింత బలంగా, జ్ఞానవంతులుగా మార్చుతుందని నేర్పుతుంది. ఇది గత సంవత్సరపు తప్పులు, బాధలు, ఆందోళనలను వెనక్కి వదిలేయాలని కూడా మనకు గుర్తు చేస్తుంది.
మనమందరం కలిసి సంతోషంగా ఉండాలని, ఉగాదిని ఆనందంగా జరుపుకోవాలని, మంచి పనులు చేయాలని కాలం చెప్పే సూచిక. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, మామిడి ఆకులతో అలంకరిస్తాం, కొత్త బట్టలు ధరించి, శాంతియుతమైన, విజయవంతమైన సంవత్సరానికి నాంది కావాలని ప్రార్థిస్తాం. ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అని చాలా మందికి నమ్మకం. ఉగాది కేవలం క్యాలెండర్ మార్పు కాదు ఇది విశ్వం తన ప్రయాణాన్ని ప్రారంభించిన క్షణాన్ని సూచిస్తుంది. ఉగాదికి మరో ప్రత్యేక సంప్రదాయం ‘పంచాంగ శ్రవణం’. ఇందులో పండితులు సంవత్సర ఫలితాలను చదివి వినిపిస్తారు. ఇది కాలం చక్రంలా తిరుగుతుందని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మపరిశీలన, ఆశల పునర్జన్మకు సూచిక.
– బొందుగుల వర్షిణి రెడ్డి
ప్రకృతికి దగ్గరగా!
తెలుగు తనాన్ని మరింత అందంగా చూపే పండగ ఉగాది. పసుపు రాసిన గడపలు, మామిడితోరణాలు.. ప్రకృతే మన ఇంటికి వచ్చిందా అనిపించే పండగ ఉగాది. ఎంతటి మోడర్న్ వారైనా సంప్రదాయ దుస్తులతో అందంగా అలంకరించుకుంటారు. కొత్త కుండలో ఒక్కటిగా కలిపిన ఆరు రుచుల పచ్చడి కుటుంబంలో అందరినీ ఐక్యంగా ఉండమని చూపుతుంది. అంతేకాదు, ఆరు రుచులు కలిసిన ఏడవ రుచి కుటుంబ సభ్యుల మధ్య నిండిన ప్రేమను పరిచయం చేస్తుంది. వసంతకాలంలో కొత్త చిగుళ్లు తిని కూసే కోకిలల గొంతులు ప్రకృతికి దగ్గరగా ఉండమని చెబుతాయి. సంతోషంగా మన జీవితాలు సాగాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, అది ప్రకృతి ద్వారా మనకు లభిస్తుందని వేప, మామిడి, చెరకు,.. వివిధ రకాల చెట్ల గొప్పతనాన్ని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్నీ మనకు తెలియజేస్తుంది. నిరుత్సాహంగా అనిపించే రోజుల్లోకి కొత్త ఆశల చిగుళ్లను మోసుకువచ్చేది ఉగాది.
– లాస్య దేశ్‌ముఖ్
గెలుపే కాదు చేదు కూడా!
ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ ఆరు రుచులు మన జీవితంలోని ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం, సవాళ్లను సూచిస్తాయి. ఈ పచ్చడి మనకు జీవితంలో అన్ని రకాల అనుభవాలు ఉంటాయని తెలియజేస్తుంది. ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకొని, నూనె, నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దేవుడిని పూజిస్తాం. ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని. ఈ ఉగాది కొత్త ఆశలకు, ఆనందానికి, జీవితంలో కొత్త ప్రారంభాలకు నాందిగా నిలవాలని, బాగా చదువుకోవాలని, ఉన్నతంగా జీవించాలనే ఆశతో ఉండాలి. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఉగాది పచ్చడిని గుర్తుతెచ్చుకొని, తిరిగి ఆశను నింపుకోవచ్చు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ అన్ని విధాల గెలుపునే కాదు చేదు అనుభవాలను కూడా ఇస్తుంటుంది. అన్నింటినీ సమానంగా తీసుకుంటూ, ఉత్సాహంగా జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. విద్యారంగంలో మనమంతా నూతనోత్సాహంతో, సరికొత్త ఆలోచనలతో మరింత సృజనాత్మకతతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.
– మద్ది తనిష్కారెడ్డి
అన్నీ సమానంగా...
తెలుగు ఇంటికి ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ఆరంభం. ఆశ, కృతజ్ఞత, విశ్వాసంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ప్రత్యేకమైన క్షణం. మా ఇంట్లో ఉగాది చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధంతో నిండిన అనుభూతి. పండగ రోజున మేమంతా అత్యంత ఇష్టమైన సంప్రదాయ దుస్తులను ధరిస్తాం. ఆడవాళ్లు పట్టు చీరలు, సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబవుతారు. ఇంటిని పూలతో, మామిడి ఆకులతో అందంగా అలంకరిస్తాం. పూజ గదిని శుభ్రం చేసుకుంటాం. ఉగాది పచ్చడి తయారుచేస్తాం. ఈ పచ్చడి తయారీలో ఇంటిల్లిపాది పాల్గొంటాం. వేప ఆకులు, బెల్లం, చింతపండు రసం, మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తాం.
ఇందులోని ప్రతి రుచి జీవితంలోని విభిన్న భావాలను సూచిస్తుంది. సంతోషం, బాధ, ఆశ్చర్యం, కోపం, సమతుల్యత, మనం వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అందమైన సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. తర్వాత పంతులుగారు చెప్పే పంచాంగం వింటాం, ఆయన మాటలు వచ్చే సంవత్సరానికి దారి చూపుతూ, శుభాశయాలను కలిగిస్తాయి. తర్వాత మా పండుగలో ముఖ్యమైన భాగంగా అందరం కలిసి వంట చేయడం. మామిడి పప్పు, మామిడికాయ పచ్చడి, పూరీ కుర్మా, రసం, మామిడికాయ పులిహోర, బొబ్బట్లు వంటి వంటకాలు తయారు చేస్తాం. మేం మా ఇంట్లో ప్రతి యేటా దాదాపు ముప్పై మంది కలిసి పండుగను జరుపుకుంటాం.
– రచిత లింగా
నిర్వహణ: నిర్మలారెడ్డి
Tags : 1