ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది
Breaking News
సెల్ ఫోన్‌లో సెకండ్ ఫ్యామిలీ
Published on Sun, 01/25/2026 - 10:19
‘‘హాయ్, మీకు సెకండ్ ఫ్యామిలీ ఉందా?’’ అని అడిగితే ఎవరికైనా కోపమొస్తుంది. ‘‘ఏమ్మాట్లాడుతున్నావ్? సైకాలజిస్టువి కదా, ఆ మాత్రం సెన్స్ లేదా?’’ అని నాపై మండిపడతారు. కాని, చాలామందికి ఇప్పటికే సెకండ్ ఫ్యామిలీ ఉందంటే ఆశ్చర్యపోతారు. ఆ ఫ్యామిలీ మీ సెల్ ఫోన్‌లోనే ఉంది.
ఈ తరంలో రాత్రిపూట గది తలుపులు వేసుకుని స్క్రీన్ ముందు కూర్చుని, వర్చువల్ ప్రపంచంలో కొత్త ‘కుటుంబాలను’ వెతుక్కుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కళ్లముందున్న భార్య, భర్త, తల్లిదండ్రులు విసుగ్గా, భారంగా అనిపిస్తున్న వేళ ముఖం తెలియని గేమింగ్ పార్టనరో, డిస్కార్డ్ గ్రూప్ సభ్యుడో ప్రాణస్నేహితుడిగా మారిపోతున్నాడు. దీనినే సైకాలజీలో ‘సెకండ్ లైఫ్ ఫ్యామిలీస్’ అని పిలుస్తున్నారు.
ఇది ఎస్కేపిజమే!
మనుషులు ఆన్‌లైన్ గ్రూపులకు ఎందుకు అతుక్కుపోతారో వివరించడానికి ‘సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ’ ఒక చక్కని ఆధారంగా నిలుస్తుంది. ప్రతి మనిషికి మూడు ప్రాథమిక అవసరాలు ఉంటాయి.
1. తన ఇష్టానుసారం జీవించే స్వయంప్రతిపత్తి
2. ఏదైనా సాధించగల సామర్థ్యం, సాధించాననే తృప్తి
3. ఇతరులతో అనుబంధం
నిజ జీవితంలో బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్ల ఈ మూడూ దెబ్బతిన్నప్పుడు, మనిషి ఆన్‌లైన్ లోకంలో వీటిని వెతుక్కుంటాడు. ఒక మల్టీప్లేయర్ గేమ్‌లో మీరు ఒక సామ్రాజ్యాన్ని ఏలవచ్చు (సామర్థ్యం), అక్కడ మీకు నచ్చిన పేరుతో ఉండవచ్చు (స్వయం ప్రతిపత్తి), మిమ్మల్ని పొగిడే స్నేహితులు ఉంటారు (సంబంధం).
మళ్లీ ఇంటికి చేరుకోవడం ఎలా?
రోజూ కనీసం రెండు గంటల పాటు ఫోన్లకు దూరంగా ‘నో–టెక్ జోన్’ సమయాన్ని కేటాయించండి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు స్క్రీన్ చూడటం మానేయాలి.మీ కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు ఫోన్ పక్కన పెట్టి వారి కళ్లలోకి చూస్తూ వినండి. ‘నీ రోజు ఎలా గడిచింది?’ అనే చిన్న ప్రశ్న పెద్ద మార్పును తెస్తుంది.
నిజ జీవితం ఎప్పుడూ ఎగై్జటింగ్‌గా ఉండదు. ఆ నిశ్శబ్దాన్ని, ఆ సాదాసీదా సమయాన్ని కుటుంబంతో గడపడం నేర్చుకోండి. బోర్ కొట్టిన ప్రతిసారీ ఫోన్ తీయడం మానేయండి.
కేవలం స్క్రీన్‌లకే పరిమితం కాకుండా కలిసి నడవడం, బోర్డ్ గేమ్స్ ఆడటం లేదా వంట చేయడం వంటి పనులు చేయండి. ఇది ఆన్‌లైన్ ప్రపంచం ఇచ్చే ‘డోపమైన్’ను సహజంగా అందిస్తుంది.
ఒకవేళ మీరు ఆన్‌లైన్ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతుంటే, అది ‘ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్’ కావచ్చు. అప్పుడు సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.
ఆన్‌లైన్ స్నేహితులు మీ ఒత్తిడిని తగ్గించవచ్చు, కాని, మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ పక్కన ఉండి సేవ చేసేది, మీ కన్నీళ్లు తుడిచేది మీ కుటుంబ సభ్యులే. టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని కలపడానికి ఉండాలి కాని, పక్కనే ఉన్న మనసులను విడదీయడానికి కాదు.‘సెకండ్ లైఫ్’లో హీరోగా ఉండటం కంటే, ‘ఫస్ట్ లైఫ్’లో మంచి కొడుకుగా, కూతురుగా లేదా భాగస్వామిగా ఉండటంలోనే నిజమైన సార్థకత ఉంది.
కుటుంబం ఎందుకు ‘బోరు’ కొడుతోంది?
నిజమైన బంధాలు కష్టంతో కూడుకున్నవి. అక్కడ అలకలు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి, ఆర్థిక లెక్కలు ఉంటాయి. కాని, ఆన్‌లైన్ బంధాలకు నిబద్ధత అవసరం లేదు. మీకు నచ్చకపోతే లాగౌట్ అయిపోవచ్చు. ఆన్‌లైన్ ఫ్రెండ్స్ మీతో ఎప్పుడూ సరదాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్లకు మీ ఇంటి సమస్యలతో సంబంధం లేదు. ప్రతి లైక్, ప్రతి విక్టరీ మెసేజ్ మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది, ఇది ఒక డ్రగ్‌లాంటి వ్యసనంగా మారుతుంది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
పర్‌డ్యూ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, ఆన్‌లైన్ గేమర్లలో దాదాపు 30శాతం మంది తమ నిజ జీవిత భాగస్వాముల కంటే తమ గేమింగ్ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ మానసిక అనుబంధాన్ని కలిగి ఉన్నారని తేలింది.
దాదాపు 60 శాతం మంది యువత తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి సోషల్ మీడియా కమ్యూనిటీలను ‘ప్రత్యామ్నాయ కుటుంబం’గా భావిస్తున్నారు.
దీనివల్ల విడాకుల రేట్లు, కుటుంబాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ గత పదేళ్లలో 40శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
సెకండ్ లైఫ్‌తో ప్రమాదాలు
ఇంట్లో మనుషులు ఉన్నా వారితో మాట్లాడలేకపోవడం వల్ల తీవ్రమైన ఒంటరితనం కలుగుతుంది.
కళ్లలోకి చూసి మాట్లాడటం, ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడం తగ్గిపోతుంది.
ఆన్‌లైన్ ప్రపంచం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది కాని, లాగౌట్ అయిన వెంటనే నిజ జీవితం ఇంకా భయంకరంగా కనిపిస్తుంది.

Tags : 1