Breaking News

10 కోట్ల ఎకరాలు.. ఏటా రూ.2,15,625 కోట్లు!

Published on Tue, 06/17/2025 - 03:48

రసాయనిక ఎరువులతో కూడిన ‘హరిత విప్లవాని’కి డా. నార్మన్‌ బోర్లాగ్‌ నాంది పలికితే.. ‘సూక్ష్మజీవులతో కూడిన హరిత విప్లవాని’కి డాక్టర్‌ మారియాంజెలా హంగ్రియా నాంది పలికారు. మాతృదేశం బ్రెజిల్‌ను సోయా తదితర వ్యవసాయోత్పత్తుల్ని అధికంగా ఎగుమతి చేసే దేశంగా మార్చటంలో ఆమె కృషి అపూర్వమెనది. 

అద్వితీయమైన సాయిల్‌ మైక్రోబయాలజిస్టుగా ఆమె రైతాంగానికి అందించిన 30కి పైగా బాక్టీరియా ఆవిష్కరణల ఫలితంగా బ్రెజిల్‌ రైతులు ఏటా రూ. 2,15,625 కోట్ల మేరకు లబ్ధి పొందుతున్నారని అంచనా. ఈ ఏడాది ప్రపంచ ఆహార పురస్కారాన్ని గెల్చుకున్న డా. హంగ్రియా జీవన సాఫల్య కృషిని పరిశీలిద్దాం..  

డాక్టర్‌ మారియాంజెలా హంగ్రియా. 1958 ఫిబ్రవరి 6న బ్రెజిల్‌లో పుట్టారు. సాయిల్‌ మైక్రోబయాలజిస్టుగా 40 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారు. హరిత విప్లవం సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అమల్లోకొచ్చిన 1970వ దశకం చివర్లో ఆమె డిగ్రీ కాలేజ్‌లో చేరి మైక్రోబయాలజీ చదువుకున్నారు. మొక్కల గురించి, సూక్ష్మజీవుల గురించి బామ్మ చెప్పిన పాఠాల స్ఫూర్తితో సాయిల్‌ మైక్రోబయాలజీ వైపు అడుగులు వేశారు. 

బ్రెజిల్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి అమెరికాలో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ చేశారు. తిరిగి స్వదేశానికి వెళ్లి 1991లో బ్రెజిల్‌ ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనా సంస్థలో చేరి, దీక్షగా పరిశోధనలు కొనసాగించారు. ప్రకృతిసిద్ధమైన సూక్ష్మజీవులను ఉపయోగించి పంటలకు పోషకాలను ఎలా సమకూర్చుకోవచ్చు అనే కోణంలో అపూర్వమైన పరిశోధనలు చేసి అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. ప్రయోగశాలకే పరిమితం కాకుండా ఆ ఆవిష్కరణలను రైతుల దగ్గరకు తీసుకెళ్లటానికి విస్తృతంగా కృషి చేశారు. 500కు పైగా పరిశోధనా పత్రాలు, పుస్తకాలు రాశారు.

సూక్ష్మజీవులకు పెద్ద పీట
మట్టిలో ఉండే సూక్ష్మజీవులకు, ప్రకృతిలో చెట్లు, మొక్కల వేరు వ్యవస్థకు పరస్పరాధారిత సంబంధం ఉంది. వాతావరణంలో పుష్కలంగా ఉన్న నత్రజనిని చెట్లు, మొక్కల వేర్లు నేరుగా గ్రహించుకోలేవు. మట్టిలో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఆ నత్రజనిని గ్రహించి, వేర్లు ఉపయోగించుకోగలిగిన రూపంలోకి మార్చి అందిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా వేర్లు పోషక ద్రవాలను మట్టిలోకి స్రవిస్తుంటాయి. ఆ శక్తితోనే సూక్ష్మజీవులు గాలిలో నుంచి నత్రజనిని తీసుకొని వేర్లకు సరఫరా చేస్తుంటాయి. 

పంటలకు యూరియా వేయటానికి బదులుగా, నత్రజనిని గ్రహించే సూక్ష్మజీవుల్ని డా. హంగ్రియా తొలిగా గుర్తించారు. వాటితో ద్రావణాలను, జీవన ఎరువులను తయారు చేసి బ్రెజిల్‌ రైతులకు అందించారు. ప్రతి ఏటా విత్తనానికి జీవన ద్రావణాలతో లేపనం చేసి విత్తటం ద్వారా రసాయనిక ఎరువులు వాడిన పొలాలతో పోల్చితే 8 శాతం ఎక్కువ సోయా చిక్కుళ్ల దిగుబడి సాధించటంలో విజయం సాధించారు. ఆ తర్వాత వరి, గోధుమ, మొక్కజొన్న, చిక్కుళ్లు, పశుగ్రాస పంటల వేరు వ్యవస్థల్లోని ప్రత్యేక సూక్ష్మజీవులపై పరిశోధనలు చేశారు. వేర్వేరు పంటలకు అవసరమైన జీవన ఎరువులను, సూక్ష్మజీవులతో కూడిన ద్రావణాలను రూపొందించారు. 

30 రకాల ‘సూక్ష్మ’ సాంకేతికతలు
ఆ క్రమంలో ప్రకృతికి హానిచేయకుండా, అతి తక్కువ ఖర్చుతో దిగుబడులు పెంచేలా 30 రకాల జీవన ఎరువులను, విత్తన లేపన ద్రావణాలను తయారు చేసి రైతులకు అందించారు. ఈ టెక్నాలజీలు బ్రెజిల్‌ రైతులకే కాక అనేక ప్రపంచ దేశాల్లోనూ వాడుకలోకి వచ్చాయి. 

రైజోబియా, అజోస్పిరిల్లం బ్రాసిలెన్స్‌..
బ్రెజిల్‌లో 16.25 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో సుమారు 10 కోట్ల ఎకరాల్లో రైతులు డా. హంగ్రియా, ఆమె సహచర శాస్త్రవేత్తల బృందం రూపొందించిన 30 రకాల జీవన ఎరువులు/ద్రావణాలను వాడుతున్నారు. ఆ మేరకు యూరియా వంటి రసాయనిక ఎరువులు కొనటం, వాడటం మానేశారు లేదా బాగా తగ్గించారు. రైజోబియా, అజోస్పిరిల్లం బ్రాసిలెన్స్‌ వంటి మేలు చేసే బాక్టీరియా వాడుతున్న బ్రెజిల్‌ రైతులకు ఏటా చేకూరుతున్న మేలు ఎంతంటే.. ఏకంగా రూ. 2,15,625 కోట్లు (25 బిలియన్‌ డాలర్లు)! అంతేకాదు, 23 కోట్ల మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడకుండా నివారించగలుగుతున్నారు. సోయా ఉత్పత్తి, ఎగుమతుల్లో బ్రెజిల్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడానికి డా. హంగ్రియా అవిరళ కృషే కారణం. ప్రపంచ ఆహార భద్రతకు ఆమె ఆవిష్కరణలు దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆహార పురస్కార ప్రదాన కమిటీ ప్రశంసించింది.

ఆది నుంచి సూక్ష్మజీవులపై  పరిశోధనలకే ప్రాధాన్యం
నేను పరిశోధనలు ప్రారంభించిన హరిత విప్లవం తొలినాళ్లలో ప్రపంచం ఆకలి తీర్చటం ఒక్కటే లక్ష్యం. ఇంకా ఇంకా అధికోత్పత్తి సాధించటం ఒక్కటే లక్ష్యంగా ఉండేది. అయితే, నేను అందుకు భిన్నంగా పరిశోధనలు కొనసాగించాను. పర్యావరణానికి హానికలగకుండా, తక్కువ ఖర్చుతో సుస్థిర వ్యవసాయం చేసే మార్గాలపైనే దృష్టి కేంద్రీకరించాను. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. భూమిని, నీటిని కలుషితం చేయకుండా కర్బన ఉద్గారాలను తగ్గించే తీరులో వ్యవసాయం చేయాలన్న తపన ప్రపంచవ్యాప్తంగా ఏటేటా బలం పుంజుకుంటున్నది. హెక్టారుకు రసాయనిక నత్రజని ఎరువులు వాడాలంటే రైతులకు 30–50 డాలర్ల ఖర్చవుతుంది. దానికి బదులు బాక్టీరియాల కోసం హెక్టారుకు కేవలం 2–3 డాలర్లు ఖర్చు చేస్తే సరిపోతోంది. 
– డా. మారియాంజెలా హంగ్రియా, ప్రపంచ ఆహార పురస్కార విజేత,జీవన ఎరువుల పరిశోధకురాలు, బ్రెజిల్‌

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)