Breaking News

సంగీతం..సంస్కారానికి ఆవిష్కారం

Published on Mon, 06/26/2023 - 00:30

సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం.

‘భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం‘ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్‌ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం. మనిషికన్నా సంగీతం గొప్పది కాబట్టే మనిషికి సంగీతం మేలు చెయ్యగలిగేది అయింది. ‘ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు’ అని ఒక ఇంగ్లిష్‌ సామెత తెలియజెబుతోంది‘. ‘తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు‘ అని ఇంగ్లిష్‌ కవి షేక్స్‌పియర్‌ ఒకచోట చెబుతాడు. అన్నింటికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు.

సంగీతాన్ని వింటున్నప్పుడు  మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి.
సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు.

సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ మళ్లీ పొందచ్చు.

వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం.
ప్రతిమనిషికీ తెలుసు తాను కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని. సంగీతాన్ని వింటున్నంతసేపూ తననుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం విన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు.

శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది. రండి, సంగీతం వల్ల మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉందాం.

అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి.
– రోచిష్మాన్‌

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు