ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు
Breaking News
అందరివాడు
Published on Fri, 03/27/2026 - 02:38
‘రామ’ అనే పదం దశరథ సుతుడైన శ్రీరాముని పేరును సూచించే నామవాచకం మాత్రమే కాదు.. ధర్మాత్ములు, గుణవంతులు, అయిన వ్యక్తుల పట్ల విశేషణంగా, ఉపమానంగా కూడా వాడే అద్భుతమైన పదం. తల్లి దండ్రుల పట్ల భక్తి గౌరవాలు కలవారిని, సోదరుల పట్ల వాత్సల్యం ఉన్నవారిని, సహధర్మచారిణిపై విశేష ప్రేమానురాగాలు కలవారిని, ధర్మం తప్పని వారిని, ఎంత కష్టమైనా సరే, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారిని, దుర్మార్గులను శిక్షించే వారిని, ప్రజారక్షకులైన పరిపాలకులను అపర శ్రీరామచంద్రులుగా కీర్తించడం మన దేశంలో అనాదిగా జరుగుతున్నదే.
‘రాము’డంటే
రంజింపచేయువాడని అర్థం. అందరి మనసులనూ ఆనందింపచేయగలిగిన వారందరూ శ్రీరాములే. వాల్మీకి మహర్షి మాటలలో చెప్పాలంటే ‘రామో విగ్రహవాన్ ధర్మః అంటే ‘ధర్మానికి మూర్తీభవించిన రూపమే శ్రీ రాముడు. ఆయన ధర్మం, సత్యం, పితృవాక్య పరిపాలన, సంపూర్ణ మానవత్వం, ఏకపత్నీ వ్రతం, ధర్మబద్ధమైన పరి పాలనకు మారు పేరు. సోదర ప్రేమ, మిత్రధర్మం, సమత్వ బుద్ధి ఆయన స హజ స్వభావాలు.
శ్రీరాముడు విశ్వజనీనమైన కొన్ని ధర్మాలను తాను ఆచరించి, లోకానికి ఆదర్శంగా నిలిచాడు. లక్ష్య సాధన కోసం ఎంత సుదీర్ఘ కాలమైనా ప్రయత్ని స్తూనే ఉండాలనీ, ఆ దశలో ఎన్ని ఆటంకాలు, కష్టాలు ఎదురైనా అనుకొ న్న లక్ష్యం సాధించేదాకా పట్టు సడలింపరాదనీ, తన సీతాన్వేషణ ద్వారా చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడాయన. లక్ష్యసాధన కోసం ఉడుతలు, వానరుల వంటి వారు అందించే చేయూతను కూడా సహృదయంతో స్వీకరించి ముందుకు సాగాలన్నది ఆయన సందేశం. తానెంతటి గొప్ప పరాక్రమ శాలియైనా, ఏనాడూ అహంకారాన్ని దరిచేరనీయక వినయశీలిగా ప్రవర్తించిన మహోన్నతుడాయన. శత్రువులలోని మంచి గుణాలను సైతం ప్రశంసించే తత్వమాయనది. ఎప్పటికప్పుడు తన భావోద్వేగాలను నియంత్రించుకొంటూ, తన సోదరులనూ ప్రశాంతంగా ఉండమని బోధించిన మహామనీషి శ్రీరాముడు. లోకంలో ప్రతి యువతీ తనకు శ్రీరామునిలాంటి భర్త లభించాలని కోరుకొనేంత ఆదర్శ వంతుడైన భర్త ఆయన.
ఇంక రాజా రాముని గొప్పదనాన్ని ఎంత వర్ణించినా చాలదు. అసలుసిసలైన ప్రజా పాలకుడంటే శ్రీరాముడే. వ్యక్తిగత విషయాలకు, సమష్టి విషయాలకు సంఘర్షణ ఏర్పడితే, వ్యక్తిగత అంశాలకంటే సమష్టి విషయాలకే ప్రాధాన్యతనివ్వాలనేది ఆయన ఆచరించిన రాజధర్మం. రాజ్య శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని రాజు శ్రీరాముడు. ప్రజలందరికీ సమన్యాయాన్ని, సమాన గౌరవాన్నీ అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే ఆయన పాలనలో నెలకు మూడు వానలు కురిసేవి. ప్రజలు సుఖ సంతోషాలతో, ఎలాంటి భయాలూ లేకుండా హాయిగా.. నిశ్చింతగా జీవించేవారు. ఆ సుభిక్షమైన రామరాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ఎందరో నాయకులు కలలు కన్నారు.
రామరాజ్యంలో ప్రజల యోగక్షేమాలకు, వారి రక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడింది. కార్యదక్షులైన, తెలివితేటలు కల్గిన, నిష్కపటులైన మంత్రులు పరిపాలనలో రాజుకు సలహాలనిచ్చేవారు. ప్రజల ఆదాయంలో ఆరవ భాగం (బలిషడ్భాగం) మాత్రమే పన్నుగా రాజారాముడు స్వీకరించే వాడు. అదికూడా ప్రజలకు భారం కాకుండా చూసుకొనేవాడు. సైన్యాన్ని, గూఢచారి వ్యవస్థను బలంగా ఉంచుకొనేవాడు. దేశకాల పాత్రోచితమైన న్యాయం ప్రజలకు అందించబడేది. కనుకనే ఆయన చరిత్ర ‘యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే/ తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి’ అని వాల్మీకి చెప్పినట్లుగా ఈ భూమిపై ఎంతకాలం పర్వతాలు, నదులు నిలిచి ఉంటాయో అంతకాలం అంటే ఈ సృష్టి ఉన్నంతకాలం రామకథ ప్రజల హృదయాలలో నిలిచి ఉంటుంది.
వ్యక్తి సౌఖ్యం కంటే ఎంతో గొప్పదైన ధర్మ సంస్థాపన కోసం జీవించాలని బోధించిన, లోక క్షేమం కోసం సాగే ధర్మకర్మ వ్యవస్థను కాపాడిన ధర్మ విగ్రహుడు శ్రీరామచంద్రుడు. అందరికీ రక్షగా నిలవాలని కోరుకుందాం.
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, విశ్రాంత అధ్యాపకులు
Tags : 1