Jagtial: 2020 నుంచి మార్చురీలోనే మృతదేహం
Breaking News
కృష్ణా.. ఓ మినీ ఇండియా
Published on Tue, 11/04/2025 - 12:46
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. ఆ స్టేషన్ సమీపంలో రైల్వే ఉద్యోగుల కోసం బ్రిటీషర్లు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్.. ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేవారు. ఆ ప్రాంతం నచ్చడంతో కాలక్రమేణా అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా జనం పెరగడంతో వ్యాపారాలు చేసేందుకు వర్తకులు వచ్చారు. వీధులు వెలిసి.. అక్కడ ఓ ఊరే ఏర్పడింది. భిన్న మతాలు.. విభిన్న సంస్కృతులు.. కులాలు.. జాతులు.. ప్రాంతాల వారితో ఏర్పడిన ఆ గ్రామమే కృష్ణా. కృష్ణానది ఒడ్డున ఉండడంతో ఆ పేరే గ్రామం పేరుగా వాడుకలోకి వచ్చింది. ఎన్నో రాష్ట్రాల ప్రజలంతా ఒకేచోట ఉండడంతో కృష్ణా మండల కేంద్రాన్ని ఓ మినీ ఇండియాగా అభివరి్ణస్తుంటారు. అయితే.. బ్రిటిషర్ల కాలంలో కేవలం రైల్వేస్టేషన్ మాత్రమే ఉండగా.. అనంతరం దానిని అనుసరించి ఓ ఊరే ఏర్పడడం గమనార్హం. కృష్ణా గ్రామంలో నివసించే ప్రజలంతా ఇక్కడికి వలస వచ్చిన వారే కావడం విశేషం. మరాఠ కాలనీ, ధర్మశాల ఇలా విభిన్న పేర్లతో కూడిన కాలనీలు ఇక్కడ కనిపిస్తాయి.
కృష్ణా: రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండల కేంద్రాన్ని ఓ మినీ ఇండియాగా అభివర్ణిస్తుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వారు ఇక్కడ కలిసి ఉండడమే ఇందుకు కారణం. 1907 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కృష్ణానదిపై వంతెన నిర్మించి.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు మొదట రైలు మార్గాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో నది పక్కన ఒక స్టేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరేలేదు.
కేవలం రైల్వే ఉద్యోగులే ఉండేవారు. ఎన్నో రాష్ట్రాల వారు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఇక్కడే ఉండిపోవడంతో కాలక్రమేణా గ్రామంగా ఏర్పడింది. కృష్ణానది ఒడ్డున ఉండడంతో కృష్ణా గ్రామంగా పేరు వాడుకలోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. 1911లో నిజాం కాలం నాటి హైదరాబాద్ ఫస్ట్ తాలుక్‌దార్‌గా (కలెక్టర్) ఉన్న గోవింద్‌నాయక్ తన భార్య రంగుబాయి జ్ఞాపకార్థం కృష్ణానది ఒడ్డున తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్‌ను పోలిన మరో విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పట్లో ఈ ఆలయంలో పూజలు చేసేందుకు బ్రాహ్మణులు మహదేవ్ దీక్షిత్, నారాయణభట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారిని నియమించి.. వారి భృతికి కొంత భూమిని కొనిచ్చారు.
ఈ ఐదు కుటుంబాలకు చెందిన వారసులే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, తద్దినం, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కర్మకాండలకు దేశంలో మొదటిది కాశీ అయితే.. రెండోది కృష్ణా కావడం మరో విశేషం. మాజీ ప్రధాని ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీ, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎనీ్టఆర్ అస్తికలను ఇక్కడున్న కృష్ణా, భీమానదుల సంఘమ క్షేత్రంలోనే నిమజ్జనం చేసినట్లు పురోహితులు తెలిపారు.
రాజ్‌పుత్‌లు: మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రైల్వే ఉద్యోగులుగా 75 ఏళ్ల క్రితం వలస వచ్చారు. ఒక్క కుటుంబం నుంచి దాదాపు 10 కుటుంబాలు అయ్యాయి. తాతల కాలం నుంచి రైల్వే ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి ఉద్యోగాలు వచ్చాయని, మరికొందరు చిన్నపాటి వ్యాపారాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. వీరి వాడుక భాష హిందీ. కట్టుబొట్టు వేరుగా ఉంటాయి. ఉగాది, దీపావళి, దసరా ముఖ్య పండుగలు. గోదుమ పిండితో చేసిన చపాతి, పూరీలు ఎక్కువగా తింటారు.
మరాఠీలు : మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రైల్వే ఉద్యోగాలపైన 60 ఏళ్ల క్రితం వచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబాల్లో కొందరు మాత్రమే ఉద్యోగాల్లో ఉండడంతో మిగతా వారు ఖాళీగా ఉండకుండా.. గ్రామంలో కిళ్లీ కొట్లు, సప్లయింగ్ తదితర వ్యాపారాలు చేస్తున్నారు.
అగర్వాల్‌లు : ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి 80 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చారు. హోటళ్లు, స్వీట్స్ దుకాణం, ధాన్యం కొనుగోలు తదితర రంగాల్లో వ్యాపారం చేసేవారు. అప్పట్లో మక్తల్ మార్కెట్ కంటే ఇక్కడే ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. 40 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం పడిపోవడంతో ఇక్కడున్న వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
ముస్లింలు :రజాకార్ల పరిపాలనలో వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చారు. అప్పట్లో వీరు దాదాపు 800 మంది ఉండగా.. ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యాపారం పడిపోవడంతో కర్ణాటక, మహారాష్ట్రకు వలస వెళ్లారని సమాచారం.
బ్రాహ్మణులు : కర్ణాటక నుంచి ఇక్కడికి మొట్టమొదట వచ్చింది వీరే. పూజలు నిర్వహించేందుకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడ గ్రామం అవతరించింది. వీళ్లు కర్ణాటకలోని శృంగేరి మఠంకు చెందినవారు. అప్పట్లో సాధువులు నది ఉన్నందున ఎక్కువగా వచ్చేవారు. అలా వచ్చిన క్షీరలింగేశ్వరుడు ఆయన మంత్రశక్తితో ఇక్కడి ప్రజల బాధలు, రోగాలను నయం చేసేవారు. ఆయన మరణంతో ఆయనను పూడ్చిన స్థానంలోనే సమాధి కట్టి, విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏటా జనవరి 14న బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
జైనులు: 70 ఏళ్ల కిందట రాజస్తాన్ నుంచి వ్యాపార నిమిత్తం కృష్ణాకు వలస వచ్చారు. రైళ్లలో సరుకులు, వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవారు. 35 ఏళ్ల కిందట 100 మంది ఉంటే ఈ రోజు రెండు కుటుంబాలు మాత్రమే మిగిలాయి. వ్యాపారం పడిపోవడం, ఇతర రంగాలవైపు వెళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
మరాఠ, ధర్మశాల కాలనీలు..
నది ఒడ్డున నివసిస్తున్న బ్రాహ్మణుల కాలనీ ధర్మశాలగా, రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న కాలనీని మరాఠకాలనీ అని పిలుస్తారు. ఇక్కడ మహారాష్ట్రకు చెందినవారు ఎక్కువగా ఉండడంతో ఆ గల్లీని మరాఠ కాలనీగా పిలుస్తున్నట్లు తెలిపారు. అలాగే, జైనులు, రాజ్‌పుత్‌లు, వాల్మీకి (బోయ), ముదిరాజ్, చాకలి, కుర్వ, హరిజన్, ముస్లిం, వైశ్య తదితర కులాలకు చెందినవారు నివసిస్తున్నారు.
సంప్రదాయాలు కొనసాగిస్తున్నాం
ఇక్కడి ఆచారాలు, అలవాట్లు, భాష, ప్రాంతం వేరైనప్పటికీ మా సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు కొనసాగిస్తున్నాం. కొన్ని విషయాల్లో అంటే ఇక్కడున్న కట్టు, బొట్టు, తిండి విషయాల్లో మా వాటిని వదులుకొని ఇక్కడున్న విధంగా నడుచుకుంటున్నాం. మా ప్రాంతాలకు వెళ్తే మా అలవాట్ల ప్రకారమే ఉంటాం.
– లక్ష్మీరాజ్‌పుత్, కృష్ణా గ్రామం
వ్యాపారం చేస్తూ.. ఉపాధి
మాది రాజస్తాన్. మా వంశస్తులు వ్యాపారం నిమిత్తం కృష్ణాకు వచ్చారు. వ్యాపారం చేస్తూ మరికొందరికీ ఉపాధి కల్పించారు. అలాగే మావారు ఆస్తులు సంపాదించారు. కాలక్రమేణా వ్యాపారం పడిపోయింది. ఈ గ్రామంలోని ఎంతోమంది పేదలకు భూములు ఇచ్చాం. మా తాతలు ఇచ్చిన ఆస్తులతో ఇప్పటికీ కొందరు జీవనం సాగిస్తున్నారు.
– కపిల్‌సేట్, మార్వాడి, కృష్ణా
వ్యాపారం కోసం..
మా వంశస్తులు 50 మందికి పైగా ఇక్కడకు రజాకార్ల పరిపాలనలో వ్యాపార నిమిత్తం వచ్చారు. వారి సంతానమే ఈ రోజు గ్రామంలో దాదాపు 400 మందికి పైగా ఉన్నాం. ప్రస్తుతం వివిధ వ్యాపారాలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీవనం గడుపుతున్నాం.
– మహ్మద్ రియాజ్, కృష్ణా
Tags : 1