షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..
Breaking News
రాజా విజిల్ వేస్తే అది పాటైపోవులేరా!
Published on Sun, 04/12/2026 - 04:34
‘ఈ కాలపు కుర్రవాళ్లు అన్నింటికీ విజిల్స్ వేస్తున్నారు. ఎదుటివాళ్ల గొప్పతనాన్ని విజిల్ వేసి చెబుతున్నారు. కాని ఎదుటి వారు మీ గురించి విజిల్ వేసేలా మీరు ఎదగాలి. నేనొకసారి విజిల్ వేశాను. అది నన్నే గొప్పగా నిలబెట్టింది’ అన్నారు ఇళయరాజా ఇటీవలి హైదరాబాద్ ప్రదర్శనలో! ఆయన విజిల్ ఎప్పుడు వేశారు? అది ఎలా ఆయనను గొప్పగా నిలబెట్టింది? చదవండి...
ఇళయరాజా ఇటీవల జరిగిన హైదరాబాద్ మ్యూజికల్ నైట్‌లో కుర్రకారును ఉద్దేశిస్తూ ఒక అనుభవం పంచుకున్నారు. కచ్చేరి జరుగుతుండగా ప్రేక్షకుల్లోని కొందరు యువకులు అదేపనిగా విజిల్స్ వేస్తుంటే విని ‘మీ విజిల్స్‌ని వేస్ట్ చేయకండి. మీరు విజిల్ వేస్తే అదొక గొప్ప సందర్భం కాగలగాలి’ అంటూ తన జీవితంలో జరిగిన ఒక ఘటన చెప్పారు.
‘1984లో నాకు ఆపరేషన్ (హెర్నియా) జరిగింది. నెల రోజుల పాటు ఏమీ పాడొద్దన్నాడు డాక్టర్. నేను పాడి కదా పాటను సింగర్స్‌కు నేర్పించాలి. అది చేయకూడదన్న మాట. సరేనని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. కాని ఒకరోజు నిర్మాత పంజు అరుణాచలం వచ్చారు. ఆయన నన్ను సంగీత దర్శకుణ్ణి చేసిన ఆత్మీయుడు. ఆయన తీసిన ‘అన్నాక్కిళ్లి’తో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ‘ఏంటన్నయ్యా... ఇలా వచ్చారు’ అనంటే ‘ఏం చెప్పమంటావు.
నువ్వు రెస్ట్‌లో ఉన్నావు. నా సినిమా (రజనీకాంత్‌ను పెట్టి తీస్తున్న ‘తంబిక్కు ఎంద ఊరు’) షూటింగ్ ఆగిపోయింది. రజనీకాంత్ ఊటీలో వెయిట్ చేస్తున్నాడు. ఒక పాటను షూట్ చేసి అతను వేరే షూటింగ్‌కు వెళ్లాలి. నాకు మళ్లీ అతని డేట్స్ దొరకవు. నువ్వు పాట చేయాలి ఎలాగైనా’ అన్నాడాయన. నేను పెద్ద ధర్మసంకటంలో పడ్డాను. ఒకవైపు ఆరోగ్యం. మరోవైపు నా గాడ్‌ఫాదర్. సరే... డాక్టర్ పాడొద్దని కదా అన్నాడు అని... నేను మెల్లగా మంచం మీద సర్దుకు కూచుని విజిల్ వేస్తూ పాట ట్యూన్ ఇచ్చాను. పంజు గారు (ఆయన గీత రచయిత కూడా) వెంటనే పల్లవి రాశారు. విజిల్‌లోనే చరణాలు ఇచ్చాను.
వాటినీ రాసేశారు. ‘ఇక రికార్డింగ్ ఎలా చేస్తావు?’ అనడిగారాయన. నా కండక్టర్‌ని ఇంటికి పిలిచి నోట్స్ ఇచ్చాను. వెంటనే రికార్డింగ్ అరేంజ్ చేసి బాలూ చేత పాడించమని చెప్పాను. నేను ఇంటి దగ్గర ల్యాండ్‌లైన్ రిసీవర్ ఆన్‌లో పెట్టి దాని గుండా అక్కడ ఏం జరుగుతోందో వింటూ, పాట మొదట్లో ఆలాపన ఉంటే అది కూడా విజిల్‌లోనే చెప్పి రికార్డు చేయించాను. ఆ పాటే ‘కాదలిన్ దీపం ఒండ్రు’. ఆ పాట రజనీకాంత్‌కూ నాకూ ఎంత హిట్ అంటే రేడియోలో ఇప్పటికీ ఎక్కువసార్లు రిక్వెస్ట్ వచ్చే పాట అది. నేను ఒకసారి విజిల్ వేస్తే ఏమయ్యిందో చూడండి. మీరు విజిల్ వేస్తే అంత ఘనంగా ఉండాలి’ అన్నారాయన ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య.
మనం ఉద్యోగం చేస్తున్నా, ఉపాధిలో ఉన్నా, చదువుకుంటున్నా, కళారంగంలో ఉన్నా మనం ఎదుగుతూ ఎదుటివారి గొప్పదనాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. మనం అలాగే ఉండి ఎదుటివారి గొప్పదనానికి మురిసిపోతూ, అయోగ్యుల వెంట మూక స్వభావంతో తిరుగుతూ ఉండరాదని ఇళయరాజా భావం. ఇది గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం.
Tags : 1