Breaking News

మానసిక ఆరోగ్యం మీ గదే మీ మది

Published on Thu, 01/19/2023 - 06:02

చిందర వందరగా ఉన్న ఇల్లు చిందర వందరగా ఉన్న మనసుకు కారణం. సర్దుకున్న ఇల్లు సేదతీరిన మనసుకు సూచన. ఎలా పడితే అలా ఉండి పనికిమాలిన వస్తువులతో నిండి కుదురుగా కనిపించని ఇంట్లో నివాసం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సమయం గడిపే చోటు ఇల్లు గనుక. స్త్రీలు తమ పరిసరాలను సర్దుకోవడం, అందంగా మార్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు.

కేస్‌ స్టడీ 1:
సురేఖ వంటగదిలో ఎప్పుడూ చిరాగ్గా కోపంగా ఉంటుంది. పిల్లలు వెళితే కసురుతూ ఉంటుంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ సమయానికి పనిమనిషి ఇంకా రాకపోవడం వల్ల సింక్‌ నిండుగా ఉంటుంది. కావలిసిన వంట పాత్రలు వెంటనే దొరకవు. సరుకుల డబ్బాలను కుదురుగా పెట్టుకోవడాన్ని సురేఖ ఏనాడూ పట్టించుకోదు. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ నీట్‌గా ఉండదు. తను శుభ్రంగా ఉన్నా, ఇంట్లో ఇతరత్రా ఏ సమస్యలు లేకపోయినా ఆ సమయంలో బయట వాతావరణం బాగున్నా వంటగదిలో సురేఖ మానసిక స్థితి మాత్రం ప్రశాంతంగా ఉండదు. అదే ఆమె వంట గదిని సరిగ్గా సర్దుకుని ఉంటే, వంట మొదలెట్టే సమయం కంటే ముందే వచ్చి పాత్రలు శుభ్రం చేసి వెళ్లే పని మనిషిని పెట్టుకుని ఉంటే, వంట గదిలో అనవసరమైన పాత గిన్నెలు, బూజు పట్టిన గంగాళాలు వదిలించుకుని ఉంటే ఆమె ప్రతి పూట హాయిగా వంట చేసుకుని ఉండేది.

కేస్‌ స్టడీ 2:
రాజేశ్వరి ఆఫీస్‌ నుంచి ఇల్లు చేరుకోగానే ఆమె చిరాకు నషాళానికి ఎక్కుతుంది. అప్పటికి పిల్లలిద్దరూ స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. చిప్స్‌ తిని రేపర్లు సోఫాలో పడేసి ఉంటారు. టవళ్లు కుర్చీలో పడేసి ఉంటారు. యూనిఫామ్‌ బట్టలు ఎలాగంటే అలా పడేసి ఉంటారు. పొద్దున చదివిన న్యూస్‌పేపర్లు చిందర వందరగా ఉంటాయి. తాళం కప్ప ఒకచోట, దాని తాళం ఇంకో చోట. పుస్తకాల సంచుల్ని టీవీ స్టాండ్‌ దగ్గర పడేసి ఉంటారు. వచ్చిన వెంటనే ఆమెకు ఇల్లు సర్దుకునే ఓపిక ఉండదు. హాల్లో కూచుందామంటే ఈ చిందర వందర అంతా ఆమెకు హాయినివ్వదు. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు. తాను ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా, కుదురుగా కనిపిస్తే వచ్చి హుషారుగా పలకరిద్దామని ఉంటుంది. కాని ఆ స్థితి లేకపోవడం వల్ల రోజూ రావడంతోటే పిల్లల్ని కసరడం, దాని వల్ల తాను బాధ పడటంతో మూడ్‌ ఆఫ్‌. ఇలా రోజు జరగడం అవసరమా?

  కేస్‌ స్టడీ 3:
సంధ్య వాళ్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లు ఈ ఇంట్లో వాళ్లకు ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం రాదు అని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్లు ఎక్కువ సేపు కూచోరు. సంధ్యకు ఇల్లు సర్దుకోవాలని ఉంటుందిగాని దానికి ఏదో ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆదివారం సర్దుదామనుకుంటుంది... ఆ రోజు ఏదో పని పడుతుంది. హ్యాంగర్లకు మాసిన బట్టలు, కుర్చీల్లో ఉతికిన బట్టలు, వారం అయినా మంచాల మీద మారని దుప్పట్లు... సంధ్యకు ఏ పని చేయాలన్నా మనసు రాదు. ఐదు నిమిషాల పని పది నిమిషాలు పడుతుంటుంది. ఉండి ఉండి ఆందోళనగా అనిపిస్తుంటుంది. ఏదో ఇష్టం లేని ప్లేస్‌లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. శుభ్రమైన గదే శుభ్రమైన మదికి సాయం చేస్తుందని ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో.
 
రోడ్డు మీద వెళుతున్నప్పుడు చెత్త చెదారం కంట పడగానే మనసుకు ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇల్లు, గదులు కూడా చిందర వందరగా ఉంటే మనసుకు ఉల్లాసం పోతుంది. మనం నివాసం ఉండే ఇల్లుగాని, పని చేసే ఆఫీస్‌గాని సర్వకాల సర్వవేళల్లో శుభ్రంగా ఉండాలని ఆశించడం కుదరదు. కాని వీలున్నంత మటుకు ఎప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల వస్తువుల అపసవ్యత దృష్టికి రాకుండా చూసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సరైన కెమికల్స్‌ విడుదలయ్యి ఒక ప్రశాంతత ఉంటుందని, ఫోకస్డ్‌గా పని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కౌటుంబిక, ఆర్థిక సమస్యలు లేకపోయినా శుభ్రత లేని పరిసరాలు మీ నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. మనసును చికాకు పెడతాయి. పరిసరాలు మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇవి చేయాలి.

 1.    ఇల్లు మీ కార్యక్షేత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. ఉండాలి. లేకపోతే కేటాయించుకోవాలి. చిన్న ఇల్లు అని వంక పెట్టవద్దు. చిన్న ఇల్లు కూడా చాలా నీట్‌గా సర్దుకోవచ్చు.
2.    లాండ్రీ, గిన్నెలు, చెత్త పారేయడం... ఈ మూడు పనులు మీరు చేసుకున్నా పని మనిషి చేసినా పర్‌ఫెక్ట్‌గా ప్రతిరోజూ జరిగేలా చూసుకుంటే మనసుకు సగం ప్రశాంతత.
3.    ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే పాతవి, అక్కర్లేనివి, కంటికి ఇబ్బంది కలిగించేవి నిర్దాక్షిణ్యంగా పారేయాలి. అతి తక్కువ వస్తువులతో జీవించాలని దీని అర్థం కాదు. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటే బాగుంటుంది.
4.    ఇల్లు సర్దుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఇంటి సభ్యులందరూ ఏదో ఒక టైమ్‌లో ఇల్లు సర్దడానికి పది నిమిషాలు ఇవ్వాలి. నెలకోసారి సర్వ ప్రక్షాళన అనేది తప్పు భావన. కొద్ది కొద్దిగా నీట్‌గా చేసుకుంటూ రావడమే మంచిది.
5.    పొందిగ్గా సర్దబడి, చక్కటి మొక్కలు ఉండి, గాలి వెలుతురు తగినంతగా వస్తూ ఉన్న ఇల్లు మీదైతే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండటానికి పూర్తి అవకాశం ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)