Breaking News

ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం

Published on Mon, 12/01/2025 - 04:12

యుద్ధభూమిలో శ్రీ కృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. అయితే, దాని అసలైన సందేశం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి. అంటే  ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, శక్తిమేరకు కృషి చేయడం.

గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. గాడ్‌ టాక్స్‌ విత్‌ అర్జున: ది భగవద్గీత అనే తన మహత్తర గీతాభాష్యం లో, శ్రీ కృష్ణుని సందేశం గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు.

భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు...‘‘కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారముంది, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.’’

దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి ఆందోళన చెందుతూ ఉండకండి. ‘‘ ఈ పని చేయడం వల్ల నాకేమి లభిస్తుంది’’ అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. 

మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చాడు...‘‘ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించు. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావం గలవాడవై ఉండు. ఈ మానసిక సమత్వమే యోగం.’’

జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీ కృష్ణుడు మనకు బోధిస్తాడు. ఈ సమభావమే నిజమైన యోగం. అంటే ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం.
3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీ కృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశాడు. 

‘‘సమస్త కర్మలను నాకు అర్పించు! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండు.’’

సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు... కోరికలు, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైకమార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించాడు:

‘‘నీరు స్పృశించలేని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి  సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.’’
బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ  కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.

ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్‌–రియలైజేషన్‌ ఫెలోషిప్‌ను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియాను భారతదేశంలోను స్థాపించారు. ఆయన ‘ఒక యోగి ఆత్మకథ’ లక్షలాది మందికి యోగాన్ని, ధ్యానాన్ని– ముఖ్యంగా భగవద్గీత కూడా ప్రస్తావించిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను– దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.

నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా– కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను పనిచేయడం, కానీ ఫలితాల కోసం  పాకులాడకుండా ఉండటం.

యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది–వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు. 
– సత్యశ్రీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)