అక్రమంగా భూములు తీసుకోవడమే కాదు.. GVMC కౌన్సెల్ గోడపై YSRCP నేతలు ఫైర్
Breaking News
ఇలా ఉన్నాం.. ఇలా చేయాలి...
Published on Sat, 01/31/2026 - 03:56
ఎకనామిక్ సర్వే అంటే అంకెలు, సంఖ్యల విశ్వరూపం కాదు. రిపోర్ట్ రూపంలోని మన శ్రేయోభిలాషి. విలువైన సూచనలు ఇచ్చే మేధో విశ్లేషకురాలు. ‘ఫలానా విషయంలో మనం ఇలా ఉన్నాం. ఒకప్పుడు అలా ఉన్నాం’ అని గత, వర్తమానాలను కలుపుతూ విశ్లేషిస్తుంది. ‘ఈ ΄పొరపాట్లు చేస్తున్నాం. వాటిని సవరించుకోవాలంటే’ అంటూ విలువైన సూచనలు ఇస్తుంది. డిజిటల్ వ్యసనం నుంచి ఊబకాయ సమస్య వరకు, స్క్రీన్ టైమ్ నుండి మహిళా శ్రామికశక్తి వరకు ఎన్నో అంశాలను విశ్లేషించి, సూచనలిచ్చింది ఎకనామిక్ సర్వే.
40 రెట్లు పెరిగింది!
‘మన దేశంలో ఊబకాయ సమస్య ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతోంది. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారాలవాట్లు. అల్ట్రా– ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం (యూపీఎఫ్) పెరగడం దీనికి కారణం’ అని నివేదిక పేర్కొంది. బర్గర్, పిజ్జా, నూడుల్స్, శీతల పానియాలు...మొదలైనవి జంక్‌ఫుడ్‌గా పిలిచే అల్ట్రా– ప్రాసెస్డ్ ఫుడ్స్.
ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులకు, ఆరోగ్య సమస్యల పెరుగుదలకు ‘యూపీఎఫ్’ కారణం అవుతోంది.
మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో యూపీఎఫ్ ఒకటి. 2009 నుండి 2023 వరకు యూపీఎఫ్‌ల వినియోగం 150 శాతానికి పైగా పెరిగిందని నివేదిక తెలియజేసింది. మన దేశంలో యూపీఎఫ్‌ల రిటైల్ అమ్మకాలు 2006లో 0.9 బిలియన్ డాలర్లు ఉండగా 2019 నాటికి దాదాపు 38 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది 40 రేట్ల పెరుగుదల.
డిజిటల్... ఏజ్
చిన్న పిల్లలను హానికరమైన డిజిటల్ కంటెంట్‌కు దూరంగా ఉంచడానికి వయసు ఆధారిత యాక్సెస్ విధానాన్ని గట్టిగా అమలు చేయాలని నివేదిక సూచించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వయసు ధృవీకరణను అమలు చేయడానికి బాధ్యత వహించాలని చెప్పింది. ‘పిల్లలలో ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను పాదుకొల్పడంలో పాఠశాలలు కీలక పాత్రపోషిస్తాయి. స్క్రీన్ టైమ్, సైబర్‌భద్రత, మానసిక ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ వెల్నెస్‌పై పాఠ్యప్రణాళిక ప్రవేశపెట్టాలి.
కోవిడ్–19 సమయంలో విస్తరించిన ఆన్‌లైన్ బోధనా సాధనాలపై ఆధారపడడాన్ని తగ్గించి, ఆన్‌లైన్ బోధనకు ప్రాధన్యత ఇవ్వాలి’ అని చెప్పింది.ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లకు సంబంధించి కుటుంబాలకు అవగాహన కలిగించడానికి పాఠశాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించాలని చెబుతున్న రిపోర్ట్ స్క్రీన్‌టైమ్ పరిమితులు, డివైజ్–ఫ్రీ టైమ్ అమలు అయ్యేలా చేయాలని, ఆఫ్‌లైన్ యాక్టివిటీలను పెంచాలని సూచించింది.
41.7% మహిళా శక్తి
ఇటీవల కాలంలో మహిళా శ్రామిక శక్తిలోని సానుకూల ధోరణిని నివేదిక హైలెట్ చేసింది. డేటా ప్రకారం... ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌పీఆర్) 2017–18లో 23.3 శాతం ఉంటే 2023– 24లో 41.7 శాతానికి పెరిగింది. మహిళల్లో నిరుద్యోగం తగ్గింది. మహిళల నిరుద్యోగిత రేటు 2017–18లో 5.6 శాతం ఉండగా 2023–24లో 3.2 శాతానికి తగ్గింది.
‘ఇది గణనీయమైన మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ మహిళల మొత్తం భాగస్వామ్యం పురుషుల కంటే తక్కువగా ఉంది’ అని నివేదిక పేర్కొంది. ‘ఇ–శ్రమ్’పోర్టల్‌ను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసంఘటిత కార్మికుల పేర్లను నమోదు చేయడానికి, వారిని ఉ పాధి సేవలు, సామాజిక భద్రతతో అనుసంధానించడానికి ఈపోర్టల్‌ను రూపొందించారు. జనవరి 2026 నాటికి ఈపోర్టల్‌లో 31 కోట్లకుపైగా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
‘మహిళలు ప్రతిరోజూ వేతనం లేని పనులపై 363 నిమిషాలు గడుపుతుండగా, పురుషులు 123 నిమిషాలు గడుపుతున్నారు. వేతనంతో కూడిన పనులలో పాల్గొనే మహిళలు ఎక్కువ సమయాన్నే వెచ్చిస్తున్నప్పటికీ , మొత్తం మీద వారి భాగస్వామ్యం పురుషుల కంటే తక్కువగా ఉంది’ అని నివేదిక పేర్కొంది. వేతనంతో కూడిన పనులలో మహిళల భాగస్వామాన్ని పెంచడానికి మౌలిక సదు పాయాలు, ఆరోగ్య సంరక్షణ సదు పాయాల మెరుగుదల ప్రాముఖ్యత గురించి నివేదిక నొక్కి చెప్పింది.
డిజిటల్ వ్యసనం
డిజిటల్ వ్యసనాన్ని ప్రధాన జాతీయ ప్రజారోగ్య సమస్యగా అధికారికంగా గుర్తించింది ఆర్థిక సర్వే 2025–2026 నివేదిక. అసంక్రమిత వ్యాధుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరుసలో డిజిటల్ వ్యసనాన్ని చేర్చింది. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, గేమింగ్‌లపై అధిక సమయాన్ని వెచ్చించడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతింటుందని, పనిగంటలను తగ్గిస్తోందని, డిజిటల్ వ్యసనం అనేది మానవ వనరులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. అవగాహన కార్యక్రమాలతో డిజిటల్ వ్యసనాన్ని దూరం చేయవచ్చని సూచించింది.
కుటుంబ ఆదాయం పెరగాలి
‘గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 17 శాతం పాఠశాలలు మాత్రమే మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి. పట్టణ ్ ప్రాంతాల్లో సుమారు 38 శాతం పాఠశాలలు మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి’ అని నివేదిక తెలియజేసింది. పాఠశాలకు వెళ్లని పిల్లలలో అత్యధిక సంఖ్యలో ఉన్నవారు సెకండరీ పాఠశాల వయస్సు (14 నుండి 18 సంవత్సరాల మధ్య) వారేనని తెలియజేసిన నివేదిక కుటుంబ ఆదాయాన్ని గురించి ప్రస్తావించింది. కుటుంబ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, పేదరికం, ఇంటిపనులు, బాధ్యతలు... మొదలైనవి పాఠశాల విద్యను మానేయడానికి ప్రధాన కారణమని నివేదిక తెలియజేసింది.
ఏఐతో ఒత్తిడి!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత పని స్వభావాన్ని మారుస్తోంది. జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ... మొదలైనవి కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నప్పటికీ, నైపుణ్యం పొందే విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి కూడా కలిగిస్తున్నాయి’ అని చెబుతోంది నివేదిక.
‘ఏఐ నైపుణ్యానికి సంబంధించి ప్రపంచంలో మన దేశం రెండో స్థానంలో ఉంది. ఏఐని స్వీకరించడం అనేది సాంకేతిక సవాలు మాత్రమే కాదు శ్రమతో కూడుకున్నది. బిజినెస్ మోడల్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సంస్థలు, ఉద్యోగులు ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త పాత్రలకు అనుగుణంగా మారాలి’ అని సూచిస్తోంది ఈ నివేదిక.
Tags : 1