మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!
Published on Thu, 10/03/2024 - 11:11
నేటినుంచి ఆశ్వీయుజ మాసం ఆరంభం అవుతోంది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజులను నవ రాత్రులు అంటారు. నవ రాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ’శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ’దేవీనవ రాత్రులు’గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈతొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.
భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో,వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజులపాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు చెబుతారు.
ఇక దేవీ నవరాత్రి పూజలు చేయుట, అనునది అనాది కాలంగా వస్తున్న శాస్త్రవిధి. ‘అశ్వనీ‘ నక్షత్రంలో కలసి వచ్చిన పూర్ణిమమాసమే ‘ఆశ్వీయుజమాసం‘ అవుతుంది. ఈ మాసమందు ’దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.
∙ప్రథమాశైలపుత్రి,ద్వితీయా బ్రహ్మచారిణీ ∙తృతీయాచంద్రఘంటీతి, ∙కూష్మాండేతి చతుర్థికీ ∙పంచమా స్కందమాతేతి
∙షష్టాకాత్యాయనేతి ∙సప్తమా కాళరాత్రిచ ∙అష్టమాచాతి భైరవీ ∙నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.
మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ ‘దసరావైభవం‘ ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు నిత్యం శ్రీలలితా సహస్రనామ పారాయణ గావిస్తూ ‘శరన్నవరాత్రులు‘ గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ’దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు.
దసరాకు మరోపేరు ‘దశహరా‘ అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెబుతారు దైవజ్ఞలు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రంలో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు.
అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలనిపెద్దలు చెబుతున్నారు.
దుర్గమ్మకు దసరా అలంకారాలు
∙స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ( పాడ్యమి)
∙శ్రీ బాల త్రిపుర సుందరి (విదియ)
∙శ్రీ అన్నపూర్ణా దేవి (తదియ)
∙శ్రీ గాయత్రి దేవి (చవితి)
∙శ్రీ లలిత త్రిపుర సుందరి(పంచమి)
∙శ్రీ మహాలక్ష్మి దేవి (షష్టి)
∙శ్రీ సరస్వతి దేవి (సప్తమి)
∙శ్రీ దుర్గాదేవి (అష్టమి)
∙శ్రీ మహిషాసురమర్ధిని దేవి (నవమి)
∙శ్రీ రాజ రాజేశ్వరి దేవి (దశమి)
Tags : 1