Breaking News

పంట – కలుపు

Published on Mon, 06/23/2025 - 06:12

పొలంలో ఏదైనా తనకి కావలసిన పంట పండించుకోవటానికి రైతు ఎంతగానో కృషి చేయ వలసి ఉంటుంది.  పొలం దున్నాలి. పదును చెయ్యాలి. కావలసిన విత్తనాలు నాటాలి. నీరు పెట్టాలి. చీడ పీడలు రాకుండా మందులు వెయ్యాలి. పశువులు తినకుండా కాపాడాలి. నిరంతరం ఎటువంటి ఇబ్బంది రాకుండా పసిపిల్లలని చూసినట్టు కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండాలి. అయినా ఏదో ఒక చిన్న సమస్య అనుకున్నంత ఫలసాయం రాకుండా అడ్డుపడుతూనే ఉంటుంది.

 కావాలనుకున్న దాని విషయంలో జరిగే తంతు ఇది. కాని, కలుపు మొక్కల సంగతి చూడండి. విత్తనాలు కూడా వెయ్యనవసరం లేదు. ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. పంట కోసం చేసిన ఏర్పాటుని హాయిగా తాము అనుభవించి ఏపుగా పెరుగుతాయి. వాటిని ఏరి  పారేసినా, పీకి  పాకం పట్టినా ఎట్లా బతుకుతాయో అంతుపట్టదు. చక్కగా పుటకరించి ఎదుగుతాయి. ఏమి చెయ్యని చోట కూడా చక్కగా మొలకెత్తి పెరుగుతాయి.

సరిగ్గా ఇదే విధంగా మనలో మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు తలెత్తి నాటుకు  పోవటం అనే క్రమం సాగుతుంది. అదేం చిత్రమో కాని చెడుకి ఆకర్షణ అధికం. బలం కూడా ఎక్కువే. అంతిమ విజయం మంచికే అంటాం కాని, ఈ లోపు జరగవలసిన హాని జరిగి పోతూ ఉంటుంది. ఆకర్షణ తాత్కాలికమైనా ప్రభావం గట్టిగానే ఉంటుంది. అందుకే ఈ రెండింటి విషయంలో రైతు పంటకోసం ఎంత జాగ్రత్త వహిస్తాడో అంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. 

మంచిభావాలు అనే విత్తనాలు మొలకెత్తటానికి అనువుగా మనసు అనే క్షేత్రాన్ని చదును చేయాలి. ఇదే క్రమశిక్షణ. శారీరక మానసిక శుద్ధి క్రమశిక్షణ వల్ల సిద్ధిస్తుంది. కలిగిన మంచి ఆలోచనలు మనస్సులో గాఢంగా నాటుకొని పెం పొందే విధంగా తగిన వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఇదే  పొలానికి నీరు పెట్టి ఎరువు వెయ్యటం వంటిది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఎండి  పోయినట్టు, పంటకి తెగులు సోకినట్టు సదాలోచనలు కూడా పక్కదారి పట్టవచ్చు. అందుకని వచ్చిన మంచి ఆలోచనలని నిరంతరం మననం చెయ్యటం, వీలైనంత వరకు ఆచరణలో పెట్టటానికి ప్రయత్నం చెయ్యటం చేయాలి. ఆలోచన క్రియారూ పాన్ని దాల్చితే స్థిరపడి పోతుంది. 

పంట బాగా ఎదగాలని ప్రయత్నం చేస్తే, చేసిన శ్రమఫలాన్ని అంతా కలుపు మొక్కలే  పొంది బలంగా ఎదుగుతాయి. అదేవిధంగా, మంచి భావాలనే నిరంతరం మనసులో నింపుకుని ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా, దురాలోచనలు సందు చూసుకుని దూరి  పోయి, ఎక్కువ ప్రాబల్యాన్ని సంతరించుకుంటాయి. కనుక వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. లేక పోతే పంటని మించి కలుపు మొక్కలే రాజ్యమేలినట్టు కూడని భావాలే విస్తరించి మంచిభావనలని అణచి వేయటం జరుగుతుంది. ప్రయత్నం లేకుండానే పెచ్చు పెరిగే ప్రతికూల భావజాలానికి అడ్డుకట్టవేసి, సానుకూల భావాలని ప్రయత్నపూర్వకంగా పెం పొందించుకుని  పోషించుకుంటూ ఉండాలి. అవి వాటంతట అవి రావు. 

ఉదాహరణకి కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేద్దామనే ఆలోచన వచ్చిందనుకుందాం లేదా రోజూ కొద్ది సమయం యోగాభ్యాసమో, నడకో, ధ్యానమో చేద్దామనే భావన కలిగిందనుకుందాం. ఆ భావన మాయం కాకుండా ఆచరణ దాకా వచ్చేవరకు దానినే గుర్తు చేసుకుంటూ ఉండాలి. లేక పోతే ఆ నిర్ణయాన్ని బలహీనపరచే ఆలోచనలు విజృంభిస్తాయి. ఇంకేముంది? అంతా మామూలే! కాని, అదే ఏదైనా చెడు ఆలోచన వచ్చిందనుకుందాం. దానిని బలహీన పరచే ఊహలు రావు. వచ్చినా నిలవవు. 
అందుకే మనస్సులో మెదిలిన సదాలోచనని వెంటనే అమలు చెయ్యమని, దురాలోచనని వీలైనంత ఆలస్యం చెయ్యమని చెపుతారు పెద్దలు. వ్యవసాయంలో కలుపుతీతకి ఉన్నంత ప్రాధాన్యం సాధనలో శారీరిక... మానసిక శుద్ధికి ఉంది.                     

వద్దనుకున్న కలుపు మొక్కలు ఎదిగినంత వేగంగా పంట ఎదగనట్టే చెడు ఆలోచనలు వచ్చినంత త్వరగా మంచి ఆలోచనలు రావు. మంచి చేయాలనే ఆలోచన కలగవచ్చు. కానీ, దానిని అమలు పరచటం గురించి మనస్సులో స్థిరంగా అనుకోవటం కాని, ఎక్కువసేపు ఆలోచించటం గాని సాగదు. దానికి కారణం కలుపు మొక్కల వంటి చెడు భావాలు దృఢంగా  పాతుకు పోయి, బలంగా ఎదిగి, బాగా విస్తరించి, సదాలోచనలు అస్తిత్వం కోల్పోయేట్టు చేయటమే. అందుకే ప్రధానంగా చెయ్యవలసింది పనికిరాని భావాలని మనస్సులో నుండి తొలగి  పోయేట్టు చేయటమే. అపుడు మనస్సులో మంచిభావాలు విస్తరించటానికి కావలసిన ఖాళీ ఏర్పడుతుంది.  

– డా.ఎన్‌. అనంతలక్ష్మి

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)