ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్
Breaking News
దృష్టి కొద్దీ సృష్టి!.
Published on Mon, 08/24/2026 - 06:33
వేదాంత దృష్టిలో చూస్తే, సృష్టికి స్వతహాగా మంచి, చెడు అనేవి లేవు. అది ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే, ప్రపంచం మనకు ఆ రంగులోనే కనిపిస్తుంది. అద్దం మీద దుమ్ము పడితే మన ముఖం అందులో స్పష్టంగా కనిపించదు. అలాగే, మనస్సు అనే అద్దం మీద ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు’ అనే దుమ్ము చేరినప్పుడు ఈ ప్రపంచంలోని సౌందర్యం, మంచితనం మనకు కనిపించవు.
మహాభారతంలో దుర్యోధనుడికి లోకంలో ఒక్క మంచివాడు కూడా కనిపించకపోవడం, ధర్మరాజుకు ఒక్క చెడ్డవాడు కూడా దొరకకపోవడం కేవలం ఒక కథ కాదు. ధర్మరాజు మనస్సు దయ, క్షమ, సత్యం, నిష్కామంతో నిండి ఉంది. అతని చిత్తం స్వచ్ఛంగా ఉంది. అందుకే ఆయనకు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక సుగుణం కనిపించింది. చివరకు తనలో ఎక్కడో దాగి ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూసుకుని, తనకంటే చెడ్డవారు లేరని అంగీకరించగలిగాడు. జగత్తు అనేది మన మనస్సుకు ప్రతిబింబం మాత్రమే అన్న పరమ సత్యాన్ని ఈ ఘట్టం తేటతెల్లం చేస్తుంది. ఈ ‘ఆత్మ పరిశీలన’ ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. మనకు ఎదుటివారిలో కేవలం లోపాలే కనిపిస్తున్నాయంటే, లోపం వారిలో లేదు, చూసే మన దృష్టిలో ఉందని గ్రహించాలి.
మంచిని నిర్మించడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. దానికి వనరులు, సమయం, అధికారం, వ్యవస్థల మద్దతు, చాలా మంది సహకారం కావాలి. ఒక సామాన్యుడు ఒంటరిగా ఒక గొప్ప వ్యవస్థను రాత్రికి రాత్రే నిర్మించలేక పోవచ్చు. చెడును నిరసించడం ఒక తక్షణ బాధ్యత. దీనికి వనరులు అక్కర్లేదు. కేవలం నైతిక బలం, ‘ఇది తప్పు‘ అని చెప్పే ధైర్యం, నిజాయితీ ఉంటే చాలు. ఒకరు ధైర్యంగా గొంతెత్తితే, అది ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఆ చెడుకు అక్కడితో ఒక అడ్డుకట్ట పడుతుంది.
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లు కర్మయోగి అన్నింటినీ సమానంగా చూస్తాడు. ఎవరైనా తప్పు చేసినా, వారి పరిస్థితులను అర్థం చేసుకుని క్షమించగలగడం ధర్మరాజు లక్షణం. అది అంతర్గత శాంతికి మార్గం. ప్రపంచాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ ప్రపంచాన్ని చూసే మన ‘దృష్టిని‘ మార్చుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం దానంతట అదే మారుతుంది. లోపాలను వెతికే దుర్యోధనుడి దృష్టి నుండి, గుణాలను చూసే ధర్మరాజు స్థాయికి మన మనస్సును ఎదిగేలా చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
Tags : 1