300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
పశ్చాత్తాపం... ప్రాయశ్చిత్తం
Published on Mon, 09/07/2026 - 01:44
ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. తెలిసో తెలియకనో మనం ఇతరులకు బాధ కలిగిస్తుంటాం. ఆ తర్వాత అది తప్పు అని తెలుసుకోగలగటం, అందుకు మనసులో బాధతో దహించుకుపోవటాన్నే పశ్చాత్తాపం అంటారు. ఇదే మానవత్వపు ఔన్నత్యం!
మళ్ళీ ఆ తప్పు తనవల్ల జరగకుండా జాగ్రత్త పడటం, తనవల్ల వేదనకు గురైన బాధితులకు తగిన మేలు చేయడమే ప్రాయశ్చిత్తం, అదే మానవ ధర్మం. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు పాప పరిహారం లేదు’ అని ఎవరో అన్నారని ‘నేను పశ్చాత్తాప పడుతున్నాను’ అని ఒక మాట చెప్పేసి ‘నేను పశ్చాత్తాప పడ్డాను కాబట్టి నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు’ అని తప్పించుకోవటానికి అవకాశం లేదు. ఆదిశంకరాచార్యులవారు కూడా అలా అడ్డదారులలో సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల ఫలితాల నుండి విముక్తం అవటం సాధ్యం కాదు అనీ జ్ఞానబుద్ధితో మాత్రమే ప్రాయశ్చిత్తం లభిస్తుందని అన్నారు.
‘తెలిసి చేసిన తప్పును ఏ దేవుడూ క్షమించడు’ అని తరతరాలుగా పెద్దలు చెబుతున్న మాట కూడా ఆమోద యోగ్యమే. ‘ఎవ్వరికీ అపకారం చేయని ఆ ఆవు చావుకి కారణమయ్యాను. ఇక నేను కూడా బతకను’ అని.. ఆత్మాహుతి చేసుకునేందుకు పరుగులు తీసే మనసున్న మనిషికి మాత్రమే .... కేవలం పశ్చాత్తాపం తో పరిహారం అయినట్లు భావించాలి. పశ్చాత్తాపపు బాధతో దహించుకుపోతున్న మనస్సుతో అతను జీవితం మొత్తం గడుపుతాడు. ఆ వ్యథనే అతడు శిక్షగా భావిస్తాడు.
పై వివరణ కేవలం ఒక ఘటన, ఉదాహరణ మాత్రమే. పశ్చాత్తాపం అంటే పై విధంగా ఉండాలి.
దేశం ఏదైనా, మతం ఏదైనా సమాజంలో మానవుని జీవితంలో తప్పు జరగటం అనివార్యం, అయితే అటువంటి తెలిసీ తెలియని తప్పులకు కూడా పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం వంటివాటిని పెద్దలు ఎప్పుడో చెప్పారు. వ్యక్తిగతంగా పశ్చాత్తాపపడటం క్షమాపణ చెప్పటం నైతికత. ప్రవర్తనను సంస్కరించుకొనటం, ఆపై పరిహారం అందించటం ద్వారా ప్రాయశ్చిత్తం. చట్టపరమైన.. న్యాయం నష్టపరిహారం అందేలా ప్రయత్నం చేయటం, శిక్షద్వారా పశ్చాత్తాపం పొందేలా చేయటం ప్రాయశ్చిత్తం జరిపించడం ఆచరణీయాలుగా ఉన్నాయి.
క్రైస్తవ్యంలో.. మెటానోయియా అనబడుతూ పశ్చాత్తాపం, దైవశాస్త్ర ప్రాయశ్చిత్తం ఉన్నాయి
యూదు మతంలో.. తెషువా అనబడే ప్రాయశ్చిత్తం ఉన్నాయి. ఇస్లాంలో.. తౌబా అనబడే ఆచారం.. పశ్చాత్తాప భావనను, ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది. లౌకికవాదంలో... పశ్చాత్తాపం అంటే వ్యక్తం చేయటంతో పాటు, క్షమించ బడటానికి సమాజంలో విశ్వాసం పొందడానికి తగిన పారదర్శకతతో కూడిన పరిహార చర్యలను ప్రాయశ్చిత్తంగా భావిస్తుంది.
ప్రభావవంతమైన నైతిక పునరుద్ధరణకు పునరావృతం కాకుండా నిరోధించడానికి నిజమైన పశ్చాత్తాపంతో పాటు స్పష్టమైన తత్సమానమైన ప్రాయశ్చిత్తం అవసరం అంటుంది. ధర్మశాస్త్రం, పురాణాలూ, నిఘంటువులు, మతాలూ, చట్టాలూ ఏమిచెబుతున్నా... ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. తప్పు. అలాంటి తప్పులకు పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది
అపరాధ భావంతో తెలియక చేసిన ఆ పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగపాపం తొలగిపోతుంది. పశ్చాత్తాపంలో భాగంగా పాటించవలసిన కట్టుబాటులో బాధితుల్ని శరణు వేడటం, మెప్పించటం వంటి నిబంధనలు ఉంటాయి.
చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని పురాణాలు చెపుతున్నాయి. దానినే..‘మనః ప్రాయశ్చిత్త’మని అంటారు. ఇట్టి మనః ప్రాయశ్చిత్తం బాధితులకు భౌతికంగా, మానసికంగా కూడా సహాయకారియై పరస్పరం ఇరువర్గాలకు మనశ్శాంతిని ఇస్తుందని జ్ఞానులు నమ్ముతారు.
– డా.గాదిరాజు మధుసూదన రాజు
Tags : 1