Breaking News

ఆ సంగతి, విరిగిన పాళీకి.. తడి వెలసిన కుంచెకు.. నాకు మాత్రమే తెలుసు!

Published on Mon, 05/01/2023 - 15:13

అనగనగా అప్పుడు మా రాయలసీమలో గద్దర్ అనే పేరు విన్నాను అంతే, పాట అయితే అసలే తెలీదు. పోస్టర్ ఒకటి  మా ఊరి ఆత్మకూర్ బస్టాండ్ గోడలపైకి, ఆర్టీసి బస్టాండ్ కాంపౌండ్ వాల్ మీదికి వచ్చి చేరింది. నల్లని పోస్టర్‌పై కసిరి దూకుతున్నట్టున్న అక్షరాలు ఆర్టిస్ట్ మోహన్‌వి. ఆ అక్షరాల మహాగ్రహం చూసి గద్దర్‌పై పేలిన తూటాపై నిరసన పుట్టింది నా రాయలసీమ బ్రతుకులో.

అది ఆర్ట్ చేసిన పని. ఏ పల్లవి ఫాంట్ నుండో, అనుపమ బోల్డ్ నుండో ప్రేమ, కరుణ, దుఃఖం, కసి, క్రోధం జనియించవురా కంప్యూటర్ డబ్బా డిజైనుల్లారా! ఆకాశం ఊదే మెరుపుదెబ్బ వంటి అక్షరాలు కాగితంపై ఉరిమి చూడాలంటే ఆర్టిస్ట్ కావాలి. అది మోహన్ మాత్రమే అయి ఉండాలి. ఆ దారి చిత్తప్రసాద్ మాత్రమే వేసినది అయి ఉండాలి.

అలా గోడమీది అచ్చు బొమ్మలు మాత్రమే చూసే నా బ్రతుకులో నెల తిరగ్గానే ఆ బొమ్మలేసే చేతిని, ఆ బొమ్మలు పుట్టే సింగల్ డెమీ, డబల్ డెమీ తెల్లకాగితాన్ని, రోట్రింగ్ పాయింట్ నిబ్బుని, రన్నింగ్ మేటర్ చెక్కే లక్సోర్ స్కెచ్ పెన్నుని, కొండచిలువలా సరసర పాకే అక్షరాల జైనా నేచురల్ హెయిర్ బ్రష్ నడకని… నేను, నావంటి అనేక నోరెళ్ళుకపెట్టు జాతి వాళ్ళం అలా చూస్తూనే ఉండేవాళ్లం.

ఒకే పేద్ద కాగితం, అదే పొడవాటి వేళ్ళ చిత్రకళా విన్యాసం. నో దిద్దుబాట్లు, నో అచ్చుతప్పులు, నో కొట్టివేతలు… అలా చూస్తుండగానే నరాల బిగువూ, కరాల సత్తువ, కణకణ మండే, గలగల తొణికే అనేక కన్నులు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ, చెరసాలలలో చిక్కేవాళ్ళూ… అనేకులింకా అభాగ్యులంతా, అనాథలంతా, అశాంతులంతా ఆ కాగితంపైనుంచి ఎర్ర ఝండాలపైకి, నీలి పోస్టర్‌లపైకి, బిగిసిన పిడికిళ్ళతో కదనుతొక్కేవారు.

మోహన్‌కు ముందున్న కళ తాలూకు ఆ వంపులు, సొంపులు, వాలుకళ్ళు, పారాణి కాళ్ళు తప్ప ఏవీ ఎరగని ఆ సెక్స్ సింబల్ తెలుగు బొమ్మాయి నడుముకు చెంగు బిగించి పొలికేక నేర్పించింది, కళ్ళు ఉరమడం దిద్దింది మోహన్ కుంచె.

తాడిత పీడిత కర్షక కార్మిక జనానికి రూపం రంగు, పరుగు, బిగింపు, పోరాటం అద్దింది మోహన్ సిరాబుడ్డి. ఎర్ర రంగును, నలుపు ఇంకును ఎక్కడ వాడాలో, కక్కే నిప్పుని కుంచె మొనకు ఆనించి అక్షరాల మెలికని, కొడవలి చివర కాగడాని ఎలా వెలిగించాలో తెలిపింది ఈ పోరాట చిత్రకళా శిఖరంపై ఎర్ర నెలవంకే!

మసాబ్ ట్యాంక్ మహవీర్ ఆసుపత్రి  దగ్గర బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుండి బయటకు వచ్చి చూస్తే గోడకు అంటుకుని ఉన్న కాగితపు బొమ్మ అవశేషాలు కనపడ్డాయి. మోహన్ గారు వేసిన పోస్టర్ అది. చిరిగిన పీలికల కాగితపు తుకడా. జనంలానే ఉంది. లేని న్యాయంలానే ఉంది, దిక్కులేని బ్రతుకు లానే ఉంది, ఈ రోజు మేడే అని దీనంగా వెళ్ళబోసుకున్నట్లు గా ఉంది.

ఈ మేడే రోజున, ఇంతకు మునుపు మేడే రోజున అంతా అలానే వుంది. ఇక ముందు కూడా ఇలానే వుండవచ్చు. కడుపు కాలడం, కన్నెర్ర చేయడం, పేదవాడి కోపం, పేలుతున్న వీపు… అంతా అలానే ఉంది. కార్మికుడు, కర్షకుడు, మోటర్ మెకానిక్, మిల్లు కూలి, చీకటి పాట, పేలిన తూటా… అన్నీ అలానే ఉన్నై. రెపరెపల ఎర్ర ఝండా, నినాదాల పోస్టర్ మాత్రం అనాథలయిపోయాయి.

ఈ జాతికి ఉండిన ఎర్ర పోస్టర్ తాలూకు ఒకే ఒక చిత్ర కళాకారుడు లేడు. ఇది అవశేషం, అపురూపం, దొరకని దృశ్యం… అంతరించిపోయిన గత మూడున్నర దశాబ్దాల పోరాట బొమ్మ చరిత్ర. ఆ ఎరుక మీకూ, దానికీ కూడా లేదు. అది మీకు తెలుసా? ఈ సంగతి, విరిగిన పాళీకి తెలుసు, తడి వెలసిన కుంచెకు తెలుసు, నాకు తెలుసు.
-అన్వర్‌, ఆర్టిస్ట్‌, సాక్షి

#

Tags : 1

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)