ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం
Breaking News
రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం
Published on Thu, 01/15/2026 - 13:35
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం సరఫరా చేసే కంపెనీలకు మధ్య బకాయిల వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుమారు రూ.3,900 కోట్లకు పైగా ఉన్న దీర్ఘకాలిక బకాయిలను చెల్లించాలని ప్రముఖ ఆల్కహాలిక్ బేవరేజ్ (అల్కోబెవ్) పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
ఏడాది కాలంగా నిధులు పెండింగ్
తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ద్వారా మద్యం సరఫరాదారులకు చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుతం రూ.3,900 కోట్లు దాటిందని, ఇందులో రూ.900 కోట్లు గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయని సంఘాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం సరఫరా జరిగిన 45 రోజుల్లోపు చెల్లింపులు జరపాల్సి ఉండగా, ఆ నిబంధన అమలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
రికార్డు స్థాయిలో ఆదాయం
గడచిన పదేళ్లలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం కళ్లు చెదిరే రీతిలో పెరిగింది.
2014 ఆదాయం: సుమారు రూ.9,000 కోట్లు.
2023-24 ఆదాయం: దాదాపు రూ.38,000 కోట్లు (నాలుగు రెట్లు పెరుగుదల).
అక్టోబర్ 2025: కేవలం రిటైల్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుల ద్వారానే ప్రభుత్వం రూ.3,000 కోట్లు వసూలు చేసింది.
డిసెంబర్ 2025: మద్యం విక్రయాల టర్నోవర్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందనే అంచనాలున్నాయి.
రాష్ట్ర మొత్తం పన్ను ఆదాయంలో మూడో వంతు వాటా ఈ రంగం నుంచే వస్తోంది. నెలకు సగటున రూ.2,300 నుంచి రూ.2,600 కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తుందని సంఘాలు హెచ్చరించాయి.
తగ్గుతున్న పెట్టుబడులు
రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని పరిశ్రమ వర్గాలు గణాంకాలతో సహా వివరించాయి. టీజీ ఐపాస్ కింద వచ్చిన అనుమతుల రూపేణా గత ఏడాది వచ్చిన పెట్టుబడులు రూ.28,100 కోట్లు ఉండగా, 2024-25లో అవి రూ.13,730 కోట్లకు (సుమారు 50% పైగా తగ్గుదల) పడిపోయాయి. త్వరలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) దావోస్ సదస్సులో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పాత ఒప్పందాలను గౌరవించి బకాయిలు చెల్లిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరుగుతుందని సంఘాలు సూచించాయి.
‘బకాయిల చెల్లింపులో ఆలస్యం కొనసాగితే సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన 70,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..
Tags : 1