ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
Breaking News
భారత్‌లో పాగా వేసేందుకు అమెజాన్ దూకుడు!
Published on Tue, 03/17/2026 - 13:39
భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యునికేషన్ (శాట్‌కామ్) విభాగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దిగ్గజ కంపెనీల మధ్య పోటీ ముదురుతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇప్పటికే రేసులో ముందంజలో ఉండగా జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ తన ‘ప్రాజెక్ట్ కూపర్’ కోసం అనుమతులను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులు భారత టెలికాం శాఖ (డాట్)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
అనుమతుల కోసం..
భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం అమెజాన్ గత కొంతకాలంగా వేచి చూస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో దీన్ని వేగవంతం చేయాలని కోరుతూ అమెజాన్ వరుస లేఖలు రాసినట్లు సమాచారం.
స్టార్‌లింక్ వర్సెస్ కూపర్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో పాగా వేయడమే కాకుండా భారత్‌లో కూడా అనుమతుల ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. స్టార్‌లింక్‌తో పోలిస్తే అమెజాన్ తన సాటిలైట్ లాంచింగ్ షెడ్యూల్‌లో కొంత వెనుకబడి ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, భారతీయ వినియోగదారులకు త్వరగా చేరువ కావడానికి అమెజాన్ వేగంగా చర్యలు చేపడుతోంది.
భారీ కెపాసిటీతో సవాలు
స్టార్‌లింక్ సేవలతో పోలిస్తే తమ శాటిలైట్ నెట్‌వర్క్ భారత్‌లో గణనీయమైన స్థాయిలో డేటా కెపాసిటీని అందించగలదని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్, నిరంతర కనెక్టివిటీ విషయంలో స్టార్‌లింక్‌కు గట్టి పోటీ ఇస్తామని కంపెనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
టెలికాం రంగంలో కొత్త విప్లవం
కేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ కూపర్ పనిచేస్తోంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
భారత ప్రభుత్వం ఇప్పటికే స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ సంస్థలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమెజాన్ ఎంత త్వరగా లైసెన్స్ పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెజాన్ రంగంలోకి దిగితే ధరల యుద్ధం మొదలై అంతిమంగా భారతీయ వినియోగదారులకే మేలు జరుగుతుందని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags : 1