సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!
Breaking News
యూనికార్న్ క్లబ్‌లోకి హైదరాబాద్ స్కైరూట్
Published on Thu, 05/07/2026 - 17:58
హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్ ‘స్కైరూట్’ 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 570 కోట్లు) నిధులను సమీకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో కంపెనీ దేశంలోనే తొలి స్పేస్-టెక్ 'యూనికార్న్' హోదాను దక్కించుకుంది. ఈ లేటెస్ట్ ఫండింగ్‌తో కంపెనీ మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది.
సాధారణంగా ఒక స్టార్టప్ విలువ 1 బిలియన్ డాలర్లను దాటితే.. దాన్ని యూనికార్న్‌గా పరిగణిస్తారు. భారత అంతరిక్ష రంగంలో.. ఇది గొప్ప విజయంగా భావిస్తారు. దీన్నిబట్టి చూస్తే భారతీయ స్పేస్ కంపెనీల వృద్ధి ఎలా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ పెట్టుబడి రౌండ్‌కు షెర్పలో వెంచర్స్, జీఐసీ నాయకత్వం వహించాయి. అంతే కాకుండా గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకులు, ఆర్కామ్ వెంచర్స్ వంటి ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ ఇన్వెస్టర్, అలాగే గూగుల్ తొలి పెట్టుబడిదారులలో ఒకరు, బోర్డు సభ్యుడైన రామ్ శ్రీరామ్ కూడా ఇందులో చేరనున్నారు.
కంపెనీ కొత్తగా సేకరించిన నిధులను మూడు ప్రధాన లక్ష్యాల కోసం వినియోగించనుంది. మొదటగా, 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగాలను తరచుగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రెండవది, రాకెట్ తయారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. మూడవది, మరింత శక్తివంతమైన 'విక్రమ్-2' రాకెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టనుంది.
ఈ రాకెట్ ఒక టన్ను వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యంతో రూపొందుతుంది. అధునాతన క్రయోజెనిక్ ఇంజిన్‌తో ఇది మరింత పెద్ద మిషన్లకు ఉపయోగపడనుంది.
ప్రస్తుతం స్కైరూట్ సంస్థ 'విక్రమ్-1' ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది భారత్‌లో పూర్తిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా గుర్తింపు పొందుతోంది. ఈ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఆపరేటర్లకు తక్కువ ఖర్చుతో, అనుకూలమైన స్పేస్ లాంచ్ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Tags : 1