విద్యార్థినికి జనసేన నాయకుడు నారాయణరావు వేధింపులు
Breaking News
ఐపీవో వేల్యుయేషన్స్‌లో సెబీ జోక్యం చేసుకోదు
Published on Fri, 11/07/2025 - 04:22
ముంబై: ఐపీవోలకు సంబంధించిన వేల్యుయేషన్స్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల దృష్టి కోణాన్ని బట్టే వేల్యుయేషన్ ఉంటుందన్నారు. అవకాశాలను బట్టి మార్కెట్టే దాన్ని స్వేచ్ఛగా నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
ఇటీవలి కాలంలో లెన్స్‌కార్ట్‌లాంటి సంస్థలు భారీ వేల్యుయేషన్లతో పబ్లిక్ ఇష్యూలకు రావడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో కూడా నైకా, పేటీఎంలాంటి కొత్త తరం, డిజిటల్ కంపెనీల విషయంలోనూ ఇలాంటి ఆందోళనే వ్యక్తమైంది. మరోవైపు, ఈఎస్‌జీ లక్ష్యాలపై కంపెనీలు నిబద్ధతతో పని చేయాలని పాండే సూచించారు. సైబర్ రిస్క్, డేటా ఎథిక్స్‌లాంటి కీలక అంశాల్లో డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులు తమ పరిజ్ఞానాన్ని మరింతగా పెంచుకోవాలని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో మోసాల కట్టడికి చర్యలు..
పెట్టుబడి అవకాశాల పేరిట సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో జరిగే మోసాలను కట్టడి చేయడంపై సెబీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం దిగ్గజ సోషల్ మీడియా, ఇంటర్నెట్ సెర్చ్ ప్లాట్‌ఫాంల సహాయాన్ని తీసుకుంటోంది. ఈ తరహా మోసపూరిత కార్యకలాపాల కోసం తమ నెట్‌వర్క్‌లు దురి్వనియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని వాటికి సూచించింది. కేవలం సెబీ రిజిస్టర్డ్ వ్యక్తులు, సంస్థలు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్టులను, సర్వీసులను ప్రచారం చేసే విధంగా వెరిఫికేషన్ ప్రక్రియను అమలు చేయాలి పేర్కొంది.
అలాగే, ఇన్వెస్టర్లు మోసపూరిత యాప్‌లకు దూరంగా ఉండేలా, నికార్సైన ట్రేడింగ్ యాప్‌లను ప్రత్యేకమైన వెరిఫైడ్ లేబుల్‌తో చూపించే విధానాన్ని ప్రవేశపెట్టాలని వివరించింది. ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టే ముందు సదరు సంస్థ, యూపీఐ హ్యాండిల్స్ మొదలైనవి సిసలైనవేనా కాదా అనేది ధృవీకరించుకునేందుకు సెబీ పోర్టల్‌ను సందర్శించాలని పేర్కొంది. అంతర్జాతీయ సెక్యూరిటీస్ కమీషన్స్ సంస్థ (ఐవోఎస్‌సీవో) ఇటీవలే ఇలాంటి పెట్టుబడుల మోసాల కట్టడి గురించి పలు సిఫార్సులు చేసింది.
Tags : 1