మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..
Breaking News
పాత సంవత్సరాలకు నోటీసులొస్తున్నాయి..
Published on Mon, 03/23/2026 - 12:06
ముందుగా పాఠకలోకానికి పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, సాఫీగా గడవాలని కోరుకుంటున్నాం.
ఆన్‌లైన్‌లో నోటీసుని చూడగానే ముందుగా ఎంతో ఆందోళన చెందారు చెంగలరావుగారు. తాను ప్రతి సంవత్సరం ఠంచనుగా సకాలంలో పన్నులు చెల్లించి, సకాలంలో రిటర్నులు వేసే కచ్చితమైన మనిషి. ఆరేడేళ్ల క్రితం గవర్నమెంటు వారిచ్చిన మెడల్, నగదు బహుమతి పొందారు. ఒకప్పుడు ఆయకర్ రత్న అవార్డులు, రాష్ట్రీయ సన్మానాలు పొందిన వారు చెంగలరావుగారికి ఆదర్శం. ప్రభుత్వం ఇటువంటి వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో పాల్గొనే వ్యక్తులుగా గుర్తిస్తుంది. అంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న చెంగలరావు గారికి నోటీసులు వచ్చాయి. ఆర్థిక సంవత్సరంలో మీరు పన్ను పూర్తిగా చెల్లించలేదు.. బకాయి, వడ్డీ చెల్లించండి అనేది వాటి సారాంశం. ఆ నోటీసులను పది సార్లు చదివి, ఉగ్రుడైపోయాడాయన. కోపం, విసుగు, అసహనం.. వెంటనే ఆడిటర్‌కి ఫోన్ చేశారు.
‘‘ఏమోనండి. రికార్డులు తెచ్చి చూపిస్తే కానీ ఏమీ చెప్పలేం. అన్ని కాగితాలూ పట్టుకురండి’’ అని తేల్చిచెప్పారు ఆడిటరు. సంఘాన్ని, ప్రభుత్వాన్ని, డిపార్టుమెంటుని ఎడాపెడా తనలో తానే తిట్టుకుంటూ, కాసేపు ఆ కోపాన్ని పన్ను ఎగవేతదార్లపై ప్రదర్శించాక, భార్య కాంతం తమ్ముడు ఏకాంబరం వైపు ఫోకస్ మళ్లింది. ‘‘నీ తమ్ముడు కాంట్రాక్టరు. వాడెప్పుడైనా నేను కట్టినంత కట్టాడా. ఎప్పుడూ ఏడుపే. నష్టాలే బావగారూ అని. అటువంటి వాళ్లను ఏమీ అనరు’’ అంటూ విరుచుకుపడ్డారు. కానీ ఆమె జవాబు ఇవ్వలేదు.
మనవడి సహాయంతో బీరువాపైన ఉన్న కాగితాలు కిందికి దించి, ఫైళ్లు వెతకడం మొదలెట్టారు. ఒక నోటీసు 2007–08ది కాగా మరో నోటీసు 2013–14ది. ముందుగానే రెండు నోటీసులను కాపీలు తీసుకుని, ఆయా సంవత్సరాల కాగితాల కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. ఒకటి ఇంచుమించు 18 ఏళ్ల క్రితం నాటిది. మరొకటి 12 ఏళ్ల నాటిది. అదృష్టవశాత్తు ఆయా కాగితాలు దొరికాయి. ‘ధన్యుడనైతిని రామా’ అని ఊపిరి పీల్చుకుని, ముందుగా 2007–08కి సంబంధించిన ఫైళ్లు తీసి ఒక్కొక్క కాగితాన్ని పరిశీలించడం మొదలెట్టారు.
2014లో ఒక నోటీసు వచ్చింది. టీడీఎస్ తక్కువగా జమ అయింది, మిగతా మొత్తం చెల్లించమని. అన్ని కాగితాలు తీసి, ఒక్కొక్క రికవరీ, చెల్లింపు జమకి వివరణ ఇస్తూ, సమన్వయ పట్టిక చేసి, ఎంతో వివరంగా ఇచ్చారు. దాని అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఉంది. అది ఇంకా క్లోజ్ అయినట్లు లేదు. అదే సంవత్సరానికి గాను మళ్లీ నోటీసు. ఆ రిటర్నులు.. అన్ని రికార్డులు, ఆ నోటీసు, తన జవాబు, తాను జతపరచిన కాగితాలు.. అన్నింటినీ పది సార్లు చెక్ చేసుకున్నారు. తనవన్నీ సరిగ్గా ఉన్నాయి.
అయినా నోటీసు. వెంటనే ఆడిటర్‌గారికి ఫోన్ చేశారు. మొదటి పది నిమిషాలు ప్రసంగం..ఉక్రోషం.. ఊగిపోవడమైంది. అయినా సరే, నోటీసు వచ్చింది కాబట్టి, మళ్లీ జవాబు ఇవ్వాల్సిందేనని ఆడిటర్ ఆర్గ్యూ చేశారు. రాత్రి కొడుకు వచ్చాక, అప్పటివరకు అయిన గొడవంతా ఏకరువు పెట్టి, తానే స్వయంగా రిప్లైని చేతితో రాసి, కొడుకు చేత ప్రింటర్లో అన్ని కాపీలు తీశారు. అదొక అరవై పేజీల పుస్తకం అంత అయింది. ఈలోగా రాత్రయ్యింది.
ఇక మర్నాడు మరొక నోటీసు.. అంటే 2013–14ది బైటికి తీశారు. 26ఏఎస్‌లో వివరాలు మిస్ మ్యాచ్ అయ్యాయనేది అందులోని సారాశం. టీడీఎస్ క్రెడిట్లు అవలేదు. షరామామూలే! అదే విపత్తు. అదే కసరత్తు.. మళ్లీ పని యావత్తూ. మొత్తానికి అన్ని కాగితాలూ దొరికాయి. కొడుకు సహాయంతో జవాబు పూర్తి చేశాక, ఓ 30 పేజీల ఫైలు తయారైంది.
తన జ్యూరిస్‌డిక్షన్ అధికారి ఆఫీసుకి ఆటోలో బయలుదేరాడాయన. అధికారులు రెండు జవాబులు తీసుకుని అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చారు. ఎంతో ఆశగా అడిగారాయన ‘‘అన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయి.. రెండు మూడు రోజుల్లో అయిపోతుందా’’ అని. ఆ అధికారి ఆ కాగితాలను పక్కన పెట్టుకుంటూ ‘‘రెండు మూడు నెలల తర్వాత’’ అని ముక్తసరిగా చెప్పారు.
ఇలాంటి చెంగలరావుగార్లు ఎందరో లెక్కలేదు. ఎంతో నిజాయితీగా చెల్లించే రిటైర్డు ఉద్యోగస్తులపై అస్త్రాల మీద అస్త్రాలు వస్తున్నాయి. రికార్డులు అప్‌డేట్ చేసుకోవడం లేదు.. ఇచ్చిన రిప్లై సరిగ్గా చెక్ చేసుకోవడం లేదు. ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం.. ఎంతో విచిత్రమైన పరిస్థితి. అంత పాత రికార్డులు ఉండకపోతే/దొరక్కపోతే ఏంటి పరిస్థితి! కాబట్టి డిమాండ్ల విషయంలో ఎంతో మెలకువగా వ్యవహరించాలి అధికారులు.
Tags : 1