ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
‘ఎన్పీఎస్ తత్కాల్’ పెన్షన్ ధమాకా.. క్షణాల్లో రిటైర్మెంట్ ప్లానింగ్!
Published on Fri, 10/02/2026 - 14:35
దేశంలో అసంఘటిత రంగ కార్మికులు, యువత, టైర్ 2, టైర్ 3 నగరాల ప్రజలకు సామాజిక భద్రతను మరింత చేరువ చేసే దిశగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన ‘ఎన్పీఎస్ తత్కాల్’ విధానం ద్వారా రాబోయే రెండేళ్లలో దాదాపు 2-3 కోట్ల మంది కొత్త చందాదారులను జాతీయ పెన్షన్ విధానంలో (ఎన్పీఎస్) చేర్పించాలని పీఎఫ్ఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్పీఎస్ దివాస్ సందర్భంగా రెగ్యులేటరీ ఛైర్పర్సన్ ఎస్.రామన్ ఈ వివరాలను వెల్లడించారు.
ఏంటీ ‘ఎన్పీఎస్ తత్కాల్’? ఎలా పనిచేస్తుంది?
ఇప్పటివరకు కొత్త పెన్షన్ ఖాతా తెరిచి ‘ప్రాన్’ (Permanent Retirement Account Number) పొందడానికి పేపర్ వర్క్ లేదా సుదీర్ఘ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. ఈ భారాన్ని తగ్గించేందుకు పీఎఫ్ఆర్డీఏ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన బీహెచ్ఐఎం యూపీఐ యాప్ ద్వారా తక్షణ నమోదు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మూడు సులువైన దశల్లో ఖాతా నమోదు
భీమ్ (BHIM) యాప్‌లోని రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ విభాగంలో 'NPS' ట్యాబ్‌ను ఎంచుకోవాలి.
పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలు ఇచ్చి కేవైసీ పూర్తయిన బ్యాంకు ఖాతాను అనుసంధానించాలి.
తొలి కనీస విరాళంగా రూ.250లను యూపీఐ ద్వారా చెల్లించగానే క్షణాల్లో ‘ప్రాన్’ జెనరేట్ అయి ఖాతా యాక్టివేట్ అవుతుంది.
ఎవరెవరికి లభ్యం?
ప్రస్తుత తొలి విడతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి ఫిజికల్ కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా డిజిటల్ కేవైసీ ద్వారా క్షణాల్లో ప్రక్రియ పూర్తవుతుంది.
ఆర్థిక భద్రతలో నూతన అధ్యాయం
సాంప్రదాయ పీఎఫ్ లేదా ఇతర నిలకడైన పెన్షన్ పథకాల పరిధిలో లేనివారికి విశ్రాంత జీవితంలో నిలకడైన రాబడి అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. మార్కెట్ ఆధారిత రాబడితో పాటు రిటైర్మెంట్ సమయంలో నిర్ణీత యాన్యుటీ పింఛను పొందే వెసులుబాటు ఉండటంతో ‘ఎన్పీఎస్ తత్కాల్’ భారతీయ పింఛను వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: పరుగెత్తిన పసిడి ధర!
Tags : 1