భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
NCLT సంచలన నిర్ణయం.. రూ.22 వేల కోట్లకు రూ.6.25 కోట్లేనా?
Published on Tue, 09/01/2026 - 11:53
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర.. వ్యక్తిగత దివాలా కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆగస్టు 25న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇచ్చిన ఆదేశం ప్రకారం.. బ్యాంకులకు, రుణ సంస్థలకు బకాయి ఉన్న రూ.22,006.57 కోట్ల మేర రుణాలకు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకోవడానికి అవకాశం లభించింది. కానీ.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎన్సీఎల్టీ బెంచ్ తాత్కాలికంగా నిలిపివేసింది. కేసు తేలే వరకు చంద్ర తన ఆస్తులను అమ్మడం లేదా ఇతరులకు బదిలీ చేయకూడదని ఆదేశించింది.
నిజానికి సుభాష్ చంద్ర చెల్లించాల్సిన మొత్తం క్లెయిమ్‌లు రూ.22,006.57 కోట్లు. కానీ ఆయన ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్ ప్రకారం కేవలం రూ.6.25 కోట్లు మాత్రమే చెల్లించాలి. మొదట ఈ ప్లాన్‌ను ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ బెంచ్ పరిశీలించింది. అయితే ఇద్దరు సభ్యులు ఒకే అభిప్రాయానికి రాలేదు. ఒకరు ప్లాన్‌కు మద్దతు ఇచ్చిన రుణదాతలకు మాత్రమే దాన్ని వర్తింపజేయాలని భావించగా, మరొకరు ఈ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెబుతూ ప్లాన్‌ను తిరస్కరించారు. దీంతో కేసు మూడో సభ్యుడి వద్దకు వెళ్లింది.
ఆగస్టు 25న మూడో సభ్యుడు సుభాష్ చంద్ర రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. ఈ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన రుణదాతలకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. అయితే.. ఆ తర్వాత కేసు మళ్లీ మొదటి బెంచ్ వద్దకు వచ్చినప్పుడు ముగ్గురు సభ్యుల అభిప్రాయాల్లో స్పష్టమైన మెజారిటీ లేదని తేలింది. దీంతో ఎన్సీఎల్టీ అధ్యక్షుడు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్రత్యేక బెంచ్ కేసును మరోసారి పూర్తిగా పరిశీలించనుంది.
నిజానికి రూ.22,006.57 కోట్ల మొత్తం, హామీదారుగా ఉన్న చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియలోని క్లెయిమ్‌లకు సంబంధించినది. అయితే తాను బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి వ్యక్తిగతంగా అప్పు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన కంపెనీలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు కూడా ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నట్లు వెల్లడించారు.
సుభాష్ చంద్ర హామీదారుగా ఉన్న కంపెనీలు తీసుకున్న రుణాలను చెప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో తనపైన వ్యక్తిగత దివాలా కేసులో రూ.22,006.57 కోట్ల క్లెయిమ్‌లు నమోదయ్యాయని అన్నారు. అయితే ప్రస్తుతం ఆగస్టు 25న ఇచ్చిన రూ.6.25 కోట్ల రీపేమెంట్ ప్లాన్ ఆమోదం నిలిచిపోయింది.
అంటే.. సుభాష్ చంద్ర రూ.6.25 కోట్లు చెల్లించి కేసు ముగించుకోవడానికి కుదరదు. స్పెషల్ ఎన్సీఎల్టీ బెంచ్ అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకు చంద్ర తన ఆస్తులను నేరుగా లేదా పరోక్షంగా బదిలీ చేయకూడదు. మొత్తానికి.. రూ.22 వేల కోట్ల క్లెయిమ్‌లకు కేవలం రూ.6.25 కోట్లతో పరిష్కారం దొరుకుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఎన్సీఎల్టీ తీసుకునే తరువాత నిర్ణయం మీద ఆధారపడి ఉంది.
Tags : 1