థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
తీవ్ర అనారోగ్యాలకు ఆర్థిక ముప్పు!
Published on Fri, 04/03/2026 - 12:36
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణపై చర్చ జరుగుతున్న వేళ ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం సుమారు 11.5% కి చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడంతో సామాన్యుడి ఆర్థిక భద్రతకు సవాలుగా మారింది. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యాల (క్రిటికల్ ఇల్‌నెస్) చికిత్సకు అయ్యే ఖర్చుకు, ప్రజల వద్ద ఉన్న బీమా రక్షణకు మధ్య వ్యత్యాసం పెరుగుతోందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ‘ఏయాన్’ హెచ్చరించింది.
కారణం ఏమిటి?
సాధారణంగా ఆరోగ్య బీమా అంటే కేవలం ఆసుపత్రి ఖర్చులు మాత్రమేనని చాలామంది భావిస్తారు. కానీ, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు లేదా అవయవ మార్పిడి వంటి తీవ్ర సమస్యలు తలెత్తినప్పుడు అసలు సవాళ్లు మొదలవుతాయి. ఏయాన్ ఇండియా హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ వైద్య ఖర్చుల వ్యత్యాసం కేవలం హాస్పిటలైజేషన్ ఖర్చులకే పరిమితం కాదు. దీర్ఘకాలిక చికిత్స వల్ల ఉద్యోగానికి లేదా వృత్తికి ఆటంకం కలగవచ్చు. మందులు, డయాగ్నోస్టిక్స్, రికవరీ సమయంలో అయ్యే ఇతర ఖర్చులు అదనపు భారం. ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి ఆధునిక వైద్య పద్ధతులు ప్రాణాలను కాపాడుతున్నప్పటికీ వాటి ఖరీదు సామాన్యుడికి భారంగా మారుతోంది’ అన్నారు.
వేతనాలు తక్కువ.. వైద్య ఖర్చులు ఎక్కువ!
ఏయాన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ నివేదిక ప్రకారం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వైద్య ఖర్చుల పెరుగుదల వేతనాల పెరుగుదల కంటే వేగంగా ఉంది. 2026 వరకు ఈ రెండంకెల ద్రవ్యోల్బణం(11.5 శాతం) ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. భారతదేశంలో సగటున ఒక ఉద్యోగికి తన సంస్థ ద్వారా లభించే బీమా కవరేజీ రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్యే ఉంటోంది. అయితే, ఒక తీవ్రమైన వ్యాధికి చికిత్స పొందాలంటే ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదు.
గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే..
చైనా, మలేషియా, థాయిలాండ్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారతదేశంలో బీమా రక్షణ పొందినవారి సంఖ్య తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సామాజిక భద్రతా వ్యవస్థలు బలంగా ఉండగా, భారత్‌లో ప్రజలు తమ జేబుల నుంచే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
నిపుణుల సూచనలు
పెరుగుతున్న ఈ ఆర్థిక అగాధాన్ని పూడ్చడానికి కేవలం ప్రాథమిక ఆరోగ్య బీమా సరిపోదని బీమా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అందులో.. సాధారణ పాలసీతో పాటు తీవ్రమైన వ్యాధులకు ప్రత్యేక కవరేజీ ఇచ్చే రైడర్లను తీసుకోవడం, కంపెనీ ఇచ్చే బీమాకు అదనంగా ఉద్యోగులే కొంత ప్రీమియం చెల్లించి కవరేజీని పెంచుకోవడం, నివారణా చర్యలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ ద్వారా వ్యాధులు రాకుండా చూసుకోవడం వంటివి ఉన్నాయి.
ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ అది ఆర్థికంగా సామాన్యుడిని కుంగదీయకూడదంటే.. బీమా రక్షణ ప్రణాళికలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శారీరక ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని ఏయాన్ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు
Tags : 1