మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు
Breaking News
భారీగా వంట నూనెల దిగుమతులు
Published on Fri, 04/17/2026 - 06:03
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు మార్చిలో భారీగా పెరిగాయి. 11,73,168 టన్నులుగా ఉన్నట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) తెలిపింది. గతేడాది మార్చి నెలలో దిగుమతులు 10,45,281 టన్నులతో పోల్చితే 12 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు (ఎడిబుల్ ఆయిల్) పెరగడం, రవాణా చార్జీలు కూడా అధికమైనందున, రానున్న నెలల్లో దిగుమతులు తగ్గొచ్చని ఎస్ఈఏ పేర్కొంది. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గుముఖం పట్టడం లేదంటే రూపాయి విలువ బలోపేతం అయ్యే వరకు దిగుమతులు పెరగకపోవచ్చని ఎస్ఈఏ అంచనా. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులను తటస్థం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించొచ్చని పేర్కొంది.
→ అత్యధికంగా ముడి పామాయిల్ (శుద్ధి చేయని) దిగుమతులు దాదాపు రెట్టింపు స్థాయిలో 6,73,965 టన్నులుగా ఉన్నాయి. 2025 మార్చిలో పామాయిల్ దిగుమతులు 3,43,949 టన్నులుగా ఉండడం గమనార్హం.
→ నాన్ ఎడిబుల్ నూనెల దిగుమతులు మాత్రం క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 27,742 టన్నుల నుంచి 13,401 టన్నులకు తగ్గాయి. నాన్ ఎడిబుల్ అంటే ఆహార వినియోగానికి పనికిరానివి. వీటిల్లో మలినాలు, హానికారకాలు ఎక్కువగా ఉంటుంటాయి. సబ్బుల్లో, లూబ్రికెంట్లలో, ఫార్మాస్యూటికల్స్ తయారీలో వీటిని వినియోగిస్తుంటారు.
→ వెజిటబుల్ నూనెల దిగుమతులు 11 శాతం పెరిగి 11,86,569 టన్నులుగా ఉన్నాయి. సోయా, సన్‌ఫ్లవర్, పీనట్, కార్న్, కనోలా ఇవన్నీ వెజిటుబల్ ఆయిల్స్ కిందకు వస్తాయి. వీటితో సహా వంటకు వినియోగించే అన్ని రకాల నూనెలను ఎడిబుల్ ఆయిల్స్‌గా పేర్కొంటారు.
→ 2025–26 మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 8 శాతం పెరిగి 65,72,131 టన్నులకు చేరాయి. ఏటా నవంబర్‌తో మొదలై మరుసటి సంవత్సరం అక్టోబర్‌తో ఇది ముగుస్తుంటుంది.
నెలవారీగా తగ్గుముఖం..
క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే మార్చిలో వంట నూనెల దిగుమతులు పెరిగినప్పటికీ.. అంతక్రితం నెలతో (ఈ ఏడాది ఫిబ్రవరి) పోల్చి చూస్తే మాత్రం దిగుమతులు 10 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో దిగుమతులు 12.92 లక్షల టన్నులుగా ఉన్నాయి. పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియా నుంచి.. సోయాబీన్ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. మొత్తం అవసరాల్లో సగానికి పైనే దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
Tags : 1