టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం
Breaking News
ఆ రియల్ ఎస్టేట్ స్కీమ్‌లకు ఆశపడితే..
Published on Sat, 11/15/2025 - 12:46
ప్రీలాంచ్, బైబ్యాక్, యూడీఎస్, అన్‌లాకబుల్ స్పేస్, రెంటల్ స్కీమ్.. పేర్లు ఏమైనా ఇవన్నీ కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేసే స్కీమ్‌లే. నివాస, వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎర వేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం.. సెంటు భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి.
ఏ కంపెనీలు ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నాయనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. అసలు ప్రీలాంచ్ మోసాలకు కారణం ఎవరు? చిన్న వస్తువు కొంటేనే బ్రాండ్, ధర, ఎక్స్‌పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు.. జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు పునఃపరిశీలన చేసుకోవడం లేదు? సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్ చేతిలో పెట్టేయడం ఎంత వరకు కరెక్ట్?
భవన నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించేటప్పుడు అందులోని ఫ్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్‌కు, ఆ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారుడికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో నమ్మకమే కొరవడింది. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభం చూసే భూయజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు.. ఇలా అత్యాశతో పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు.
నిధుల మళ్లింపుతో..
వ్యాపారంలో షార్ట్‌కర్ట్ దురుద్దేశంతో కొంతమంది బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో సగం ధరకే ఫ్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తూ హోమ్ బయ్యర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా సమీకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేక చతికిలపడిపోతున్నారు. అత్యాశ కలిగిన బిల్డర్లు పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు.
అధ్యయనం చేయకుండానే..
ప్రీలాంచ్, యూడీఎస్ స్కీమ్‌ల పేరిట కస్టమర్లను మోసం చేసేందుకు వందలాది మంది బిల్డర్లు పుట్టుకొస్తున్నారు. కొంత మంది కొనుగోలుదారులు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి, అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పిస్తుండటంతో ప్రీలాంచ్ మోసాలు జరుగుతూనే ఉంటాయి. ప్రీలాంచ్ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను కఠినంగా శిక్షించాలి. కస్టమర్లు ఇలాంటి ఆఫర్లతో మోసపోకుండా జాగ్రత్తపడాలి.
కొనేముందు గమనించాల్సినవి ఇవే..
నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి.
ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి.
డెవలపర్ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి.
గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి.
పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదా తెలుసుకోవాలి.
ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి.
డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి.
Tags : 1