లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
మైక్రోఫైనాన్స్ సంస్థల వైపు బ్యాంకుల చూపు..
Published on Wed, 09/02/2026 - 16:56
సూక్ష్మ రుణాలివ్వడంలో బ్యాంకులు రూటు మారుస్తున్నాయి. నేరుగా రిటైల్ రుణగ్రహీతలకు కాకుండా మైక్రోఫైనాన్స్ సంస్థలకు (ఎంఎఫ్ఐ) రుణాలివ్వడానికి మొగ్గు చూపుతున్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నేరుగా వ్యక్తులకు ఇచ్చిన రుణాలు వార్షికంగా 28.5 శాతం తగ్గి రూ. 83,080 కోట్లకు చేరాయి. గత క్యూ1లో ఇది రూ. 1.16 లక్షల కోట్లుగా నమోదైంది. తాము నేరుగా ఇవ్వకుండా మైక్రోఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలివ్వడానికి బ్యాంకులు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణం.
సమీక్షాకాలంలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు బ్యాంకుల నుంచి సమీకరించిన నిధులు 64.8 శాతానికి పెరగడం దీనికి నిదర్శనం. తాజా ఎంఎఫ్ఐఎన్ మైక్రోమీటర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు తీసుకున్న రుణాలు 91.4 శాతం ఎగిసి రూ. 21,407 కోట్లకు చేరాయి. ఈ సంస్థలు సేకరించిన మొత్తం నిధుల్లో బ్యాంకుల వాటా 80.4 శాతంగా ఉండగా, బ్యాంక్‌యేతర సంస్థల వాటా 12.1 శాతంగా నమోదైంది. ఎక్స్టర్నల్ కమర్షియల్ రుణాలు 5.3 శాతంగా ఉన్నాయి. మైక్రోఫైనాన్స్ పరిశ్రమలో రుణ పరిమాణం పెరుగుతూ, రుణగ్రహీతల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో బ్యాంకులు ఎంఎఫ్ఐలకు మరింతగా నిధులు సమకూరుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
నివేదికలో మరిన్ని విశేషాలు..
జూన్ 30 నాటికి పరిశ్రమ మొత్తం మైక్రో–క్రెడిట్ పోర్ట్‌ఫోలియో వార్షికంగా 6.9 శాతం తగ్గి రూ. 3.29 లక్షల కోట్లకు దిగి వచ్చింది. యాక్టివ్ లోన్ అకౌంట్లు 12.5 కోట్ల నుంచి 9.9 కోట్లకు తగ్గాయి.
సూక్ష్మ రుణాల్లో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల వాటా పెరిగి పోర్ట్‌ఫోలియో రూ. 1.46 లక్షల కోట్లకు చేరింది. ఇది ఈ విభాగంలో 44.3 శాతం వాటాకు సమానం. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల పోర్ట్‌ఫోలియో వార్షికంగా 5.2 శాతం పెరగ్గా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వాటా 6.1 శాతం తగ్గింది.
ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు క్యూ1లో 43.1 శాతం అధికంగా రూ. 29,820 కోట్ల రుణాలిచ్చాయి. అదే సమయంలో క్లయింట్ల సంఖ్య వార్షికంగా 11.3% తగ్గి 3.1 కోట్లకు పరిమితమైంది. రుణ ఖాతాల సంఖ్య 10.5%క్షీణించి 3.8 కోట్లకు చేరింది. ఒక్కో అకౌంటు ద్వారా రావాల్సిన రుణ బాకీ సగటున 27.8 శాతం పెరిగి రూ. 29,406 నుంచి రూ. 37,584కు చేరింది. రుణగ్రహీతల సంఖ్య తగ్గినప్పటికీ సగటు రుణ పరిమాణం గణనీయంగా పెరగడాన్ని ఇది సూచిస్తోంది.
31–180 రోజుల వ్యవధికి సంబంధించి మొండిబాకీలుగా మారే రిసు్కలున్న రుణాల పరిమాణం 5.3% నుంచి 1.5%కి తగ్గింది. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు తాజాగా తీసుకున్న రుణా లు రెట్టింపయ్యాయి. ఒకవైపు సదరు సంస్థలకు నిధుల లభ్యత పెరగ్గా, మరోవైపు అసెట్ క్వాలిటీ కూడా మెరుగుపడటం గమనార్హం.
రిపోర్టులో 40 ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐలను (ఎంఎఫ్ఐఎన్లో సభ్యత్వం ఉన్నవి) పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం)లో 12 భారీ ఎంఎఫ్‌ఐల వాటా ఏకంగా 93.8 శాతంగా ఉంది. క్యూ1లో రుణాలు పొందడంలో 98.1 శాతం, రుణ వితరణలో 95.7 శాతం వాటా వీటిదే ఉంది.
భౌగోళికంగా చూస్తే రూ. 53,163 కోట్ల పోర్ట్‌ఫోలియోతో బీహార్ అతి పెద్ద మైక్రోఫైనాన్స్ మార్కెట్‌గా నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ (రూ.39,661 కోట్లు), తమిళనాడు (రూ.38,718 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Tags : 1