ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
వ్యాపారాలకు కేంద్రం అభయం
Published on Wed, 05/06/2026 - 02:49
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ వ్యాపార రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య లభ్యత కొరతను అధిగమించి వ్యాపారాలు సజావుగా సాగేందుకు వీలుగా ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్’ (ఈసీఎల్జీఎస్) 5.0కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ పథకానికి పచ్చజెండా ఊపింది. ఈ స్కీమ్ ద్వారా అర్హత కలిగిన వ్యాపార సంస్థలతో పాటు విమానయాన రంగానికి మొత్తం రూ.2,55,000 కోట్ల మేర అదనపు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో విమానయాన రంగానికి ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు కేటాయించారు.
అర్హతలు, రుణ హామీ వివరాలు
మార్చి 31, 2026 నాటికి వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు కలిగి ఉండి, ఎకౌంట్లు స్టాండర్డ్‌గా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్–ఎంఎస్ఎంఈలు, షెడ్యూల్డ్ ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్ ఈ పథకానికి అర్హత పొందుతాయి. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) ద్వారా ఎంఎస్ఎంఈలకు వంద శాతం రుణ హామీ కల్పిస్తారు. నాన్–ఎంఎస్ఎంఈలకు, విమానయాన రంగానికి 90 శాతం గ్యారెంటీ ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించి సంస్థల నుంచి ఎలాంటి గ్యారెంటీ ఫీజు వసూలు చేయరు.
పథకంలో రుణ పరిమితులు
2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉపయోగించిన గరిష్ట వర్కింగ్ క్యాపిటల్‌లో 20 శాతం వరకు అదనపు రుణం మంజూరు చేస్తారు. దీనికి గరిష్ట పరిమితిని రూ.100 కోట్లుగా నిర్దేశించారు. విమానయాన సంస్థలకు కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి వంద శాతం వరకు అదనపు రుణం అందిస్తారు. అయితే ఒక సంస్థకు గరిష్టంగా రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయిస్తారు. మార్చి 31, 2027 వరకు బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు ఈ పథకం మార్గదర్శకాలు వర్తిస్తాయి. రుణ కాలపరిమితి ముగిసే వరకు ఈ గ్యారెంటీ కవర్ అందుబాటులో ఉంటుంది.
తిరిగి చెల్లించే గడువులు
రుణం తిరిగి చెల్లించేందుకు ఎంఎస్ఎంఈ, నాన్–ఎంఎస్ఎంఈలకు మంజూరైన తేదీ నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇందులో ఒక ఏడాది మారటోరియం (అసలు చెల్లించాల్సిన అవసరం లేని సమయం) కలిసి ఉంటుంది. విమానయాన రంగానికి రెండేళ్ల మారటోరియంతో కలిపి మొత్తం ఏడేళ్ల కాలపరిమితి ఇస్తారు.
ఉపాధి రక్షణే లక్ష్యంగా..
పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా తలెత్తే స్వల్పకాలిక ద్రవ్య లభ్యత సమస్యలను అధిగమించడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని కేంద్రం వెల్లడించింది. సంస్థల వ్యాపార కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడటం, ఉద్యోగాలను కాపాడటం, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా చూడటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. సకాలంలో అదనపు వర్కింగ్ క్యాపిటల్ అందించడం ద్వారా దేశీయ ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags : 1