Breaking News

అండ దొరకక... కొండ దిగక

Published on Fri, 07/17/2026 - 05:14

పోడు వ్యవసాయమే జీవనాధారం.. దట్టమైన అడవులు, వాగులు, వంకలే స్నేహితులు..  చలమల నీరే జీవధార.. విద్య, వైద్యం అందని ద్రాక్షే.. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతున్నా.. అత్యవసర సమయంలో చికిత్స అందని మావే.. ఎవరికైనా ప్రాణాల మీదికొస్తే ఎంతో శ్రమకోర్చి.. ఎత్తయిన కొండలు ఎక్కుతూ దిగుతూ.. డోలీపై మోసుకుని రావాల్సిందే.. అయినప్పటికీ సకాలంలో వైద్యం అందక కారడవుల్లోనే కలసిపోతున్న ప్రాణాలెన్నో.. అడవితల్లి ఒడిలో మమేకమై.. తరతరాలుగా ఎత్తయిన కొండల పైనే జీవనం సాగిస్తున్న కొండరెడ్ల గిరిజనుల దుస్థితి ఇది. ఐటీడీఏల ద్వారా కోట్లు ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పగా చెబుతున్నా.. కష్టాల చీకట్లు నిండిన వారి జీవితాల్లో అభివృద్ధి వెలుగులు ఎంతమాత్రం ప్రసరించడం లేదు.  

చింతూరు: గిరిజనుల్లో కొండరెడ్లది అరుదైన తెగ. విలీన మండలాల్లోని కొండలపై వీరు అనాదిగా నివసిస్తున్నారు. సాధారణ గిరిజన ఆవాసాలకు దూరంగా ఎత్తయిన కొండలపై పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతమంది అటవీ ఫలసాయం సేకరించడంతో పాటు అటవీ ఉత్పత్తులు తయారు చేసి, సమీప ప్రాంతాల్లో విక్రయిస్తూంటారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో 9,127 మంది కొండరెడ్లు నివాసముంటున్నారు. 

కొండలపై నివసిస్తూ వీరు పడుతున్న ఇబ్బందులను గమనించి, అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు దింపేందుకు ఉమ్మడి రాష్ట్ర హయాంలో అప్పటి ఐటీడీఏ పీఓలు అనేక ప్రయత్నాలు చేశారు. మైదాన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడంతో పాటు వ్యవసాయానికి భూములిస్తామని చెప్పడంతో అప్పట్లో కొంతమంది కొండలు దిగారు. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారికి సరైన మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. దీంతో, కొద్ది కాలంలోనే వారందరూ తిరిగి కొండల పైకి వెళ్లిపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. 

కొండల పైనే ఆవాసాలు 
చింతూరు డివిజన్‌లో నివసిస్తున్న కొండరెడ్లలో అధిక శాతం మంది బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఎత్తయిన కొండలపై ఆవాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామాలకు సమీపాన రాళ్లు, రప్పలతో నిండిన ప్రాంతాలను చదును చేసుకుని, పోడు వ్యవసాయం చేస్తూంటారు. వర్షాధారమైన వారి భూముల్లో జొన్న, మొక్కజొన్న తప్ప ఇతర పంటలు పండవు. తాగునీటి కోసం వాగులు, చెలమల నీటిపై వీరు ఆధారపడతారు. 

చదువుకు దూరం 
వీరి గ్రామాలకు వెళ్లాలంటే కిలోమీటర్ల మేర ఎత్తయిన కొండలు కాలినడకన ఎక్కుతూ వెళ్లాల్సిందే. వీరి పిల్లలకు విద్యనందించేందుకు గతంలో ఐటీడీఏ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొండలపై పాఠశాలలు నెలకొల్పారు. ప్రస్తుతం ఒకటి రెండు పాఠశాలలు మాత్రమే నడుస్తున్నాయి. కొంత మంది కొండరెడ్డి పిల్లలు సమీప మైదాన ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లడం దూరాభారం కావడంతో చాలా మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారనే విమర్శలున్నాయి. 

వైద్యం అందని ద్రాక్ష 
ఎత్తయిన కొండలపై నివసిస్తున్న కొండరెడ్లకు వైద్య సేవలు అందడం కూడా గగనంగా మారింది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఇబ్బందులు తప్పడం లేదు. ఆసుపత్రులకు వెళ్లాలంటే కిలోమీటర్ల మేర కాలినడక తప్పనిసరి. రాళ్ల బాటల్లో కిలోమీటర్ల మేర కొండలు దిగాల్సిన పరిస్థితి. అత్యవసర సమయంలో తమవారి ప్రాణాలు కాపాడుకునేందుకు డోలీలో మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లినా.. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయని కొండరెడ్లు వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కూనవరం మండలం కారుమానుకొండకు చెందిన కొండరెడ్డి యువతి సమ్మక్క ప్రియ పాము కాటుకు గురవగా డోలీపై మోసుకుని ఆసుపత్రిలో చేరి్పంచారు. కానీ, అప్పటికే వైద్యం అందడం ఆలస్యమై ఆమె మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది. 

అండ కల్పిస్తే కొండ దిగేనా! 
కూనవరం మండలంలో కారుమానుకొండ, గబ్బిలా­లగొంది, చింతగండి, కోపిరిమెట్ట, కళింగిమిద్ది, చింతూరు మండలంలో ఉప్పనపల్లి గట్టు,బావిబొ­క్క, చల్లకవ్వం, ఏరువాడ, వేగిశగండి వంటి కొండరెడ్ల గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల గిరిజనులను సమీప మైదాన ప్రాంతాలకు దింపి, ఇళ్లు, సాగుభూమితో పాటు అన్ని రకాల మౌలిక సౌకర్యాలూ కల్పిస్తే కొండలు దిగే అవకాశముంది. గతంలో కూనవరం మండలం పెద్దవాగుకు చెందిన కొన్ని కొండరెడ్డి కుటుంబాలు కూనవరం సమీపంలోని గండి కొత్తగూడెం గ్రామానికి దిగినా.. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో తిరిగి కొండల పైకి వెళ్లిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం విద్య, వైద్యం వంటి తప్పనిసరి అవసరాలపై వారికి అవగాహన కల్పించి, కొండలు దించి, ప్రగతి ఫలాలు అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

అటకెక్కిన కొండబాట 
గతంలో చింతూరు ఐటీడీఏ పీఓగా పని చేసిన ఆకుల వెంకట రమణ కొండరెడ్ల అభివృధ్థి కోసం కొండబాట పేరుతో ప్రత్యేక ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రతి నెలా 15, 30 తేదీలను పరి్టక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూపు – పీవీటీజీ (కొండరెడ్లు) డేగా ప్రకటించారు. ఆయా తేదీల్లో ఈ మూడు మండలాల్లోని ఏదో ఒక కొండరెడ్డి గ్రామాన్ని ఐటీడీఏ పీఓతో పాటు అన్ని శాఖల అధికారులూ సందర్శించి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గం చూపాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. 

దీంతోపాటు ఐటీడీఏలో కొండరెడ్ల కోసం ప్రత్యేక గీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. వారిని కొండల పైనుంచి మైదాన ప్రాంతాలకు దించి, ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అంతే కాకుండా వ్యవసాయ కోసం భూమి మంజూరు చేసి, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు పండించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతలోనే ఆయన బదిలీ కావడంతో కొండబాట కార్యక్రమం కాస్తా అటకెక్కింది. కొండరెడ్ల జీవనం షరా మామూలే అన్న చందంగా మారింది.

ఎవ్వరూ పట్టించుకోక.. 
పచ్చని కొండల నడుమ. కొండవాగు ఆవల.. కనీకనిపించనట్టుగా ఉన్న ఈ ఊరు పేరు ఎర్రగొండపాకల. ఈ గ్రామాన్ని రహదారి చెంతకు చేర్చి.. ఇక్కడి కొండరెడ్లకు మంచి భవిష్యత్తునివ్వాలని ఓ అధికారి భావించారు. ప్రధాన రహదారికి సమీపాన కొన్ని ఇళ్లు నిర్మించి వారిని అక్కడికి తరలించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారు. కానీ, అక్కడి గిరిజనులకు శాపం తగిలినట్లు.. అంతలోనే ఆ అధికారి బదిలీపై వెళ్లిపోయారు. అనంతరం వచ్చిన అధికారుల్లో ఏ ఒక్కరూ ఆ ఊరి గురించి పట్టించుకోలేదు. దీంతో, ఆ ఊరి ప్రజలు ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో నివసిస్తున్న పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఊరు కాస్తా మూడు ముక్కలైంది.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)