తత్తరపాటు.. బిత్తర చూపులు! 

Published on Wed, 10/11/2023 - 04:37

‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ గురించి నాకేం తెలీదు.. అసలు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని భూములను హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనడం గురించి నాకేం తెలియదు’
– నారా లోకేశ్‌ 

‘భూముల కొనుగోలుకు తీర్మానిస్తూ హెరిటేజ్‌ ఫుడ్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్‌లో చేసిన తీర్మానం ఇదిగో. ఆ మీటింగ్‌లో మీరూ పాల్గొన్నారు. మినిట్స్‌ రికార్డుల్లో సంతకం కూడా చేశారు. అయినా కూడా మీకు భూముల కొనుగోలు గురించి తెలీదంటారా?’
– సీఐడీ అధికారుల సూటి ప్రశ్న

సాక్షి, అమరావతి: సీఐడీ సంధించిన సూటి ప్రశ్నలకు తత్తరపాటుకు గురై బిత్తరపోవడం లోకేశ్‌ వంతైంది. మాజీ సీఎం చంద్రబాబు తరహాలోనే ఆయన తనయుడు నారా లోకేశ్‌ కూడా సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే  సీఐడీ అధికారులు పూర్తి ఆధారాలతో ప్రశ్నించేసరికి తడబాటుకు గురై అసహనం ప్రదర్శించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఏ–14గా ఉన్న నారా లోకేశ్‌ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణకు మంగళవారం హాజరయ్యారు.

తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన్ను సిట్‌ అధికారులు విచారించారు. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ లోకేశ్‌కు సమీపంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పించి మరీ విచారించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని బట్టి సీఐడీ అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతూ విచారణ కొనసాగించారు. సుహృద్భావ వాతావరణంలో విచారణ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రాధా­న్యమిచ్చారు. లోకేశ్‌ సహకరించడం లేదని స్పష్టమవుతున్నా ఓపిగ్గా ప్రశ్నలు సంధిస్తూ ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు నోటీసులిచ్చారు. 

ఇవిగో ఆధారాలు.. మరేమంటారు?
విచారణకు సహకరించకుండా కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు లోకేశ్‌ యత్నిస్తుండటంతో ఒక దశలో సీఐడీ అధికారులు ఇక లాభం లేదని గేర్‌ మార్చారు. అంతవరకు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదని చెబుతూ వచ్చిన వాటికి సంబంధించి ఆధారాలను ఒక్కొక్కటిగా చూపుతూ ఆరా తీయడంతో లోకేశ్‌ కంగుతిన్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములను కొనుగోలు చేసిన విషయం తనకు తెలియదని లోకేశ్‌ మొదట బుకాయించారు. అయి తే ఆయన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల మీటింగులో పాల్గొన్నట్టు నిరూపించే రికార్డులను చూపించడంతో పాటు భూముల కొనుగోలుకు ఆమోదించిన తీర్మా నం కాపీని అధికారులు ప్రదర్శించడంతో తత్తరపాటుకు గురయ్యారు.

వాటిపై సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో తన న్యాయవాదితో మా ట్లాడి చెబుతానన్నారు. అందుకు సీఐడీ అధికారులు అనుమతించడంతో  సమీపంలోనే ఉన్న న్యాయవాదితో మంతనాలు జరిపారు. అనంతరం తిరిగి వచ్చి ఆ సమావేశంలో చాలా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారని, అయితే అవేవీ తనకు గుర్తు లేదని సమాధానమిచ్చారు. రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల విషయంపై తనకు తెలియదని బుకాయించేందుకు లోకేశ్‌ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎందుకంటే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న భూములనే కొనుగోలు చేయాలని హెరిటేజ్‌ ఫుడ్స్‌ నిర్ణయించింది.

అక్కడ భూములను కొనుగోలు చేయడం వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో పేర్కొన్నారు. రాజధాని కోసం భూసమీకరణకు ప్రభుత్వం భూములను తీసుకుంటున్న ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం వ్యాపార విస్తరణకు ఎలా దోహదపడుతుందని భావించారని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించారు. అంటే ఆ ప్రాంతంలోని భూములు భూసమీకరణకు కిందకు రావని మీకు ముందే తెలుసా? అని సూటిగా నిలదీసేసరికి లోకేశ్‌ నీళ్లు నమిలారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించిన భూములను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన భూములున్న విషయం మీకు తెలుసా అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మీ తండ్రి చంద్రబాబుతో కలసి మీరు నివసిస్తున్న కరకట్ట బంగ్లా లింగమనేని కుటుంబం ఇచ్చిందనే విషయంపై మీకు అవగాహన ఉందా? అని ప్రశ్నించగా ఆయన చాలాసేపు మౌనం వహించారు. క్విడ్‌ప్రోకో కిందే ఆ కరకట్ట నివాసం మీకు వచ్చిందన్న అభియోగంపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించినా సరే లోకేశ్‌ సూటిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం.  


వెళ్లండి... రేపు రండి
లోకేశ్‌ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన్ను మరోసారి విచారించాలని సీఐడీ అధి కారులు నిర్ణయించారు. ఈమేరకు బుధవారం విచారణకు హాజరు కావాలంటూ సెక్షన్‌ 41 ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇచ్చారు. 

గూగుల్‌లో వెతికితే చాలు: లోకేశ్‌
తన గురించి గూగుల్‌లో వెతికినా లభించే సాధారణ సమాచారాన్నే సీఐడీ అధికారులు విచారణలో ప్రశ్నించారని విచారణ అనంతరం లోకేశ్‌ వ్యాఖ్యానించారు.  ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ  ఈ కేసుకు సంబంధించి సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కక్ష సాధింపు కోసమే తమపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.

అన్నిటా బాబు బాటలోనే..
అవినీతికి పాల్పడటంలోనే కాదు సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేయడంలో తండ్రి చంద్రబాబు బాటనే లోకేశ్‌ అనుసరించారు. విచారణను తప్పించుకునేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టడంతో అనివార్యంగా లోకేశ్‌ సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి సీఐడీ అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలీదనే చెబుతూ వచ్చారు.

అలైన్‌మెంట్‌ను మూడు సార్లు మార్చిన విషయంపై ప్రశ్నిస్తే అసలు తనకు ఆ విషయమే తెలియదని చెప్పుకొచ్చారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూముల కొనుగోలుకు సంబంధించిన ప్రశ్నలకు తనకు తెలీయదని..గుర్తు లేదని చెప్పడం గమనార్హం. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్‌ హోదాలో మీరు ఎలాంటి విధులు నిర్వహించారు..? ఎలాంటి నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారనే ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. సీఐడీ అధికారులు విచారణ నియమావళి ప్రకారం అడిగిన ప్రశ్నలకు సమా­ధానాలు గూగుల్‌లో సెర్చ్‌ చేసినా దొరుకుతాయని లోకేశ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 

Videos

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం

జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)