Breaking News

కూర్మానికెంత కర్మమో!

Published on Sun, 02/22/2026 - 05:53

కాట్రేనికోన:ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఇక్కడ అంతర్వేది నుంచి కొత్తపాలెంలోని శాక్రిమెంటో లైట్‌హౌస్‌ మొగ వరకూ ఉన్న ప్రాంతంలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు భారీగా మృత్యువాత పడుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. నెల రోజుల వ్యవధిలో సుమారు వెయ్యికి పైగా తాబేళ్లు చనిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటిలో అధికంగా ఆడ తాబేళ్లే ఉండటం గమనార్హం. 

అటవీ శాఖ వైల్డ్‌లైఫ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న తాబేళ్ల పరిరక్షణ కేంద్రాలకు చెందిన సిబ్బంది రెండు రోజుల్లో ఎస్‌.యానాం వద్ద సుమారు 30 తాబేళ్లను, గచ్చకాయలపోర వద్ద 20 తాబేళ్లను పూడ్చి పెట్టారు. మత్స్య, అటవీ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం ఈ తాబేళ్లకు ప్రాణ సంకటంగా మారిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులకు ఆ శాఖ అధికారులు కనీస అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. అలాగే చనిపోయిన తాబేళ్లకు పోస్ట్‌మార్టం చేసి, తగిన అధ్యయనమూ చేయడం లేదు.

హిందూ మహాసముద్రం నుంచి..
సుమారు 350 ఏళ్లకు పైబడి జీవించే ఈ తాబేళ్ల మృత్యువాతకు కారణాలు వెతకాల్సి ఉంది. హిందూ మహాసముద్ర జలాల నుంచి సంతానోత్పత్తి కోసం ఇవి ఏటా నవంబరులో ఇక్కడకు వలస వస్తాయి. ఆడ తాబేలు గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు వస్తే.. మగ తాబేలు తీరంలోనే తన జత కోసం ఎదురు చూస్తూంటుంది. 

అనంతరం, ఆ రెండూ హిందూ మహాసముద్ర జలాల్లోకి వెళ్లిపోతాయి. ఇంత హాయిగా సాగిపోయే జీవవైవిధ్య ప్రక్రియలో పెద్ద కుదుపు. ప్రకృతి వైపరీత్యమో.. మానవ తప్పిదమో.. వేల సంఖ్యలో అవి మృత్యువాత పడుతున్నాయి. చమురు వ్యర్థాలతో సముద్ర జలాలు కలుషితం కావడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, భారీ వలలకు చిక్కుకోవడం వంటి కారణాలతో విగత జీవులై కాకులు, కుక్కలు, నక్కల పాలవుతున్నాయి.

రక్షణకు రూ.లక్షల వ్యయం
అంతరించిపోతున్న జాతుల్లో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు ఒకటని గుర్తించి అటవీ శాఖ ఉమ్మడి జిల్లాలోని హోప్‌ ఐలాండ్, కొత్తపాలెం మొగ, గచ్చకాయలపోర, ఎస్‌.యానాం, వాసాలతిప్పల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రం వద్ద నలుగురు సిబ్బంది నియమించింది.

మత్స్యశాఖ అలసత్వం
మత్స్యశాఖ అధికారుల అలసత్వం, నియంత్రణ లేని చేపల వేట, తాబేళ్ల రక్షణలో నిర్లక్ష్యం ఈ పరిస్థితికి దారి తీస్తోంది. చేపల వేటకు పనికిరాని, పాడైపోయిన ప్లాస్టిక్‌ వలలను సముద్ర జలాల్లో వదిలివేయడం.. వాటిలో తాబేళ్లు చిక్కుకోవడం.. వేటకు వెళ్లిన వారి వలల్లో పడిన తాబేళ్లు గంటలకొద్దీ అందులోనే ఉండిపోవలసి రావడం తదితర కారణాలతో తాబేళ్లు చాలా వరకూ మృత్యువాత పడుతున్నాయి. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు వేటకు వెళ్లేవారికి అవగాహన కల్పించాల్సి ఉంది.

కలుషితమవుతున్న జలాలు 
తీరం వెంబడి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చమురు సంస్థలు, రొయ్యల హేచరీలు, ఓడలు రాకపోకలప్పుడు విడుదలయ్యే చమురు వ్యర్థాలతో సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్య కారక పరిస్థితుల వల్ల జలచరాల పునరుత్పత్తి సజావుగా సాగడం లేదు. నదీపాయలు, సముద్ర జలాల్లో చమురు సంస్థలు చేపట్టిన డ్రెడ్జింగ్‌ పనులుతో గోదావరి సహజత్వాన్ని కోల్పోయింది. దీంతో, చేపలు, రొయ్యలు ఈ పాయల వెంబడి రావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటికి ఎదురు వచ్చే అత్యంత రుచికరమైన పులసలు నానాటికీ తగ్గిపోతున్నాయని, చేపలు పడక జీవనోపాధి కోల్పోతున్నామని వారు అంటున్నారు.

అంతరిస్తున్న జాతులపై అవగాహన అవసరం 
అంతరించిపోతున్న జలచరాల్లో తిండి సొర, సముద్ర గుర్రం, వేల్‌ షార్క్, ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల పరిరక్షణకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల జలచరాలకు ఎదురవుతున్న విపత్తులపై చేపల వేట చేస్తున్న మత్స్యకారులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఈ దిశగా కాలుష్య నియంత్రణ శాఖ, అటవీ శాఖ (వన్య ప్రాణి సంరక్షణ), మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలి. 

తాబేళ్ల సంతానోత్పత్తి సమయంలో ఈ ప్రాంతంలో చేపల వేటను నిషేధించాలి. మత్స్య సంపద సంతానోత్పత్తికి అడ్డంకిగా మారుతున్న, సముద్ర జలాలను కలుషితం చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలకు తగిన విధంగా అవగాహన కల్పించాలి. అవసరమైతే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోస్టుమార్టం చేయిస్తాం
తాబేళ్లు మృత్యువాత పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాటికి పోస్టుమార్టం చేయిస్తాం. మత్స్యశాఖ అధికారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తాం.  – ఎంవీ ప్రసాదరావు,డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అటవీ అధికారి

అవగాహన సదస్సులు నిర్వహిస్తాం
అంతరించిపోతున్న సముద్ర జీవుల రక్షణపై విద్యార్థులు, స్థానిక మత్స్యకారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. పరిశ్రమలు, ఇతర సంస్థల ద్వారా వస్తున్న వ్యర్థాలతో సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. పాత వలలు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్ర జలాల్లో వేయకుండా చర్యలు చేపడతాం. – వర్ధన్, మత్స్యశాఖ జేడీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)