Breaking News

‘పోలవరం’లో కమీషన్ల కథ

Published on Mon, 06/09/2025 - 02:09

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి జీవం తీసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండటంపై ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజై­న్‌­­ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల మందంతో కాకు­ండా 0.9 మీటర్ల మందంతో ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌­–2లో పునాది డయాఫ్రం వాల్‌ నిర్మిస్తుండట­ంపై ఇంజినీరింగ్‌ నిపుణులు మండిపడుతు­న్నారు. 

గతంలో 2016–18 మధ్య ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2­లో డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో అవకత­వ­క­లకు పాల్ప­డటం వల్లే అది కోతకు గురై దెబ్బ­తిన్న విష­యాన్ని గుర్తు చేస్తున్నారు. కమీషన్ల కోసం పోలవ­రాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నా­రని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఇంజినీరింగ్‌ నిపుణులు గుర్తు చేస్తు­న్నా­రు. గతంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కట్ట­బె­ట్టిన కాంట్రాక్టు సంస్థ బావర్‌కే కొత్త డయాఫ్రం వాల్‌ పనులను అప్పగించడాన్ని తప్పు పడుతున్నా­రు. 

టెండర్లు పిలవకుండా కట్టబెట్టేశారు
రూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్‌ పనులకు టెండర్లు పిలవాలి. కానీ.. ఆ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు అప్పగించి.. ఆ తరువాత ఆ సంస్థపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి అన­ధికారికంగా బావర్‌ సంస్థకు కట్ట­బెట్టడంపై అనుమా­నాలు వ్యక్తమవుతున్నాయి. డయా­ఫ్రం వాల్‌ మందం తగ్గించడం వల్ల పనుల పరిమాణం తగ్గుతుందని.. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు పథకం రచించారని స్పష్టం చేస్తు­న్నారు. 

సీపేజీ(ఊటనీరు)ని సమర్థవంతంగా అడ్డు­కట్ట వేయడానికే డయాఫ్రం వాల్‌ నిర్మిస్తు­న్నారు. డయాఫ్రం వాల్‌ ఎంత నాణ్యంగా, పటిష్టంగా ఉంటే ప్రధాన డ్యామ్‌ అంత పటిష్టంగా ఉంటుంది. డయాఫ్రం వాల్‌ మందం తగ్గడం వల్ల పటిష్టత తగ్గుతుందని.. ప్రధాన డ్యామ్‌ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్‌లో చీలికలు ఏర్పడి ఊటనీటి ఉధృతి పెరగడానికి దారి తీస్తుందని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రధాన డ్యామ్‌కు గండ్లుపడి ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.వందల కోట్లు కాజేసేందుకే..
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్‌ పనులను 2022లో మేఘా సంస్థ పూర్తి చేసింది. ఆ డయాఫ్రం వాల్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులను రూ.990 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు కాగితంపై ప్రభుత్వం అప్పగించింది. 

కానీ.. మేఘా­పై ఒత్తిడి తెచ్చి బావర్‌ సంస్థకు ఆ పనులను అనధి­కారికంగా సబ్‌ కాంట్రాక్టు కింద ఇచ్చేసింది. పను­లను సబ్‌ కాంట్రాక్ట్‌ కింద అధికారికంగా ఇస్తే మేఘా, బావర్, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి. కానీ.. మేఘా, బావర్‌ మధ్య అంతర్గత ఒప్పందం చేసుకోవడాన్ని బట్టిచూస్తే ముఖ్యనేత కమీషన్ల కక్కుర్తి బయటపడిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

గతంలో అంటే 2016–18లో డయాఫ్రం వాల్‌ పనులను బావర్‌ సంస్థకే అప్పగించగా.. కొత్త డయాఫ్రం వాల్‌ పనులను తిరిగి ఆ సంస్థకే కట్టబెట్టడం గమనార్హం. కొత్త డయాఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందం.. గరిష్టంగా 93.5 మీటర్ల లోతు.. 1,396.6 మీటర్ల పొడవుతో టీ–16 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ సమ్మేళనంతో నిర్మించేలా జనవరి 16న సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఆ డిజైన్‌ ప్రకారం 66,002 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు చేయాల్సి ఉంటుంది. 

కానీ.. డయాఫ్రం వాల్‌ మందం తగ్గించడం వల్ల చేయాల్సిన పనుల పరిమాణం సగానికి తగ్గే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. పనుల పరిమాణం తగ్గినా.. అత్యంత కఠిన శిల (సౌండ్‌ హార్డ్‌ రాక్‌)లోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానళ్లను దించి డయాఫ్రం వాల్‌ వేయడం వల్ల అదనపు పనులు చేశామని చూపి రూ.వందల కోట్లు కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి కమీషన్లు రాబట్టుకునేందుకు ముఖ్యనేత పథకం వేశారని చెబుతున్నారు.

కమీషన్ల కోసం చారిత్రక తప్పిదం
» సీడబ్ల్యూసీ ఆమోదించిన పోల­వరం ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌­లను పూర్తిచేసి.. వాటి మధ్యన ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రం వాల్‌ నిర్మి­ంచి దానిపై ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేయాలి. 

»  కానీ.. 2016, డిసెంబర్‌లో ఒకేసారి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ప్రధాన డ్యామ్‌ డయాఫ్రం వాల్‌ పనులను నాటి చంద్రబాబు సర్కారు ప్రారంభించి చారిత్రక తప్పిదం చేసింది. కమీషన్ల కక్కుర్తితో ఆ పనులను బావర్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టు కింద కట్టబెట్టేసింది. 

గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్‌ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్‌ 1,485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్‌ నుంచి 2018 జూన్‌ వరకూ చెయినేజ్‌ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించింది. 

» డయాఫ్రం వాల్‌ను అప్పట్లో బావర్‌ సంస్థ ఇష్టారాజ్యంగా చేసిందని.. ప్యానళ్లను సౌండ్‌ హార్డ్‌ రాక్‌లోకి రెండు మీటర్ల లోతు వరకూ దించలేదని, కేవ­లం సాధారణ రాతి నేల వరకూ మాత్రమే పనులు చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

»   కానీ.. అవేమీ పట్టించుకోకుండా డయాఫ్రం వాల్‌ పనులకు 2018 జూన్‌ నాటికే రూ.393.32 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. మరో రూ.94 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని బావర్‌ సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడపులు చేతు­లు మారాయి. అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ అధినేత రాయపాటి రంగారావు మీడియా సాక్షిగా వెల్లడించిన అంశాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ను అదే సంస్థకు కట్టబెట్టడం.. లోపభూయిష్టంగా పనులు చేస్తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ప్రధాన డ్యామ్‌ భద్రతకే ప్రమాదం
పోలవరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద ఇసుక నేలలో ఊటనీటి (సీపేజీ) ఫర్మియ­బులిటీని  2016–17లో తప్పుగా లెక్కించారు. దీనివల్ల ఎగువ కాఫ­ర్‌ డ్యామ్‌ పునాది జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్‌ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే కమీషన్ల కక్కుర్తితో జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను తక్కువ లోతుతో నిర్మించారనే విషయం స్పష్టమ­వుతోంది. 

2018లో గోదావరి ప్రవాహం జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉధృతికి జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌లో చెయినేజ్‌ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయని.. దానివల్లే ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో సీపేజీ అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. వరద ఉధృతి పెరిగినప్పుడు సీపేజీ తీవ్రత పెరిగి ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు గండ్లు పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ దిగువన దానికి పొడవునా సమాంతరగా బట్రెస్‌ బర్మ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. 

గతంలో చేసిన తప్పునకు పరిహారం రూ.200 కోట్లకుపైగా వ్యయం చేస్తోంది. డయాఫ్రం వాల్‌ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించడం వల్ల.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ దెబ్బతిన్న తరహాలోనే ప్రధాన డ్యామ్‌ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్‌లో చీలికలు ఏర్పడి, సీపేజీ పెరగడానికి.. ప్రధాన డ్యామ్‌లో గండ్లు పడటానికి దారి తీస్తుందని.. ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఇంజినీరింగ్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)