కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత
Breaking News
నల్లమలలో మానవ సంచారం నిషేధం
Published on Mon, 06/30/2025 - 03:27
ఆత్మకూరు రూరల్/ మార్కాపురం: పెద్దపులుల సంతానోత్పత్తి సమయం నేపథ్యంలో నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం (ఎన్ఎస్టీఆర్)లో జూలై 1 నుంచి సెపె్టంబరు 30 వరకు మానవ సంచారం నిషేధం అమలు కానుంది. పులుల సమాగానికి అడవిలో మనిషి కదలికలు అడ్డంకిగా ఉంటాయన్న శాస్త్రీయ నిరూపణతో మూడు నెలల పాటు నల్లమల అభయారణ్యంలో అన్ని రకాల మానవ కార్యకలాపాలకు విరామం ప్రకటించారు. దీన్ని ఎన్ఎస్టీఆర్ అధికారులు గత కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఎకో–టూరిజం రిసార్ట్లు, అటవీ లోతట్టు ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాల దారులు మూసివేయనున్నారు.
అటు ప్రకాశం జిల్లా మార్కాపురం నల్లమల టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలోని సందర్శనీయ స్థలాలను మూడు నెలల పాటు మూసివేస్తున్నామని మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ ఆదివారం తెలిపారు. దోర్నాల–శ్రీశైలం మధ్య అటవీ ప్రాంతంలో సఫారీ, నెక్కంటి రేంజ్లోని ఇష్టకామేశ్వరి ఆలయం, ఎకో టూరిజాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు.
ప్రశ్నార్థకంగా చెంచుల జీవనం?
పులుల సమాగ సమయంలో అటవీ ప్రాంతాల్లో ఎవరూ సంచరించకూడదన్న నిర్ణయం చెంచుల జీవనానికి ప్రశ్నార్థకంగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలో మనుగడ సాగించే చెంచులు తేనె, నన్నారి గడ్డలు, జిగురు వంటివి సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మానవ సంచారం నిషేధం అమలుకానుండటంతో ఉపాధి దూరమవనుందనే ఆందోళనలో చెంచులు ఉన్నారు.
ఇలాంటి తరుణంలో వారికి జీవనభృతి కల్పించాలని వారు కోరుతున్నారు. అటు పులుల ప్రవర్ధనానికి ప్రాముఖ్యత కల్పించినట్లే తమనూ అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నల్లమల అభయారణ్యంలో రాష్ట్ర పరిధిలో ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 12 వేల చెంచు కుటుంబాలున్నాయి. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు భృతి కల్పించినట్లే తమను కూడా ఆర్థికంగా ఆదుకోవాలని చెంచులు కోరుతున్నారు.
Tags : 1