వల్లభనేని వంశీకి అస్వస్థత
Breaking News
శ్రీశైలం @854 అడుగులు.. వరద ఇదేరీతిలో కొనసాగితే ఆరురోజుల్లో
Published on Sun, 07/17/2022 - 03:54
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారంతో పోలిస్తే శనివారం వరద ఉద్ధృతి పెరిగింది. సాయంత్రం 6 గంటలకు కృష్ణా ప్రధాన పాయపై ఉన్న జూరాల నుంచి 1,52,368.. ఉపనది తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1,61,988.. వెరసి 3,14,356 క్యూసెక్కులు చేరుతుండటంతో శ్రీశైలంలో నీటినిల్వ 854 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎంసీలు నీరుంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 125 టీఎంసీలు అవసరం. వరద ఉద్ధృతి ఇదేరీతిలో కొనసాగితే ఆరురోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉంది.
కృష్ణానది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్.. ఉపనది తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్‌లలోకి చేరుతున్న వరదను చేరినట్లుగా దిగువకు వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 1.68 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.48 లక్షల క్యూసెక్కులు విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం కూడా ఇదేరీతిలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి కొనసాగనుంది.
శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువనున్న నాగార్జునసాగర్‌కు 31,784 క్యూసెక్కులు తరలిస్తోంది. నాగార్జునసాగర్‌కు దిగువన బేసిన్‌లో వర్షాలు తెరిపి ఇవ్వడంలో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద కూడా 11,081 క్యూసెక్కులకు తగ్గింది. కృష్ణా డెల్టా కాలువలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Tags : 1