గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
ఇంటింటి వెలుగులు!
Published on Sun, 11/08/2026 - 06:03
దీపావళి పండుగ యుగయుగాలుగా ధన త్రయోదశినుంచి భగిని హస్త భోజనం వరకు ఐదు రోజులపాటు సాంప్రదాయికంగా జరుపుకునే సంబరం. లక్ష్మీపూజ, దీపాల అలంకరణ, పిండివంటలు, బాణసంచా ప్రతి కుటుంబంలోనూపిల్లలు, పెద్దలంతా సంతోషంగా చేసే సందడి.
అత్యంత ప్రశస్తమైన దీపావళి పండగ రోజు ఇల్లంతా రంగురంగుల ముగ్గు లు(రంగోలి) పెట్టి, మామిడితోరణాలతో, పూలదండలతో అన్ని గుమ్మాలను చూడముచ్చటగా అలంకరిస్తారు. సాయంత్రం ప్రదోషకాలంలో గణపతిపూజ, మహాలక్ష్మి పూజ ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. వ్యాపారులు తమ వ్యాపార పుస్తకాలకు పూజ (చో ΄్డా)చేస్తారు.
పూజముగిసిన తరవాత చిన్నపిల్లల చేత గోగుమొక్కలకు గుడ్డ పీలికలు చుట్టి నూనెలో ముంచి వెలిగించి, దివిటీలు కొట్టిస్తూ, ‘దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి’ అని పాడిస్తారు. ఇల్లంతా దీపాలు పెడతారు. పైమిద్దెల మీద కూడా దీపాలు వెలిగిస్తారు. ఇక అది తియ్యటి మిఠాయిలు కుటుంబమంతా తిని ఆనందించే సమయం. ఆ వెంటనే వివిధ రకాల టపాసులు, మతాబాలు, కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు కాలుస్తూ ఆనందిస్తారు.
నాల్గవరోజు అన్న కూటోత్సవం
ఉత్తర భారతదేశంలో గోవర్ధన పూజగా పర్వతం ఆకారంలో అన్నాన్ని చిన్ని గుట్టగా పోసి దేవుడికి సమర్పించే ‘అన్నకూట్’ మహోత్సవం.ఇంద్రుడి గర్వాన్ని అణిచి గోవులను గోపాల బాలురను కాపాడటానికి శ్రీ కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తిన రోజు అని విశ్వసిస్తారు అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన రోజే బలి పాడ్యమి.కొన్ని ప్రాంతాల్లో గోవులను, దూడలను లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో బలిచక్ర వర్తిని పూజించి, నైవేద్యాలు సమర్పిస్తారు.
ఐదవరోజు ‘యమ ద్వితీయ’
యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్లి, ఆమెచేతి వంట తిన్నరోజు. అందుకే దీనికి ‘భగీనీహస్త భోజనం / ‘భాయ్ దూజ్ పర్వదినం’ అంటారు. సోదరీమణులు తమ సోదరుల నుదుట తిలకం దిద్ది, హారతి యిచ్చి, వారి ఆయురారోగ్యాలకోసం ప్రార్థిస్తారు.సోదరులు వారివారి అక్కచెల్లెళ్ళ ఇంటికి వెళ్లి, వారిచేతి భోజనం తిని, వారికి కానుకలు, వస్త్రాలు బహుకరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను దీపావళిని పురస్క రించుకుని చేసే కేదారేశ్వరవ్రతం అత్యంత ప్రముఖమైనది.
పార్వతీదేవి పరమశివుని అర్ధశరీరాన్ని పొంది, ‘అర్ధనారీశ్వరుడి’గా అవతరించడం కోసం యీ వ్రతాన్ని ఆచరి స్తుంది. ఈ నోములో ప్రతీదీ ‘21’సంఖ్యతో ముడిపడి వుంటుంది. 21 దారపు పోగులతో తోరం కట్టి, పూజ చేస్తారు. అప్పాలు, బూరెలు వంటి 21 రకాల పిండివంటలు చేసి, దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. పూజ ముగిసిన తరవాత ముత్తయిదువలకు 21 తమలపాకులు, 21 పోకలు, పండ్లు, బ్లౌజ్ పీస్, దక్షిణతో వాయినం ఇస్తారు. ఈ నోము నోచుకోవడంవల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని నమ్ముతారు.
శ్రీ రాముడు 14 ఏళ్ళ వనవాసాన్ని ముగించుకుని, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా, అయోధ్యలో లక్షలాది మట్టిదీపాలతో ‘దీపోత్సవం’ నిర్వహిస్తారు. వారణాసి గంగానది ఘాట్ల వద్ద విశిష్టమైన గంగహారతితోబాటుగా దీపోత్సవం కూడా చేస్తున్నారు.
→ పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో దీపావళి నాడు లక్ష్మీపూజకు బదులుగా కాళీమాతను పూజిస్తారు. రాత్రివేళ కాలికాదేవికి నిష్ఠగా పూజలు, బలులు సమర్పిస్తారు పితృదేవతలను స్మరిస్తూ కాగడాలు వెలిగించే ఆచారమూ ఉంది.
→ గుజరాతీయులకు దీపావళితో పాత సంవత్సరం ముగిసి ‘బలిపాడ్యమి‘/బెస్తు వారస్ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది.
→ గోవా లో నరకాసురుడి దిష్టి బొమ్మలను తయారు చేసి నరక చతుర్దశి రోజున తెల్లారుజామునే వాటిని దహనం చేసి సంబరాలు చేసుకుంటారు
→ మహారాష్ట్రలో ‘వసుబారస్’ (గోవులను దూడలను పూజించడం)తో ప్రారంభించి, వ్యాపారులు లక్ష్మీ పూజను ఘనంగా శ్రద్ధా భక్తులతో ఆచరి స్తారు
→ పంజాబ్లో సిక్కులు దీపావళి పర్వదినాన్ని ‘బందీ చోర్ దివస్’గా జరుపుకుంటారు. ఆ రోజు సిక్కుల ఆరోగురువైన గురు హరగోవింద్ సింగ్ చెరసాల నుండి విడుదలైన రోజు. అమృత్సర్ లోని స్వర్ణదేవాలయం వేలాది రంగురంగుల దీపాలతో చూడముచ్చటగా మెరిసిపోతుంది.
– శిష్టా›్ల నాగేశ్వరరావు
సీనియర్ పాత్రికేయులు
Tags : 1