విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..
Breaking News
రిలయన్స్ అదుర్స్!
Published on Sat, 10/31/2026 - 05:36
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీన్ (ఆర్ఐఎల్) మరోసారి రికార్డు ఫలితాలతో సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ (2026–27, క్యూ2)లో కంపెనీ రూ.29,550 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.22,092 కోట్లతో పోలిస్తే లాభం 33.8 శాతం ఎగబాకింది. కంపెనీ చరిత్రలో ఇది రికార్డు త్రైమాసిక లాభం కావడం గమనార్హం. గతంలో నమోదైన రూ.23,196 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది.
రిటైల్ వ్యాపారం పనితీరు మందకొడిగా ఉన్నప్పటికీ, పటిష్టమైన రిఫైనింగ్ మార్జిన్లు, డిజిటల్ వ్యాపారం దన్నుతో కంపెనీ మెరుగైన ఫలితాలను నమోదు చేయగలిగింది. కాగా, క్యూ2లో మొత్తం ఆదాయం సైతం 27.8 శాతం దూసుకెళ్లి రూ. 3,62,268 లక్షల కోట్లకు చేరింది. ‘తీవ్ర ఒడిదుడుకులు, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ మా ఓ2సీ బిజినెస్ అత్యుత్తమ త్రైమాసిక పనితీరును సాధించింది. మా నిర్వహణ సత్తాకు ఇది నిదర్శనం’ అని ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పేర్కొన్నారు.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు...
→ ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) వ్యాపార ఎబిటా 67.9 శాతం పెరిగి రూ. 25,203 కోట్లుగా నమోదైంది. ఆదాయం 44.2 శాతం ఎగసి రూ. 2,31,601 కోట్లను తాకింది.
→ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిలో అడ్డంకులతో పాటు రష్యా రిఫైనరీలపై దాడుల నేపథ్యంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్ 3–3.7 రెట్లు ఎగసింది. క్యూ2లో బ్రెంట్ క్రూడ్ సగటు బ్యారెల్ ధర 97 డాలర్లుగా నమోదైంది. గతేడాది క్యూ2తో పోలిస్తే ఇది 40.6% అధికం.
→ ఆయిల్, గ్యాస్ ఎబిటా 2 శాతం తగ్గి రూ.4,901 కోట్లుగా నమోదైంది. కేజీ డీ6లో ఉత్పత్తి తగ్గుదల, అధిక ప్రభుత్వ పన్నులు దీనికి కారణమయ్యాయి.
రిటైల్ వీక్...
రిలయన్స్ రిటైల్ క్యూ2 నికర లాభం 25.5 శాతం తగ్గుదలతో రూ.2,419 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో కంపెనీ నికర లాభం రూ.3,469 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం 6.5 శాతం వృద్ధితో రూ.91,716 కోట్లకు చేరింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) ఆదాయం 5.78 శాతం పెరిగి రూ.80,220 కోట్లను తాకింది. కాగా, క్యూ2లో రిలయన్స్ రిటైల్ 303 కొత్త స్టోర్లను జత చేసింది. నికరంగా 222 స్టోర్లు తగ్గి 19,947కు చేరింది. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ కామర్స్‌లో కొత్త మోడల్, బీ2బీ చానెళ్లు కంపెనీ ఆఫ్‌లైన్ వ్యాపార లాభాలతో నడుస్తుండటంతో పాటు వాటి నుంచి నిధులను అందిస్తున్నామని ఆర్ఆర్వీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు.
జియో రికార్డు ఐపీఓ, లిస్టింగ్‌తో రిలయన్స్ ఇన్వెస్టర్లకు విలువను చేకూర్చే జర్నీలో ఈ వారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 22 రెట్ల సబ్‌్రస్కిప్షన్, మెరుగైన లిస్టింగ్ లాభాలతో ఈ ఇష్యూ పలు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది. నిర్వహణపరమైన క్రమశిక్షణ, మా పోర్ట్‌ఫోలియోలో దేశీ ఫోకస్, మా సమగ్ర వ్యాపారాల్లో వైవిధ్యంతో విదేశీ అనిశి్చతులను రిలయన్స్ సమర్థంగా ఎదుర్కోగలిగింది.
– ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ
బీఎస్ఈలో శుక్రవారం రిలయన్స్ షేరు స్వల్పంగా తగ్గి రూ. 1,165 వద్ద క్లోజయ్యింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
Tags : 1