Big Alert: ఈ రాష్ట్రంలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు
Breaking News
సాంకేతిక సమస్య.. ఆర్‌టీజీఎస్ సేవలు పునరుద్ధరణ
Published on Mon, 10/26/2026 - 11:17
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) అవుట్‌వర్డ్ పేమెంట్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని విజయవంతంగా పరిష్కరించింది. అక్టోబర్ 15 నుంచి 17 మధ్యకాలంలో ఈ అంతరాయం ఏర్పడినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఈ సాంకేతిక లోపం నేపథ్యంలో అప్రమత్తమైన బ్యాంక్ యాజమాన్యం వెంటనే ప్రభావితమైన సిస్టమ్స్‌ను షట్‌డౌన్ చేసి ఐసోలేట్ (వేరు) చేసింది. ప్రస్తుతం అన్ని ఆర్‌టీజీఎస్ సేవలు పూర్తిగా పునరుద్ధరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ సాంకేతిక సమస్య కారణంగా వినియోగదారులకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని, డిపాజిటర్ల నిధులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని బ్యాంకు స్పష్టమైన హామీ ఇచ్చింది. లావాదేవీలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినప్పటికీ కస్టమర్ల ఖాతాలపై లేదా వారి ఆర్థిక ప్రయోజనాలపై దీని ఎలాంటి ప్రభావం పడలేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ లోపానికి గల అసలు కారణాలను శోధించడానికి బ్యాంక్ నిపుణుల బృందం బాహ్య నిపుణులతో కలిసి దర్యాప్తు చేపట్టింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సహా సంబంధిత నియంత్రణ సంస్థలకు ఈ ఘటనపై సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు బ్యాంక్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ సాంకేతిక నిఘా ఏర్పాటు చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఆర్‌టీజీఎస్ ఎందుకు?
ఆర్‌టీజీఎస్(Real Time Gross Settlement) అనేది పెద్ద మొత్తంలో డబ్బును ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక బ్యాంక్ ఖాతాకు క్షణాల వ్యవధిలో అత్యంత సురక్షితంగా బదిలీ చేయడానికి ఉపయోగించే ఒక డిజిటల్ చెల్లింపు విధానం. దీన్ని భారతదేశంలో ఆర్‌బీఐ నిర్వహిస్తుంది. రియల్‌టైమ్‌లో లావాదేవీలు ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే పూర్తవుతాయి. మనం డబ్బు పంపిన వెంటనే అవతలి వారి ఖాతాలో ఆ మొత్తం జమ అవుతుంది. ప్రతి లావాదేవీని విడివిడిగా (వ్యక్తిగతంగా) క్లియర్ చేస్తారు. ఇతర పద్ధతుల మాదిరిగా లావాదేవీలను సమూహాలుగా (బ్యాచ్‌లు) మార్చి ఆలస్యం చేసే విధానం ఇందులో ఉండదు. ఆర్టీజీఎస్ ద్వారా కనిష్టంగా రూ.2,00,000 నుంచి ఎంత మొత్తమైనా సులభంగా బదిలీ చేయవచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
ఇదీ చదవండి: గాంధీజీ ‘ఐదో కుమారుడు’.. రూ.14 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
Tags : 1