వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
భారత్‌లోకి యాపిల్ పే గ్రాండ్ ఎంట్రీ
Published on Wed, 09/30/2026 - 11:33
భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రతిష్టాత్మక ‘యాపిల్ పే’ సేవలను అధికారికంగా భారతదేశంలో ప్రారంభించింది. దేశంలో ఈ సేవలను అందించేందుకు మొదటి భాగస్వామిగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. ఈ భాగస్వామ్యం ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఆమోదిత వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నేటి నుంచి యాపిల్ పే సేవలను వినియోగించుకోవచ్చు.
యాపిల్ వ్యూహాత్మక అడుగుతో ఐఫోన్ (ఐఫోన్ ఎక్స్‌ఆర్ లేదా ఆపై మోడళ్లు, ఐఓఎస్ 18 ప్లస్), యాపిల్ వాచ్ (సిరీస్ 6 లేదా ఆపై మోడళ్లు, వాచ్‌ఓఎస్ 11+) వినియోగదారులు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసుకునే వెసులుబాటు లభించింది. వినియోగదారులు తమ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ‘యాపిల్ వాలెట్’ యాప్‌లో లేదా యాక్సిస్ బ్యాంక్ యాప్ ద్వారా సులభంగా అనుసంధానించుకోవచ్చు.
భద్రతే ప్రధాన ధ్యేయం..
యాపిల్ పే ద్వారా స్టోర్లలో చెల్లింపులు చేసే సమయంలో ఎలాంటి పిన్ లేదా ఓటీపీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఐఫోన్‌లో ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో ఆథెంటికేషన్ పూర్తి చేసి పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌కు ఫోన్‌ను సమీపంలో ఉంచడం ద్వారా క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతాయి.
భద్రత పరంగా యాపిల్ అత్యాధునిక టోకనైజేషన్ సాంకేతికతను ఉపయోగిస్తోంది(టోకనైజేషన్ అనేది మీ సున్నితమైన వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని, ముఖ్యంగా క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు నెట్‌వర్క్‌లో భద్రంగా ఉంచడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక డిజిటల్ భద్రతా సాంకేతికత). అసలు కార్డ్ నంబర్లు టూల్‌లో గానీ, యాపిల్ సర్వర్లలో గానీ స్టోర్ కావు. ప్రతీ లావాదేవీకి ఎన్‌క్రిప్ట్ చేసిన డివైస్ అకౌంట్ నంబర్ ఉపయోగపడుతుందని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా, యాపిల్ పే ద్వారా చెల్లింపులు చేసినప్పటికీ కార్డుపై లభించే క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు యథావిధిగా వర్తిస్తాయి.
ఏయే ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది?
తొలి విడతలోనే బ్లింకిట్, జొమాటో, క్రోమా, టాటా 1ఎమ్‌జీ, రిలయన్స్ బ్రాండ్స్, కాయోస్, ఇక్సిగో, లీ15, ఇంటర్‌ఫ్లోరాలతో పాటు యాపిల్ అధికారిక స్టోర్లలో యాపిల్ పే సేవలు అందుబాటులోకి వచ్చాయి. జస్‌పే, పేటైమ్, పేయూ, రోజర్‌పే, పైన్ ల్యాబ్స్, క్యాష్‌ఫ్రీ వంటి ప్రధాన పేమెంట్ గేట్‌వేలతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు, మర్చంట్లు ఈ నెట్‌వర్క్‌లో చేరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో విస్తరించిన యాపిల్ పే భారత డిజిటల్ విప్లవంలో సరికొత్త మైలురాయిగా నిలవనుంది.
ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!
Tags : 1