చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్
Breaking News
దూసుకుపోతున్న చీతాలు
Published on Wed, 09/09/2026 - 04:22
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే సత్తా ఉన్న సంస్థల సంఖ్య గత ఐదేళ్లలో రెట్టింపయ్యింది. ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా ’చీతా’ ఇండెక్స్ ప్రకారం 2021లో ఈ సంఖ్య 54గా ఉండగా, 2026లో 110కి చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులకష్టకాలంలోనూ భారత్‌లో సంస్థల వ్యవస్థాపకులు పట్టు వదలకుండా ముందుకెళ్తున్నారని హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహ్మన్ జునైద్ తెలిపారు. ఇందుకు తమ ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్సే నిదర్శనమని చెప్పారు.
రిపోర్ట్ కోసం హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వేల్యుయేషన్‌ని బట్టి అంకురాలను చీతా, గెజెల్, యూనికార్న్ కోహర్ట్స్ అని మూడు సెగ్మెంట్లుగా వర్గీకరిస్తుంది. 2000 సంవత్సరంలో లేదా ఆ తర్వాత ఏర్పాటైన అన్‌లిస్టెడ్ అంకురాలను ఈ చీతా ఇండెక్స్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. వేల్యుయేషన్ 200 మిలియన్ డాలర్ల నుంచి 500 మి.డాలర్లుగా ఉండి, వచ్చే ఐదేళ్లలో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ) హోదా దక్కించుకోగలవని భావించే సంస్థలకు ఇందులో చోటు దక్కుతుంది. వచ్చే మూడేళ్లలో యూనికార్న్‌కాగల వాటిని గెజెల్ కేటగిరీ కింద, 1 బిలియన్ డాలర్లు వేల్యుయేషన్‌ని ఇప్పటికే దక్కించుకున్న ప్రైవేట్ అంకురాలను యూనికార్న్ కోహర్ట్‌లుగా వ్యవహరిస్తారు. 2021లో ఆరంభమైన సూచీ ఏటా 15 శాతం వృద్ధితో ఐదేళ్లలో 104 శాతం పెరిగింది.
⇒ 2026 చీతా ఇండెక్స్‌లో మూడో వంతు సంస్థలు ఈసారి చోటు దక్కించుకున్నవే. ఏకంగా 43 అంకురాలు కొత్తగా లిస్టులోకి వచ్చాయి.
⇒ క్లీన్ మొబిలిటీ (బ్లూ ఎనర్జీ మోటార్స్, మ్యాటర్, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ, రివర్ మొబిలిటీ), ఏరోస్పేస్..డిఫెన్స్ (సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్, ధృవ స్పేస్, దిగంతర), ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (సింప్లీస్మార్ట్ రాకెట్, క్యూపైఏఐ, ఫ్లామ్, ఫ్రీహ్యాండ్), సర్వి సెస్ (స్నాబిట్, ప్రోంటో, ఆల్‌హోమ్) తదితర రంగాల నుంచి అత్యధికంగా కొత్త సంస్థలు ఉన్నాయి.
⇒ 2023లో ఏరోస్పెస్, డిఫెన్స్ నుంచి ఒకే ఒక్క చీతా ఉండగా, 2026లో ఇది 5కి పెరిగింది. ఈవీల విభాగంలో 4 నుంచి 8కి, క్లీన్‌టెక్‌లో 3 నుంచి 5కి పెరిగాయి.
⇒ ఫిన్‌టెక్ రంగంలో అత్యధికంగా 17 చీతాలు ఉన్నాయి. సాస్ (16), ఈ–కామర్స్ (12 సంస్థలు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, హెల్త్‌టెక్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలు 8 చొప్పున నాలుగో స్థానంలో ఉన్నాయి. ఫుడ్ అండ్ బెవరెజెస్, కన్జూమర్ గూడ్స్ రంగాల్లో ఏడు చొప్పున ఉన్నాయి.
⇒ బెంగళూరులో అత్యధికంగా 36, ఎన్‌సీఆర్‌లో 25, ముంబైలో 16 చీతాలు ఉన్నాయి.
⇒ ఏడాది వ్యవధిలో 43 కొత్త చీతాలు రాగా, 10 అంకురాలు గెజెల్ స్థాయికి, 3 నేరుగా యూనికార్న్‌ల స్థాయికి చేరాయి. 6 సంస్థలు మార్కెట్లో లిస్టయ్యాయి.
⇒ యాక్సెల్, పీక్ ఫిఫ్టీన్ పార్ట్‌నర్స్ అత్యధికంగా చెరో 18 చీతాల్లో ఇన్వెస్ట్ చేశాయి. బ్లూమ్ వెంచర్స్ (10), ఎలివేషన్ క్యాపిటల్ (9) ఆ తర్వాత ఉన్నాయి. టాప్ 10 సంస్థాగత ఇన్వెస్టర్లలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఒక్కటే ఫ్యామి లీ ఆఫీస్‌గా 7 చీతాల్లో ఇన్వెస్ట్ చేసింది. టాప్ 10లో ఫ్యామిలీ ఆఫీస్ చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం
⇒ కోహర్ట్‌కు సంబంధించి ఏంజెల్ ఇన్వెస్టరుగా ఆనంద్ చంద్రశేఖర్ అత్యధికంగా 11 స్టార్టప్‌లలో, కునాల్ షా 8, రమాకాంత్ శర్మ ఏడింటిలో ఇన్వెస్ట్ చేశారు.
⇒ జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తన హెల్త్‌కేర్ స్టార్టప్ టెంపుల్‌తో చీతా లిస్టులోకి మళ్లీ ఎంటరయ్యారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రాప్‌టెక్ వెంచర్ ’ఆల్‌హోమ్’ ద్వారా ఫార్మ్‌ఈజీ సహ వ్యవస్థాపకులు సిద్ధార్థ్ షా, ధవళ్ షా, ధర్మిల్ సేఠ్, హార్థిక్ దేఢియా కూడా ఈ జాబితాలోకి వచ్చారు.
⇒ పది చీతాలు గెజెల్ స్థాయికి ప్రమోట్ అయ్యాయి. సీఖో, అగ్నికుల్, దేహాత్, జివ, ప్రాక్టో, ఆటంబర్గ్ టెక్నాలజీ, కుకుఎఫ్‌ఎం, మికో, ఖాతాబుక్, మొజాయిక్ వెల్‌నెస్ వీటిలో ఉన్నాయి. ఇక 3 చీతాలు నేరుగా యూనికార్న్‌లుగా ఆవిర్భవించాయి. స్కైరూట్ ఏరోస్పేస్, స్క్వేర్ యార్డ్స్, ఆస్ట్రోటాక్ ఇందులో ఉన్నాయి.
⇒ యూనికార్న్‌లయ్యే సామర్థ్యాలున్న ఆరు సంస్థలు 2026లో మార్కెట్లలో లిస్టయ్యాయి. అయ్ ఫైనాన్స్, వేక్‌ఫిట్, సెడెమాక్, కిష్త్, క్యాపిలరీ టెక్నాలజీస్, పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
Tags : 1