Breaking News

దుల్కర్‌ సల్మాన్‌ ‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ

Published on Fri, 09/04/2026 - 17:43

టైటిల్‌ : ఐమ్‌ గేమ్‌
నటీనటులు:దుల్కర్‌ సల్మాన్‌, ఖయాదు లోహర్‌, మిస్కిన్‌, ఆంటోనీ వర్గీస్‌, సంయుక్త విశ్వనాథన్‌, వినయ్‌ ఫోర్ట్‌, కథిర్‌ తదితరులు
నిర్మాతలు: దుల్కర్‌సల్మాన్‌, జోమ్‌ వర్గీస్‌
దర్శకత్వం: నహాస్‌ హిదయత్‌
సంగీతం: జేక్స్‌ బిజోయ్‌
సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 3, 2026

దుల్కర్‌ సల్మాన్‌ పేరుకు మలయాళ నటుడే అయినా..తెలుగు వాళ్లకు బాగా దగ్గరైనవాడు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ రిలీజ్‌ అవుతుంటాయి. అలా ఈ వారం(సెప్టెంబర్‌ 3) తెలుగు ప్రేక్షకులను పలకరించిన చిత్రం ‘ఐమ్‌ గేమ్‌’.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్‌ చేయకపోయినా.. సినిమాపై మాత్రం హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
డ్యాన్‌(దుల్కర్‌ సల్మాన్‌) ఓ రిచ్‌ కిడ్‌. చదువు పూర్తి చేసి తండ్రి కోరిక మేరకు బిజినెస్‌ రంగంలోకి వెళ్తాడు. అయితే ఆయన పని కంటే గ్యాంబ్లింగ్‌పైనే ఎక్కువ దృష్టిపెడతాడు. లక్షల రూపాయలు అప్పుతెచ్చి జూదం ఆడుతాడు. డబ్బులన్నీ పోగొట్టుకొని.. చివరకు అప్పు ఇచ్చినవాడి చేతిలో తన్నులు తింటాడు. కొడుకు పరిస్థితి చూసి తల్లి మెర్సీ(జయసుధ)దాచుకున్న రూ. 60 లక్షలు ఇస్తే..వాటిని కూడా క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకుంటాడు. 

బెట్టింగ్‌ నిర్వాహకులతో గొడవకు దిగి..కారులో పారిపోతుండగా ప్రమాదం జరిగి కుడి చేతిని కోల్పోతాడు. దీంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి..వేరొకరి చేయిని డ్యాన్‌కి అతికిస్తారు. ఈ క్రమంలోనే ఫిజియోథెరపిస్ట్‌ ఇషా (కయాదు లోహర్‌)తో పరిచయం.. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. ఇలా అంతా బాగుందనుకునేలోపు డ్యాన్‌ కుడి చేయి.. అతని నియంత్రణలో లేకుండా పోతుంది. అతను చెప్పని,ఇష్టంలేని పనులన్నీ కుడి చేయి చేస్తుంది.అలా ఓ రోజు పబ్‌లో మద్యం సేవిస్తుండగా.. అక్కడకు వచ్చిన బెట్టింగ్‌ డాన్‌ డేవిడ్‌ (మిస్కిన్‌)ని చంపేందుకు ప్రయత్నించగా..డ్యాన్‌ బలవంతంగా అడ్డుకుంటాడు. అసలు డ్యాన్‌ కుడి చేయి ఎవరిది? ఎందుకు అలా ప్రవర్తిసుంది? డేవిడ్‌కు ఎందుకు చంపాలనుకుంది? అసలు ఆ చేతికి అంత శక్తి ఎలా వచ్చింది? క్రికెట్‌ విక్రమ్‌ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతనితో డ్యాన​్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
చేతికి వేరే ప్రాణం రావడం అనే కాన్సెప్ట్‌ కొత్తదేమి కాదు.  ‘మావీరన్’, ‘సవ్యసాచి’ లాంటి చిత్రాలు ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ఐమ్‌ గేమ్‌ కథ కూడా అలాంటిదే. కానీ ఆ కథను తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు బాగుంది. అయితే అసలు కథ ప్రారంభం అంటే హీరోకి ఆపరేషన్‌ చేసి చేతిని అతికించే వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. అలాగే ద్వితియార్థం మొత్తం ఊహకందేలా సాగడం కూడా మైనస్‌. డ్యాన్‌ లైఫ్‌ స్టైల్‌ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. జూదానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడం.. అప్పు ఇచ్చినవాడు దాడి చేయడం.. బెట్టింగ్‌ ఇలా మొదటి అరగంట అంతా రొటీన్‌గానే సాగుతుంది. 

ఎప్పుడైతే ప్రమాదం జరిగి డ్యాన్‌కి చేతిని అతికిస్తారో అప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆ చేయి తన నియంత్రణను కోల్పోయిన తర్వాత మరింత కామెడీ చేసే స్కోప్‌ ఉన్నా దర్శకుడు దాన్ని పైపైనే చూపించాడు. అలాగే లవ్‌స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. కానీ డేవిడ్‌పై దాడి చేసినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుటుంది. 

అయితే సెకండాఫ్‌పై మరింత ఆసక్తికరంగా ఉంటుందనుకుంటే.. కాసేపటికే నీరసం వచ్చేలా నెమ్మదిగా సాగుతుంది. హీరోకి చేతిని దానం చేసిన వ్యక్తి గురించి తెలియగానే.. ప్లాష్‌బ్యాక్‌లో ఏం జరిగింది? క్లైమాక్స్‌ ఎలా ఉంటుంది? అనేది ఈజీగా ఊహించొచ్చు.  విక్కీ పాత్ర చుట్టూ సాగే ఫ్లాష్‌బ్యాక్ చాలా సాగదీసినట్లు, రొటీన్‌గా అనిపిస్తుంది. డేవిడ్‌ పాత్రను అటు భయంకరంగా చూపించలేదు.. ఇటు పూర్తి వినోదాత్మకంగానూ అలరించలేదు. బెట్టింగ్‌ వల్ల జరిగే అనర్థాల గురించి ఇచ్చిన సందేశం కూడా ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే సినిమా నిడివి(177 నిమిషాలు) కూడా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే.. 
డ్యాన్‌ పాత్రకి  దుల్కర్‌ సల్మాన్‌ పూర్తి న్యాయం చేశాడు. సినిమా ప్రారంభంలో గ్యాంబ్లర్‌గా, ఆ తర్వాత తన చేతిని తనే కంట్రోల్ చేసుకోలేని నిస్సహాయుడిగా రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఒక చేతితోనే చేసే యాక్షన్‌ సీన్లు బాగా అలరిస్తాయి. ఇక కయాదు పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. విక్కీ పాత్రలో ఆంటోనీ చక్కగా నటించాడు. మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జేక్స్‌ బిజోయ్‌ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం.తనదైన బీజీఎంతో చాలా సన్నివేశాలను ఎలివేట్‌ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. కొన్ని సాగదీత సీన్లను కట్‌ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)