కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి
Breaking News
HDFC బ్యాంక్‌కు కొత్త బాస్.. సీఈఓ జగదీశన్ కీలక నిర్ణయం!
Published on Sun, 08/30/2026 - 04:35
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ ఎండీ, సీఈఓ అయిన శశిధర్ జగదీషన్ తన పదవీకాలాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన అక్టోబర్ 26న రిటైర్ కానున్నారు. కొత్త సీఈఓను ఎంపిక చేసే ప్రక్రియను బ్యాంక్ వేగవంతం చేసింది.
శశిధర్ జగదీశన్‌ను కొనసాగించేందుకు బ్యాంక్ బోర్డు ప్రయత్నించినప్పటికీ.. ఆయన మాత్రం రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోలేదని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్ అభివృద్ధి, స్థిరత్వానికి ఆయన అందించిన సేవలను బోర్డు ప్రశంసించింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
జగదీశన్ 2020 అక్టోబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరు సంవత్సరాల పదవీకాలంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనంతో దేశంలోని అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూపుల్లో ఒకటి ఏర్పడటాన్ని ఆయన పర్యవేక్షించారు. అంతకుముందు రెండు దశాబ్దాలకు పైగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసిన జగదీశన్.. సీఎఫ్ఓగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఇక ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు సంబంధించిన ఎంఎస్ఆర్డీసీ కేసులో జగదీశన్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. అయితే ఆయన రిటైర్మెంట్ నిర్ణయానికి ఈ ఇదే కారణమా అనే విషయాన్ని.. బ్యాంక్ వెల్లడించలేదు. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివిన జగదీశన్.. చార్టర్డ్ అకౌంటెంట్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ నుంచి ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేశారు. బ్యాంకింగ్ రంగంతో పాటు వంట చేయడం, కర్ణాటక సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, సైక్లింగ్ చేయడం ఆయనకు ఇష్టమైన విషయాలు.
Tags : 1