రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
Breaking News
కోట్లాది మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Published on Mon, 07/06/2026 - 19:47
దేశంలోని సుమారు 8 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిల్వలపై 8.25 శాతం వడ్డీ రేటును అధికారికంగా ఖరారు చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని తక్షణమే చందాదారుల ఖాతాల్లోకి జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ఈపీఎఫ్ పథకం-1952లోని పేరా 60(1) ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని ప్రతి సభ్యుని ఖాతాలో జమ చేయడానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అనుమతి లభించిందని ఈపీఎఫ్ఓ తన తాజా సర్క్యులర్లో స్పష్టం చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి లభించిన నేపథ్యంలో సభ్యుల ఖాతాల్లోకి సకాలంలో వడ్డీని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత విభాగాలన్నీ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాం’ అని ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో పేర్కొన్నారు.
ఈసారి ఆలస్యం లేదు.. సరికొత్త సాఫ్ట్వేర్!
గతంలో వడ్డీ డబ్బులు ఖాతాల్లో పడటానికి కనీసం ఒకటి రెండు నెలల సమయం పట్టేది. సాంకేతిక లోపాలు, అస్తవ్యస్తమైన ప్రక్రియల వల్ల చందాదారులు ఇబ్బందులు పడేవారు. అయితే, ఈసారి ఉద్యోగులకు ఆ తిప్పలు తప్పనున్నాయి. గత వారమే ఈపీఎఫ్ఓ తన ప్రధాన డేటాబేస్ కన్సాలిడేషన్తో పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. దీనివల్ల ఈసారి వడ్డీ క్రెడిట్ ప్రక్రియ వేగంగా, అవాంతరాలు లేకుండా సాగనుంది. కేవలం కొద్ది రోజుల్లోనే లబ్ధిదారులందరి ఖాతాల్లోనూ వడ్డీ సొమ్ము నేరుగా జమ కానుంది.
వరుసగా మూడో ఏడాది అదే జోరు
ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ 8.25% వడ్డీ రేటును ప్రతిపాదించింది. అనంతరం జూన్ నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈపీఎఫ్ఓ వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతం గరిష్ట వడ్డీ రేటును కొనసాగించడం గమనార్హం. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ నిధికి భద్రతతో పాటు ఉత్తమ రాబడిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు
Tags : 1