TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
Breaking News
‘ట్రెంట్’లో ముగింపునకు నోయల్ టాటా శకం
Published on Thu, 06/25/2026 - 12:24
న్యూఢిల్లీ: రిటైల్ సంస్థ ‘ట్రెంట్’ ప్రస్థానంలో నోయల్ టాటా శకం ముగింపునకు చేరింది. ఈ ఏడాది నవంబర్‌లో ఆయనకు 70 ఏళ్లు నిండుతాయి. దీంతో ట్రెంట్ చైర్మన్‌గా తప్పుకోనున్నారు. కంపెనీ చైర్మన్‌గా 74వ ఏజీఎం (వాటాదారుల సమావేశం) తనకు చివరిదంటూ ప్రకటించారు. బెంగళూరులో ఒక స్టోర్‌తో మొదలు పెట్టగా, నేడు దేశవ్యాప్తంగా 1200పైగా స్టోర్లతో దిగ్గజ రిటైల్ సంస్థల్లో ఒక్కటిగా ట్రెంట్ ఎదగడంలో ప్రధాన పాత్ర అంతా నోయల్ టాటాదేనని చెప్పుకోవాలి.
ట్రెంట్ కింద జూడియో, వెస్ట్‌సైడ్, స్టార్ బజార్ తదితర గొలుసు దుకాణ సంస్థలు నడుస్తున్నాయి. కంపెనీ ఏజీఎంలో భాగంగా వాటాదారులను ఉద్దేశించి నోయల్ టాటా ప్రసంగించారు. వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. దీర్ఘకాలంలో విలువ సృష్టించడంలోనూ.. స్పష్టమైన దృష్టితో, బలమైన, చెక్కుచెదని రిటైల్ ప్లాట్‌ఫామ్‌గా ట్రెంట్ అవతరించినట్టు చెప్పారు.
2014లో బాధ్యతలు..
తన తల్లి సిమోన్ టాటా ఏర్పాటు చేసిన ట్రెంట్‌లో 2010 ఆగస్ట్ 19న బోర్డు సభ్యుడిగా నోయల్ టాటా చేరారు. లాక్మే వ్యాపారాన్ని హిందుస్థాన్ యూనిలీవర్‌కు విక్రయించిన అనంతరం సిమోన్ టాటా ట్రెంట్‌ను ఏర్పాటు చేశారు. 1998 బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్‌లో వెస్ట్‌సైడ్ స్టోర్‌తో ఇది అవతరించింది. ఎఫ్‌కే కవరణ రిటైర్మెంట్తో 2014 మార్చి 31న సంస్థ చైర్మన్ బాధ్యతలు నోయల్ టాటా చేతికి వెళ్లాయి.
నేడు 321 పట్టణాల్లో 1,286 స్టోర్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.20,074 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని, రూ.1,721 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సంస్థ ఇంకా ఆరంభ దశలోనే ఉందంటూ, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాల పట్ల నమ్మకాన్ని నోయల్ టాటా వ్యక్తం చేశారు. భారత్‌లోనే కాకుండా, విదేశాల్లోనూ తమ బ్రాండ్ల విక్రయాలకు చక్కని అవకాశాలున్నట్టు చెప్పారు. తద్వారా అంతర్జాతీయంగానూ విస్తరించనున్నట్టు ఆయన సందేశమిచ్చారు.
Tags : 1