9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతులపై పన్ను తగ్గింపు
Published on Sun, 05/31/2026 - 09:15
న్యూఢిల్లీ: ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ గెయిన్స్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మార్పులు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజా సవరణలు అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్‌పై విండ్‌ఫాల్ గెయిన్స్ పన్నును లీటరుకు రూ.3 నుంచి రూ.1.50కు తగ్గించారు. డీజిల్‌పై ఈ పన్నును లీటరుకు రూ.16.50 నుంచి రూ.13.50కు సవరించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ.16 నుంచి రూ.9.50కు తగ్గించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
దేశీయ వినియోగదారులపై ప్రభావం లేదు
దేశీయ మార్కెట్‌లో వినియోగానికి విడుదల చేసే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దేశీయ వినియోగదారులపై ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం లేదని భావిస్తున్నారు.
ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ల సగటు అంతర్జాతీయ ధరలను ఆధారంగా చేసుకుని విండ్‌ఫాల్ పన్ను రేట్లను నిర్ణయిస్తారు. ఈ రేట్లను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి సవరిస్తుంటారు. చివరిసారిగా 2026 మే 16న రేట్లలో మార్పులు అమలులోకి వచ్చాయి.
ముడి చమురు ధరలపై భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం
అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న తర్వాత ప్రపంచ ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాల భయాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో ముడి చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతోంది.
విండ్‌ఫాల్ ట్యాక్స్ ఉద్దేశం ఇదే..
అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు దేశీయ ధరల కంటే అధికంగా ఉన్న సమయంలో ఎగుమతిదారులు పొందే అదనపు లాభాలను నియంత్రించేందుకు విండ్‌ఫాల్ ట్యాక్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. మార్కెట్‌లో అసాధారణ పరిస్థితుల కారణంగా ఏర్పడే అనూహ్య లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ ఆదాయంగా మళ్లించడం ఈ పన్ను ప్రధాన ఉద్దేశం.
Tags : 1