ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
భర్త కంటే భార్య వయసులో పెద్దదయితే..?
Published on Thu, 04/30/2026 - 08:19
మా అబ్బాయికి ముప్పై ఏళ్లు. పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. నా దూరపు బంధువుల సంబంధం ఒకటి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి చాలా మంచిది. చూడడానికి కూడా బాగుంటుంది. సమస్య ఏమిటంటే... మా అబ్బాయి కంటే ఆ అమ్మాయి ఒక ఏడాది పెద్దది. వయసులో పెద్దగా ఉన్న అమ్మాయిని చేసుకుంటే అనేక రకాల సమస్యలు వస్తాయని మా వాడు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. పెళ్లికి అబ్బాయి కంటే అమ్మాయి పెద్దదిగా ఉంటే సమస్యలు వస్తాయా?
– సుబ్బలక్ష్మి, చెన్నై
సాధారణంగా మన సమాజంలో భార్య కంటే భర్త వయసులో పెద్దవాడై ఉండాలనే ఒక అలిఖిత నియమం ఉంది. భర్త వయసులో పెద్దవాడైతే, భార్యపై సహజంగానే ఒక రకమైన అధికారం లేదా నియంత్రణ ఉంటుందని, ఆమె తన మాట వింటుందని పురాతన సామాజిక వ్యవస్థ నిర్దేశించింది. భార్య పెద్దదైతే భర్తకు ఆయుఃక్షీణత జరుగుతుందనేది కూడా అపోహే! గతంలో పురుషులు మాత్రమే సం΄ాదించేవారు. ఒక అబ్బాయి చదువు పూర్తిచేసుకుని, వృత్తిలో స్థిరపడి, కుటుంబాన్నిపోషించే స్థాయికి రావడానికి కొంత సమయం పట్టేది. ఆ లోçపు అమ్మాయికి యుక్తవయసు వచ్చేది. ఆర్థికంగా స్థిరపడిన పురుషుడికి, వయసులో చిన్నదైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల కుటుంబానికి భద్రత ఉంటుందని భావించేవారు. పురుషుడు తన వృద్ధాప్యంలో లేదా అనారోగ్య సమయంలో తనను కనిపెట్టుకుని చూసుకోవడానికి భార్య భర్త కంటే వయసులో చిన్నదైతే, ఆమె శారీరకంగా దృఢంగా ఉండి, భర్తకు సేవలు చేయగలదని భావించేవారు.
ప్రస్తుత కాలంలో క్లాస్మేట్స్ గా ఉండి వివాహం చేసుకున్న జంటల్లో భర్త ఇంకా యంగ్‌గానే కనబడుతున్నా.. భార్యమాత్రం ఏజ్డ్గా కనిపించడం గమనిస్తూనే ఉంటాం. కానీౖ వెద్యశాస్త్రపరంగా చూసినా లేదా మానసిక శాస్త్రపరంగా విశ్లేషించినా, వయసు తేడా అనేది వివాహ బంధంలో ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. మానసిక విశ్లేషణ ప్రకారం, స్త్రీలు పురుషుల కంటే త్వరగా మానసిక పరిణతిని సాధిస్తారు. మీ కోడలు మీ అబ్బాయి కంటే ఆరునెలలు పెద్దదవ్వడం వల్ల, ఆమె కుటుంబ బాధ్యతలను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించ గలదు.
అయితే పెళ్లి అనేది జీవితాంతం కలిసి నడవాల్సిన ప్రయాణం కాబట్టి, కేవలం ‘చిన్నప్పటి నుంచి అనుకున్నాం’ అని కాకుండా, వారిద్దరి మధ్య పరస్పర అవగాహన కుదిరేలా చూడండి. అంటే... సంవత్సరం తేడాని సమస్య గా చూడకండి, అలాగని అబ్బాయి ఇష్టాన్ని నిర్లక్ష్యం చేయకండి. వయసులో తేడాలు కొంచెం అటూ ఇటూ అయినా మనసులో తేడాలు లేకుండా పరస్పర అవగాహన, సహకారం, ప్రేమ, నమ్మకం సరిగా ఉండటమే దాంపత్య జీవితానికి ముఖ్యం. ఇద్దరికీ ఒకసారి కౌన్సెలింగ్ ఇప్పించండి.

డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్,
విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Tags : 1