నీ గుండెల్లో దమ్ముంటే ఎదురుగా రా.. చూసుకుందాం...
Breaking News
పిల్లలు ఆడాలి... పడకూడదు
Published on Fri, 04/24/2026 - 04:19
తల్లిదండ్రుల నిర్లక్ష్యం... పిల్లలకు ప్రమాదకరం
వేసవి సెలవులంటే... పిల్లలకు తోకలొస్తాయి... రెక్కలొస్తాయి.
వారికి ఎలాగోలా ఎగిరే మాయాకంబళి కూడా దొరుకుతుంది. ఎగరాలనుకుంటారు... దూకాలనుకుంటారు... అది వారి వయసు. వారిని కనిపెట్టుకొని ఉండటం పెద్దల అనుభవం. వేసవి సెలవుల్లో దేశవ్యాప్తంగా ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. 2025లో ఒక్క చెన్నైలోనే 55 మంది పిల్లలు మేడ మీద నుంచి కింద పడి హాస్పిటల్స్‌లో చేరారు. ఈ వేసవి వారికి మంచి జ్ఞాపకంగా మిగలాలంటే ఏం చేయాలో చూద్దాం...
‘పిల్లాడు హాల్లో ఆడుకుంటున్నాడు కదా, నేను వంట చేసుకుంటూ రీల్స్ చూస్తా’– ఈ ఒక్క మాట చాలు పిల్లలు ప్రమాదంలో పడటానికి. ఒక్క నిమిషంలో ఏం జరుగుతుంది?
పిల్లాడు స్టూల్ లాక్కెళ్లడానికి 10 సెకన్లు... గ్రిల్ ఎక్కడానికి 5 సెకన్లు... పడిపోవడానికి 2 సెకన్లు. మీ రీల్ అయిపోయే లోపు వాడి రియల్ లైఫ్ మారిపోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతి వేసవి సెలవుల్లో ఇలాగే జరుగుతోంది. తమిళనాడు డేటా ప్రకారం ప్రమాదాల బారిన పడుతున్న పిల్లల్లో ఏటా 9.1 శాతం పిల్లలు ప్రమాదవశాత్తు ‘పడిపోవడం’ వల్ల గాయాల పాలవుతున్నారు. వీరిలో పదేళ్లలోపు పిల్లలే ఎక్కువ. దాంతో శాశ్వత వైకల్యం కేసులూ పెరుగుతున్నాయి.
చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, ఎగ్మూర్’ లెక్కల ప్రకారం ఒక్క 2025లోనే 55 మంది పిల్లలు ‘బాల్కనీ, కిటికీ, మెట్ల మీద నుంచి పడి’ చికిత్స కోసం వచ్చారు. ఇక చెన్నైలోని కంచి కామకోటి చిల్డ్రన్స్ ట్రస్ట్ హాస్పిటల్‌కి గత పదేళ్లుగా ఇలా వస్తున్న పిల్లల కేసులు కామన్ అయ్యాయి. తలకు దెబ్బ, ఎముకలు విరగడం, ఐ.సి.యు.లో వారాల తరబడి ఉండాల్సి రావడం.... కొందరు దేవుడి దయవల్ల బతికారు, కొందరు శాశ్వత వైకల్యంతో మిగిలారు. బాధాకరం ఏంటంటే– ఈ యాక్సిడెంట్స్ ఇంట్లోనే, పేరెంట్స్ కళ్లముందే జరుగుతున్నాయి.
వేసవిలోనే ఎందుకు ప్రమాదం ఎక్కువ?
∙స్కూల్ లేదు కాబట్టి పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉంటారు. బాల్కనీ, కిటికీ, మెట్లు– ఇవే వాళ్లకు ప్లే గ్రౌండ్ అవుతాయి. ∙తలుపులు, కిటికీలు తెరిచే ఉంటాయి. వేసవి వేడికి వెంటిలేషన్ కోసం అన్ని తలుపులు తీస్తాం. బాల్కనీ డోర్ కూడా. పిల్లలకు ‘బయట ప్రపంచం’ ఈజీ యాక్సెస్ అయిపోతుంది. ∙ఫోన్ పేరెంటింగ్. ఇదే అసలు విలన్. పిల్లాడు హాల్లో ఆడుకుంటున్నాడు కదా అని బెడ్రూమ్లో రీల్స్ చూస్తుంటాం. వంటింట్లో సీరియల్ పెట్టుకుంటాం. 30 సెకన్ల చూపు తిప్పితే చాలు – పిల్లాడు స్టూల్ లాక్కెళ్లి బాల్కనీ గ్రిల్ ఎక్కేస్తాడు.
ప్రమాదాలకు ఇవీ హేతువులు...
1. పొట్టి గోడలు: బాల్కనీ, టెర్రస్ గోడలు 3 అడుగుల కంటే తక్కువ ఉంటే ప్రమాదం. పిల్లాడు వంగి చూస్తూ బ్యాలెన్స్ తప్పుతాడు.
2. వెడల్పు గ్రిల్స్: బాల్కనీ గ్రిల్స్ మధ్య గ్యాప్ 4 అంగుళాలు దాటితే పిల్లల తల దూరిపోతుంది. 5–7 అంగుళాల గ్యాప్ అత్యంత డేంజర్. బాల్కనీ దగ్గర స్టూల్, కుర్చీ, పూల కుండీలు ఉంటే పిల్లలు అవి ఎక్కి గ్రిల్ దాటేస్తారు.
3. ఓపెన్ మెట్లు, స్టెయిర్‌కేస్: గ్రిల్ లేని మెట్లు, తలుపు లేని టెర్రస్ మెట్లు... ఇవి ప్రమాదం. ‘మాది ఫస్ట్ ఫ్లోరే కదా, ఏమవుతుంది?’ అని కొందరు అనుకుంటారు. నేషనల్ ట్రామా స్టడీస్ ప్రకారం పిల్లల్లో 3–4 అడుగుల నుంచి పడినా బ్రెయిన్ ఇంజురీ, వెన్నెముక దెబ్బ, లైఫ్‌లాంగ్ డిసేబిలిటీ రావచ్చు.
ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
సేఫ్టీ నెట్ మ్యాండేటరీ: బాల్కనీ, కిటికీలకు పూర్తిగా సేఫ్టీ నెట్/గ్రిల్ వేయించండి. స్టూల్స్, డబ్బాలు, పూల కుండీలు అన్నీ గ్రిల్స్‌కి, కిటికీలకు 3 అడుగుల దూరంలో పెట్టండి. బాల్కనీ, టెర్రస్ తలుపులు ఎప్పుడూ తాళం వేసి ఉంచండి. పిల్లలకు అందకుండా పైన గడియ పెట్టండి. మెట్లకు పైన, కింద బేబీ గేట్ పెట్టండి. లూజ్ గ్రిల్స్ రిపేర్ చేయించండి. బాల్కనీలో, టెర్రస్ మీద, మెట్ల దగ్గర పిల్లల్ని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలొద్దు. అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నవారు సేఫ్టీ ఆడిట్ చేయించాలి. అన్ని బ్లాక్స్‌లో విరిగిన గ్రిల్స్, ఊడిన రెయిలింగ్స్, తాళం లేని టెర్రస్ డోర్స్ చెక్ చేయాలి. అన్ని బిల్డింగ్స్‌లో పారాపెట్ గోడలు నేల నుంచి కనీసం 1 మీటర్ ఎత్తు ఉండేలా రూల్ తెస్తే బాగుంటుంది. రోజులో 2 గంటలు ఫోన్ పక్కన పడేసి పిల్లలతోనే గడపండి. మీ చూపు మీదే వాళ్ల భద్రత ఆధారపడి ఉంది.
పిల్లల్ని బిజీగా ఉంచే సేఫ్ ఐడియా
బెడ్‌షీట్‌తో గదిలో టెంట్ వేయండి. సరదాగా ఆడుకుంటారు. బాత్రూమ్లో పెద్ద టబ్‌లో నీళ్లు పోసి మీ పర్యవేక్షణలో ఆడించండి. పేపర్, కలర్స్, క్లే ఇవ్వండి. రోజూ ఒక గంట మీరే కథ చెప్పండి. కిందకు వెళ్లి ఆడుకునే వీలుంటే అక్కడకు పంపండి. ఇక సైకిళ్లు, అనుమతి లేకుండా బండ్లు తీసుకొని రోడ్డు మీదకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మీదే. నీళ్లున్న చోటుకు చెరువు, స్విమింగ్ పూల్ వీటి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి.
Tags : 1