లోకేష్ నిద్రపోడు, నీ మేనత్తలు ఎక్కడున్నారో తెలుసా!
బన్నీ పారితోషికం.. రూపాయిలో 30 పైసలు మాత్రమే!
Published on Mon, 04/20/2026 - 15:17
అల్లు అర్జున్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఆ ఇమేజ్‌ని దాటి సొంతంగా తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్నాడు. కలెక్షన్స్ పరంగా చూస్తే.. బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ 1 హీరో అని చెప్పొచ్చు. బన్నీ నటించిన గత మూడు సినిమాలు(అల వైకుంఠపురుములో, పుష్ప, పుష్ప 2) కలిపి రూ. 2,361 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.
ఇదంతా గత ఐదేళ్లలోనే జరిగింది. భారీ కలెక్షన్స్ మాత్రమే కాదు..జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరో కూడా బన్నీనే. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం(Allu Arjun Remuneration) అందుకుంటున్న నటుల్లో ఆయన ఒకరు. అయితే అందరి హీరోల్లా అల్లు అర్జున్(Allu Arjun) ఒక ఫిక్స్డ్ అమౌంట్‌కి సినిమా ఒప్పుకోడు అట. ఒక నిర్మాత కొడుకుగా తనతో సినిమా చేసే నిర్మాతలపై భారం పడకుండా పారితోషికం తీసుకుంటాడట. అలా అని తక్కువేం తీసుకోడు. ఇంకా చెప్పాలంటే..తోటి హీరోల కంటే కాస్త ఎక్కువే తీసుకుంటాడు. దాని కోసం అల్లు అర్జున్ ఓ స్పెషల్ రూట్ ఎంచుకున్నాడు.
లాభాల్లో వాటా..
అర్జున్ పారితోషికం తీసుకునే విధానం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత, కాలమిస్ట్ జి. ధనంజయన్ ఇలా వెల్లడించారు. ‘అల్లు అర్జున్ సినిమాకు ఇంత అని పారితోషికం తీసుకోరు. లాభాల్లో వాటాను మాత్రమే అడుగుతాడు. రూపాయిలో కేవలం 30 పైసలు ఆయన పారితోషికం కింద తీసుకుంటారు. ఊదహారణకు ఆయన నటించిన ఒక్క సినిమా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తే.. ఆయన పారితోషికంగా రూ. 300 కోట్లు తీసుకుంటారు. మరో సినిమా రూ. 500 కోట్లు వసూలు చేస్తే..కేవలం రూ. 150 కోట్లు మాత్రమే తీసుకుంటారు. ఆయన పారితోషికం గురించి అస్సలు మాట్లాడరు. మంచి సినిమా చేయాలనే ప్రయత్నిస్తాడు’ అని ధనంజయన్ చెప్పుకొచ్చాడు.
నిర్మాతకు భారం తగ్గుతుంది..
బన్నీ ఫాలో అవుతున్న విధానం వల్ల బడ్జెట్ తగ్గడమే కాదు.. నిర్మాత ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక సినిమాను రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలనుకుంటే.. లాభాల పంపిణీ విధానం వల్ల అందులో రూ. 25 కోట్లను తగ్గించొచ్చు. అలా చేయడం వల్ల నిర్మాత తీసుకోవలసిన రుణం తగ్గుతుంది, దాని ఫలితంగా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. ఇది సినిమా త్వరగా బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరుకుని, ఆపై లాభాలను ఆర్జించడానికి సహాయపడుతుంది’ అని ధనంజయన్ అన్నారు.
పుష్ప 2కి ఎంత తీసుకున్నాడు?
ధనంజయన్ మాటలను బట్టి చూస్తే.. పుష్ప, పుష్ప 2 చిత్రాలకు బన్నీ భారీగానే తీసుకున్నట్లు అర్థమవుతుంది. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,742.10 కోట్లు వసూలు చేసింది. అందులో 30 శాతం అంటే..సుమారుగా రూ. 522 కోట్లు సంపాదించి ఉండాలి. పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ. 350.10 కోట్లు వసూలు చేసింది. దీని కోసం సుమారు రూ. 105 కోట్లు అందుకుని ఉండాలి. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చిత్రం చేస్తున్నాడు. రూ.800 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రం బన్నీకి ఎన్ని కోట్లను తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.
Tags : 1