మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
Breaking News
కార్పొరేట్ మిడ్ లెవెల్ మంత్ర
Published on Thu, 04/16/2026 - 06:23
న్యూఢిల్లీ: అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కార్పొరేట్ కంపెనీలు నియామకాల విషయంలో విభిన్న పంథాలో వెళ్తున్నాయి. ప్రధానంగా మధ్య స్థాయి నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. స్టాఫింగ్ సర్వీసెస్, హెచ్‌ఆర్ సొల్యూషన్స్ సంస్థ జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ నివేదిలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల్లో 49 శాతం కంపెనీలు తాము మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్‌ని హైర్ చేసుకోవడంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాయి. సిబ్బందిని పెంచుకోవడానికి సంబంధించి 10–15 శాతానికి మించి గణనీయంగా రిక్రూట్ చేసుకోనున్నట్లు 28 శాతం సంస్థలు, 0–5 శాతం వరకు పెంచుకునే అవకాశాలున్నట్లు 43 శాతం సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి 2,359 మంది సీఎక్స్‌వో స్థాయి లీడర్లు, సీనియర్ ప్రొఫెషనల్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
దీని ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపు ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 34 శాతం సంస్థలు వేతనాల పెంపు 10 శాతానికి మించి ఉండేలా ప్రణాళికలు వేసుకుంటుండగా, 46 శాతం సంస్థల్లో ఒక మోస్తరుగా 5–10 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.
రిపోర్టులోని మరిన్ని కీలకాంశాలు..
→ వేతనాల పెంపు విషయంలో రెగ్యులేటరీ, కార్మిక చట్ట సంస్కరణలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది. మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం 48 శాతంగా ఉండగా, జూనియర్, సీనియర్ స్థాయుల్లో వరుసగా 26, 22 శాతంగా నమోదైంది.
→ అట్రిషన్ అంశం చాలా సంస్థలకు ఆందోళనకర విషయంగా ఉంటోంది. మెజారిటీ 55 శాతం సంస్థలు 10–20 శాతం మేర అట్రిషన్ ఉంటుందని అంచనా వేస్తుండగా, ఇది 20 శాతానికి మించి ఉంటుందని 15 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగుల సెగ్మెంట్‌లో ఇది ఎక్కువగా ఉంటుందని 67 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రాంతీయంగా చూస్తే దక్షిణాది జోన్‌లో అత్యధికంగా అట్రిషన్ ఉంటుందని 55 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.
ఉద్యోగుల ఆకాంక్షలు కూడా దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. పనిపరంగా వెసులుబాట్లు, లక్ష్యాలు, కెరియర్‌లో వేగంగా పురోగమించేందుకు అవకాశాలు మొదలైన విషయాల్లో 50 శాతం పైగా ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. ముఖ్యంగా జెన్ అల్ఫా, జెన్ జెడ్ తరానికి చెందిన యువ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగులను అట్టే పెట్టుకోవాలంటే నిరంతరం వారితో ఎంగేజ్ కావడం, ఫీడ్‌బ్యాక్ ఇస్తుండటం, నేర్చుకునే అవకాశాలు కల్పించడంలాంటివి కీలకాంశాలుగా ఉంటున్నాయని 38 శాతం
కంపెనీలు పేర్కొన్నాయి.
→ ఉద్యోగ భద్రత గురించి ఆందోళనపై మిశ్రమాభిప్రాయాలు నెలకొన్నాయి. వేతనం, వృద్ధి అంశాలతో పోలిస్తే అట్రిషన్‌పై దీని ప్రభావం ఒక మోస్తరుగానే ఉంటుందని లేదా పరిమిత స్థాయిలోనే ఉంటోందని చెరి 43 శాతం సంస్థలు వెల్లడించాయి.
→ 2026–27లో డేటా ఆధారిత వ్యూహాలతో, మిడ్ లెవెల్ నిపుణులు, డిజిటల్ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ, మారే వ్యాపార అవసరాలకు అనుగుణంగా హైరింగ్ ఆచితూచి ఉంటుంది. అట్రిషన్ రేటు పెరుగుతుండటమనేది మరింత పటిష్టమైన ప్లానింగ్, రిటెన్షన్ (ఉద్యోగులు వీడిపోకుండా అట్టే పెట్టుకోవడం) ఆవశ్యకతను తెలియజేస్తోంది.
→ పరిస్థితి, అవసరాలను బట్టి హైర్ చేసుకోవడం, పర్మనెంట్–ప్రాజెక్ట్ ఆధారిత నియామకాల మధ్య సమతౌల్యత పాటించే దిశగా పరిశ్రమ మళ్లుతోంది. వేగం, నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకునే సామర్థ్యాలు, సంస్థ నిలకడగా వృద్ధి చెందేందుకు తోడ్పడే సామర్థ్యాలు మొదలైనవి హైరింగ్‌ని ప్రభావితం చేస్తున్నాయి.
→ డైవర్సిఫికేషన్‌కి పెద్ద పీట వేస్తూ పురుషులు, మహిళా ఉద్యోగుల హైరింగ్‌లో పురుషులు, మహిళల నిష్పత్తి 50:50 స్థాయిలో ఉండేలా 27 శాతం కంపెనీలు చూసుకుంటున్నాయి. ఇది 60:40 స్థాయిలో ఉండేలా చూసుకునేందుకు 31 శాతం కంపెనీలు ప్రయతి్నస్తున్నాయి. అయితే, ఇప్పటికీ పురుషులను రిక్రూట్ చేసుకోవడం వైపే చాలా మటుకు పరిశ్రమలు ఒకింత ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి.
→ చెరో 32 శాతం వాటాతో పశ్చిమ, ఉత్తరాదిలో హైరింగ్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండనున్నాయి. తూర్పు, దక్షిణాది ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Tags : 1