శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
Breaking News
జీవన ఎరువులతో సేద్యానికి జీవం
Published on Tue, 04/07/2026 - 06:28
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల లభ్యత బాగా తగ్గిపోతుండటంతో పాటు.. వాతావరణ మార్పుతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు సాగు పద్ధతుల్లో తగిన మార్పులు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బత్తాయి సాగులో ద్రవ రూప జీవన ఎరువుల వాడకం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని 60%, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని 50% వరకు తగ్గించుకుంటూనే దిగుబడిని, ఆదాయాన్ని పెంచుకోవటం సాధ్యమేనని ఓ రైతు అనుభవపూర్వకంగా చెబుతున్నారు..
బత్తాయి అంటేనే నల్లగొండ జిల్లా గుర్తుకు వస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ఉండే బత్తాయి తోటలు ప్రస్తుతం అనేక సమస్యలతో 40 వేల ఎకరాలకు తగ్గిపోయింది. దశాబ్దాలుగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేలలో పెరిగిన క్షార గుణం వల్ల, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు తగ్గించి, జీవన ఎరువులను ఉపయోగిస్తూ బత్తాయి పంటకు జీవం తెచ్చిన రైతు కట్టెబోయిన శ్రీనివాస్ తోటి రైతులకు మార్గదర్శకంగా నిలిచారు. ఏళ్ల తరబడి వ్యవసాయంలో అతిగా రసాయనిక ఎరువులు వాడకం వల్ల నేలలో సేంద్రియ కర్బనం తగ్గి, దిగుబడులు తగ్గిపోయిన పరిస్ధితుల్లో కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ కోవలోని రైతే గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం బత్తాయి రైతు శ్రీనివాస్.
గత 30 ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్న శ్రీనివాస్ సాగులో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. నేలలో సూక్ష్మజీవరాశి నశించటం వల్ల సమస్యలు ఎదురయ్యాయి. నాణ్యమైన దిగుబడులు లేక లాభాలు తగ్గిపోవటంతో శాస్త్రవేత్తల సూచనల మేరకు గత మూడేళ్లుగా జీవన ఎరువులను వాడుతూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులు వాడటం ప్రారంభించారు. నేల సారాన్ని పెంపొందించి పంటలకు పోషకాలందించే జీవన ఎరువులను బత్తాయి తోటకు ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
ద్రవ రూప జీవన ఎరువులు..
రైతు కట్టెబోయిన శ్రీనివాస్ జీవన ఎరువులైన ట్రై కోడర్మా, బవేరియా, మైకోరైజా, సూడోమోనాస్, వామ్, వేస్ట్ డీ కంపోజర్, పీఎస్బీ, కేఎస్బీ, ఎన్పీకే బ్యాక్టీరియా, జింక్ సాల్యుబుల్ బాక్టీరియా, సీవీడ్ బ్యాక్టీరియా లాంటి సుమారు 40 రకాల ద్రవ రూప జీవన ఎరువుల కల్చర్‌ను పరిశోధనా కేంద్రాల నుంచి తెచ్చుకొని తన తోటలోనే వాటిని అభివృద్ధి చేసి, దశల వారీగా, అవసరాన్ని బట్టి వాడుతున్నారు. ఒక్కో జీవన ఎరువును ఒక్కో డ్రమ్ములో వేసి, తగినంత నీరు, బెల్లం కలిపి, రోజూ కలియ తిప్పుతూ, వాటిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే వరకు నాలుగైదు రోజులు అలాగే ఉంచి, డ్రిప్, జెట్ల ద్వారా నేరుగా బత్తాయి చెట్లకు అందిస్తున్నారు.
మంచి నాణ్యత.. మంచి ధర..
ప్రస్తుతం మార్కెట్‌లో బత్తాయికి తోటల దగ్గర టన్నుకు రూ. 15 వేల నుంచి 20 వేల లోపు పలుకుతోంది. జీవన ఎరువులతో నాణ్యంగా పండించటంతో సైజు, నిగారింపు, నిల్వ సామర్థ్యం పెరిగాయి. దీంతో శ్రీనివాస్ తోటలో బత్తాయిలకు టన్నుకు రూ. 26–27 వేల ధర పలికింది. సాధారణంగా బత్తాయిలో గరిష్ట దిగుబడులు ఎకరాకు పది టన్నులు. అయితే, సరాసరిన ఐదారు టన్నులకు మించి రావటం లేదు. శ్రీనివాస్ ఎనిమిదిన్నర ఎకరాల (6–10 ఏళ్ల తోట)లో ప్రస్తుత ముందు కత్తెర కోతలో 104 టన్నుల దిగుబడి వచ్చింది. వచ్చే జూన్–జూలై సీజన్‌లో మరో 60–70 టన్నుల దిగుబడి వస్తుందని శ్రీనివాస్ ఆశిస్తున్నారు. గత మూడేళ్లుగా జీవన ఎరువులతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ఈ తోటను తెలంగాణ ఉద్యానవన శాఖ కమీషనర్ షేక్ యాస్మిన్ భాషా, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శించి రైతును అభినందించటం విశేషం.
రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందుల అవసరమూ తగ్గింది
గత మూడేళ్లుగా ద్రవ రూప జీవన ఎరువులను వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. రసాయనిక ఎరువులు 60% తగ్గించాను. పురుగుమందుల అవసరం కూడా 40–50% మేరకు తగ్గింది. రసాయనిక వ్యవసాయంలో సాగు వ్యయం ఎకరానికి రూ. 80 వేల నుంచి లక్ష వరకు అవుతుంది. నాకు పశువుల ఎరువు, ద్రవరూప జీవన ఎరువులతో కలిపి రూ. 50–60 వేలు మాత్రమే అయ్యింది. బత్తాయి అనే కాదు ఏ పంటలకైనా జీవన ఎరువులు పనిచేస్తాయి. మీరూ వాడండని ఇతర రైతులకూ చెబుతున్నా. గత ఏడాది వరకూ పెద్దగా స్పందన లేదు. ఈ ఏడాది దిగుబడులు, కమిషనర్ సందర్శించటం చూసి కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
– కట్టెబోయిన శ్రీనివాస్ (98484 53525),
బత్తాయి రైతు, బ్రాహ్మణగూడెం,
గుర్రంపోడు మం., నల్లగొండ జిల్లా
– చింతరెడ్డి వెంకటేశ్వరరెడ్డి,
సాక్షి, గుర్రంపోడు, నల్లగొండ జిల్లా
Tags : 1