పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
40 పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం రద్దు!
Published on Thu, 04/02/2026 - 14:25
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న వేళ భారత ప్రభుత్వం దేశీయ పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు కీలక అడుగు వేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల దేశీయ పరిశ్రమలు కుదేలు కాకుండా చూసేందుకు 40 రకాల కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం పూర్తిగా మాఫీ చేసింది. ఏప్రిల్ 2, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మినహాయింపు జూన్ 30, 2026 వరకు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఎందుకు ఈ నిర్ణయం?
ప్రపంచ పెట్రోకెమికల్ మార్కెట్‌కు పశ్చిమాసియా కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ముడి పదార్థాల లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా భారత తయారీ రంగంపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ‘ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో అవసరమైన ముడి పదార్థాల ధరలను స్థిరీకరించడం ద్వారా దేశీయ తయారీదారులకు రక్షణ కల్పించడమే మా ప్రాథమిక లక్ష్యం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
ప్రయోజనం పొందే రంగాలు, ఉత్పత్తులు
ఈ సుంకాల మాఫీ ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచే ప్రాథమిక ముడి పదార్థాలు, అధునాతన పాలిమర్లపై దృష్టి సారించింది. అందులో.. మిథనాల్, మోనోథిలిన్ గ్లైకాల్, ఫినాల్, ఎసిటిక్ ఆమ్లం, పాలిథిలిన్, పాలీప్రొపైలిన్, పాలీస్టైరిన్, పీవీసీ, ఎపోక్సీ రెసిన్లు, పాలీకార్బోనేట్లు, పీఈటీ చిప్స్ ఉన్నాయి.
లాభపడే పరిశ్రమలు
ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్
టెక్స్‌టైల్
ఫార్మాస్యూటికల్స్
ఆటోమోటివ్
విస్తృత ఆర్థిక వ్యూహం
ఈ నిర్ణయం పరిశ్రమలకు రాయితీ ఇవ్వడంతోపాటు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టే ముందస్తు చర్య అని నిపుణులు చెబుతున్నారు. పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే అది నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. సుంకాల రద్దు ద్వారా ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుంది.
ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?
Tags : 1